31
1 మోషే ఇస్రాయేల్ ప్రజలందరితో ఆ మాటలు చెప్పిన తరువాత వారితో ఇంకా అన్నాడు, 2 ✝“ఇప్పుడు నా వయసు నూట ఇరవై ఏండ్లు, ఇకనుంచి రాకపోకలు నేను చేయలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో చెప్పాడు. 3 ✝మీ దేవుడు యెహోవా తానే మీకు ముందుగా దాటిపోతాడు; అక్కడి జనాలను మీ ఎదుట లేకుండా నాశనం చేస్తాడు. మీరు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టు యెహోషువ మీకు ముందుగా దాటిపోతాడు. 4 తాను నాశనం చేసిన అమోరీవాళ్ళ రాజులు సీహోనుకూ, ఓగుకూ వాళ్ళ దేశానికీ ఏం చేశాడో అదే యెహోవా ఈ జనాలకు కూడా చేస్తాడు. 5 యెహోవా వాళ్ళను మీ వశం చేస్తాడు. నేను మీకిచ్చే ఆజ్ఞల ప్రకారమే మీరు వాళ్ళకు చేయాలి. 6 ✝దృఢంగా ఉండండి! ధైర్యంగా ఉండండి! భయపడకండి! వాళ్ళను చూచి హడలిపోకండి, మీ దేవుడు యెహోవా తానే మీతోపాటు వస్తాడు, ఆయన మిమ్మల్ని చెయ్యి విడువడు. ఏమీ వదలిపెట్టడు.”7 అప్పుడు మోషే యెహోషువను పిలిచి ఇలా అన్నాడు: “నీవు దృఢంగా ఉండు! ధైర్యంగా ఉండు! ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వీకులతో యెహోవా ప్రమాణం చేసిన దేశానికి వీరితోపాటు నీవు వెళ్తావు. వారు దానిని స్వాధీనం చేసుకొనేలా నీవు చేస్తావు. 8 ✝యెహోవా తానే నీకు ముందుగా వెళ్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడువడు. ఏమీ వదిలిపెట్టడు. నిర్భయంగా ఉండు! నిరుత్సాహపడకు!”
9 ✽మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి యెహోవా యొక్క ఒడంబడిక పెట్టెను మోసే యాజులైన లేవీగోత్రికులకూ, ఇస్రాయేల్‌ప్రజల పెద్దలకూ ఇచ్చాడు. 10 అప్పుడు వారికి ఈ ఆజ్ఞ జారీ చేశాడు. “ప్రతి ఏడో సంవత్సరంలో– అప్పులు రద్దుచేసే ఆ నియామక సంవత్సరంలో– పర్ణశాలల పండుగ సమయంలో, 11 ✽మీ దేవుడు యెహోవా ఎన్నుకొన్న స్థలంలో ఇస్రాయేల్ ప్రజలంతా ఆయన సన్నిధానంలో కనిపించడానికి వచ్చేటప్పుడు, వారందరి ఎదుట మీరు ఈ ధర్మశాస్త్రం చదివి వారికి వినిపించాలి. 12 వారు విని నేర్చుకొని, మీ దేవుడైన యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నిటి ప్రకారం ప్రవర్తించేలా మీరు వారిని సమకూర్చాలి. పురుషులనూ, స్త్రీలనూ, పిల్లలనూ, మీ గ్రామాలలో నివసించే విదేశీయులనూ సమకూర్చాలి. 13 ఈ విధంగా అంతకుముందు ధర్మశాస్త్రం తెలియని వారి పిల్లలు వినాలి, మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటిపోబొయ్యే దేశంలో మీరు బ్రతికే రోజులన్నీ వారు మీ దేవుడైన యెహోవాపట్ల భయభక్తులతో ప్రవర్తించడానికి నేర్చుకోవాలి.”
14 ఆ తరువాత యెహోవా మోషేతో “ఇదిగో విను, నీవు చనిపోవలసిన రోజు దగ్గరపడింది. యెహోషువను పిలువు. నేను అతనికి ఆజ్ఞ జారీ చేసేలా మీరిద్దరూ వచ్చి సన్నిధిగుడారంలో నిలబడాలి” అన్నాడు.
గనుక మోషే, యెహోషువ వెళ్ళి సన్నిధి గుడారంలో నిలబడ్డారు. 15 ✝అప్పుడు గుడారం పైగా మేఘస్తంభంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. ఆ మేఘం గుడారం ద్వారం పైగా నిలిచింది. 16 ✝యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
“ఇదిగో విను. నీవు కన్నుమూసి నీ పూర్వీకుల దగ్గర చేరబోతున్నావు. ఈ ప్రజలు ఎవరి దేశం చేరి, ఏ జనాల మధ్య ఉండబోతున్నారో ఆ జనాల దేవుళ్ళ వెంట వ్యభిచారులలాగా వెళ్ళి, నన్ను వదలివేస్తారు; నేను వారితో చేసిన ఒడంబడికను మీరుతారు. 17 ఆ కాలంలో నా కోపాగ్ని వారిమీద రగులు కొంటుంది. నేను వారిని విడిచి, నా ముఖం కనబడకుండా మరో వైపు త్రిప్పుతాను, వారు నాశనమవుతారు. అనేక ఆపదలూ బాధలూ వారిని గురిచేసుకొని వారిని మ్రింగివేస్తాయి. ఆ రోజుల్లో వారు ‘మన దేవుడు మన మధ్య ఉండకపోవడంచేతనే గదా ఈ ఆపదలు మన మీదికి వచ్చాయి’ అని చెప్పుకొంటారు. 18 వారు ఇతర దేవుళ్ళవైపు తిరగడం అనే దుర్మార్గం కారణంగా ఆ కాలంలో నేను వారినుంచి నా ముఖం అటువైపు త్రిప్పితీరుతాను. 19 ✝కాబట్టి మీరిద్దరు ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేల్ ప్రజలకు నేర్పాలి. ఈ కీర్తన ఇస్రాయేల్ ప్రజల మీద నాకు సాక్షిలాగా ఉండేలా దానిని వారికి కంఠపాఠంగా చేయాలి. 20 ✝నేను వారి పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు, పాలుతేనెలు నదులై పారుతూ ఉన్న దేశంలో వారిని చేర్చిన తరువాత, వారు తిని, త్రాగి, తృప్తిపొంది, క్రొవ్వినవారవుతారు, ఇతర దేవుళ్ళవైపు తిరిగి, ఆ దేవుళ్ళను కొలిచి, నన్ను తృణీకరించి, నా ఒడంబడిక మీరుతారు. 21 అనేక ఆపదలూ బాధలూ వారికి ప్రాప్తించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిలాగా ఉండి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది (ఈ కీర్తన వారి సంతతివారి నోట ఉంటుంది. వారు దీనిని మరచిపోరు), నేను ప్రమాణం చేసిన దేశంలో వారిని చేర్చేముందే, ఈ రోజు వారు చేసే ఆలోచన నాకు తెలుసు.”
22 అందుచేత మోషే ఆ రోజే ఈ కీర్తన రాసి, ఇస్రాయేల్ ప్రజలకు నేర్పాడు. 23 యెహోవా యెహోషువకు ఆజ్ఞ జారి చేస్తూ అన్నాడు:
“దృఢంగా ఉండు! ధైర్యంగా ఉండు! నేను ఇస్రాయేల్ ప్రజలతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వారిని తీసుకువెళ్ళాలి. నేను నీకు తోడుగా ఉంటాను.”
24 ✝ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నీ మోషే ఒక గ్రంథంలో రాయడం ముగించాక 25 యెహోవా ఒడంబడిక పెట్టెను మోసే లేవీగోత్రికులకు మోషే ఇలా ఆజ్ఞాపించాడు: 26 “ఈ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని మీ దేవుడు యెహోవా ఒడంబడికపెట్టె ప్రక్కన ఉంచండి. అది అక్కడ మీ మీద సాక్షిగా ఉంటుంది. 27 ✝తిరగబడే మీ మనస్తత్వమూ మీ తలబిరుసుతనమూ నాకు తెలుసు. నేను బ్రతికినన్నాళ్ళూ, మీతో ఉన్నన్నాళ్ళూ మీరు యెహోవా మీద తిరగబడేవారు. నేను చనిపోయిన తరువాత మీరు ఇంకెక్కువగా అలా చేస్తారు గదా! 28 ✝కనుక మీ గోత్రాల పెద్దలందరినీ, మీ నాయకులను నా దగ్గరికి పోగుచేయండి. నేను ఈ మాటలు వారికి వినిపించి, ఆకాశం, భూమి వారి మీద సాక్ష్యమిచ్చేలా వాటిని పిలుస్తాను. 29 ఎందుకని? నేను చనిపోయాక మీరు తప్పకుండా చెడిపోతారని నాకు తెలుసు. నేను మీకాజ్ఞాపించే మార్గంనుంచి తొలగిపోతారనీ తెలుసు. యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి మీ చేతులతో చేసినవాటివల్ల ఆయనకు కోపం పుట్టిస్తారు. అందుచేత చివరి రోజుల్లో విపత్తులు మీకు వస్తాయి.”
30 అప్పుడు మోషే ఇస్రాయేల్ ప్రజల సర్వసమాజానికి ఈ కీర్తన మాటలన్నీ పలికాడు: