30
1 ✽నేను మీకు వినిపించిన ఈ సంగతులన్నీ – ఈ దీవెనలూ, ఈ శాపాలు– మీమీదికి వచ్చాక, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని వెళ్ళగొట్టించిన సమస్త జనాలలో మీరు వీటిని జ్ఞాపకం చేసుకొంటారు. 2 ✽అప్పుడు మీరూ మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే, 3 ✽ మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు. మీ దేవుడు యెహోవా ఏ జనాలలోకి మిమ్మల్ని చెదరగొట్టాడో ఆ జనాలన్నిటిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు. 4 చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి కొనలలో ఉన్నా, అక్కడనుంచి కూడా మీ దేవుడు యెహోవా మిమ్మల్ని సమకూర్చి తీసుకువస్తాడు. 5 మీ పూర్వీకులు స్వాధీనం చేసుకొన్న దేశానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దానిని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకులకంటే మిమ్మల్ని సంఖ్యలో అధికం చేస్తాడు. 6 ✝మీరు బ్రతకాలని, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ దేవుడు యెహోవాను ప్రేమించేలా ఆయన మీ హృదయాలకు, మీ పిల్లల హృదయాలకు సున్నతి✽ చేస్తాడు. 7 ✝మీ దేవుడు యెహోవా ఈ శాపాలన్నీ మీ శత్రువులమీదికి, మిమ్మల్ని ద్వేషించి హింసించిన వాళ్ళమీదికి తెప్పిస్తాడు. 8 మీరు తిరిగి వచ్చి యెహోవా మాట వింటూ ఉంటారు. ఈవేళ నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటిప్రకారం ప్రవర్తిస్తారు. 9 ✝అప్పుడు మీరు మీ దేవుడు యెహోవా మాట వింటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్న ఆయన ఆజ్ఞల, చట్టాల ప్రకారం ప్రవర్తిస్తే, మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ దేవుడు యెహోవా వైపు తిరిగితే, 10 మీ దేవుడు యెహోవా ఇలా చేస్తాడు. మీ చేతులతో చేసే పనులన్నిటిలో, మీ సంతానం విషయంలో, మీ పశువుల పిల్లల విషయంలో, మీ పొలం పంటల విషయంలో మీకు గొప్ప అభివృద్ధి ప్రసాదిస్తాడు. మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు యెహోవా మిమ్మల్ని గురించి మళ్ళీ సంతోషిస్తాడు.11 ✽ ఈరోజు నేను మీకిచ్చే ఈ ఆజ్ఞను గ్రహించడం మీకు కష్టమైనది కాదు, దూరమైనదీ కాదు. 12 “మనం విని దాని ప్రకారం చేసేలా మనకోసం ఎవరు పరలోకానికి ఎక్కిపోయి మనదగ్గరికి దానిని తెస్తారు?” అని మీరు చెప్పుకోవడానికి అది ఆకాశంలో ఉండేది కాదు. 13 “మనం అది విని దాని ప్రకారం చేసేలా మనకోసం ఎవరు సముద్రం దాటి మన దగ్గరికి దానిని తెస్తారు?” అని మీరనడానికి అది సముద్రం అవతల ఉండేది కాదు. 14 మీరు దాని ప్రకారం చేయడానికి ఆ వాక్కు మీ సమీపంలోనే ఉంది. అది మీ నోట్లోనూ మీ హృదయంలోనూ ఉంది.
15 ✝చూడండి, ఈవేళ నేను జీవాన్ని, మేలును, మరణాన్ని, కీడును మీ ఎదుట ఉంచాను. 16 ✝మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ, ఆయన విధానాలలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలు, చట్టాలు, న్యాయ నిర్ణయాలు ఆచరణలో పెట్టుకోవాలని ఈవేళ మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు జీవిస్తారు. సంఖ్యలో అధికం అవుతారు. మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు. 17 ✝కానీ మీ హృదయం తొలగిపోయి, మీరు లోబడకపోతే, జారిపోయి, ఇతర దేవుళ్ళను పూజించి కొలిస్తే, మీరు తప్పనిసరిగా నాశనం అవుతారు. 18 స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటిపోబొయ్యే దేశంలో మీరు చాలాకాలం జీవించరు. అది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. 19 ✽జీవాన్ని మరణాన్ని, దీవెనను శాపాన్ని మీ ఎదుట ఉంచానని ఈవేళ ఆకాశాన్నీ భూమినీ సాక్షులుగా పిలుస్తున్నాను. మీరూ మీ సంతానమూ బ్రతికేలా జీవాన్ని కోరుకోండి. 20 మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు యెహోవా ప్రమాణం చేసిన దేశంలో నివసించేలా మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మాట వింటూ, ఆయనను ఏమాత్రం విడవకుండా ఉండడం అనేదానిని కోరుకోండి. అలా చేయడమే మీకు జీవం, దీర్ఘాయువు.