29
1 ✽యెహోవా హోరేబులో ఇస్రాయేల్ ప్రజలతో చేసిన ఒడంబడిక గాక, ఆయన మోయాబుదేశంలో వారితో చేయాలని మోషేకాజ్ఞాపించిన ఒడంబడిక వాక్కులు ఇవే.2 మోషే ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిపించి వారితో ఇలా అన్నాడు: యెహోవా ఈజిప్ట్‌దేశంలో మీ కళ్ళెదుటే ఫరోకూ అతని పరివారానికీ అతడి దేశమంతటికీ చేసినదంతా మీరు చూశారు. 3 ఆ గొప్ప విషమ పరీక్షలూ, అద్భుతమైన సూచనలూ, మహాక్రియలు మీకు కనిపించాయి. 4 ✽ అయినప్పటికీ గ్రహించే మనస్సును, చూచే కండ్లను వినే చెవులను యెహోవా నేటివరకూ మీకివ్వలేదు.
5 “నేను మీ దేవుడు యెహోవానని మీరు తెలుసుకోవాలని నలభై సంవత్సరాలు ఎడారిలో వెళ్ళవలసిన దారి మీకు చూపుతూ వచ్చాను. మీ ఒంటిమీద బట్టలూ, కాళ్ళ చెప్పులు పాతపడలేదు. 6 ✝మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షరసం గానీ, మద్యం గానీ త్రాగలేదు” అని యెహోవా చెపుతున్నాడు.
7 ✝మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు యుద్ధానికి మనమీదికి వచ్చారు గాని 8 ✝మనం వాళ్ళను రూపుమాపి, వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొని, రూబేను గోత్రికులకూ గాదు గోత్రికులకూ మనష్షే అర్ధ గోత్రంవారికీ దానిని వారసత్వంగా ఇచ్చాం. 9 ✝గనుక మీరు చేసే ప్రతి పనిలో వర్ధిల్లేలా ఈ ఒడంబడిక వాక్కులను పాటించి వాటిప్రకారం ప్రవర్తిస్తూ ఉండండి.
10 ఈరోజు మీరంతా మీ దేవుడు యెహోవా సన్నిధానంలో నిలుచున్నారు. మీ నాయకులూ, గోత్రాలవారూ, పెద్దలూ, అధిపతులూ – ఇస్రాయేల్ ప్రజలంతా – 11 మీ చిన్నవారూ, భార్యలూ, మీ శిబిరంలోని విదేశీయులూ (మీకు కట్టెలు నరికేవారు మొదలుకొని మీకు నీళ్ళు తోడేవారి వరకు) – అందరూ ఇక్కడ నిలుచున్నారు. 12 ✽ఈవేళ మిమ్మల్ని తనకు స్వప్రజగా సుస్థిరం చేసుకొని తానే మీకు దేవుడై ఉండాలని మీ దేవుడు యెహోవా సంకల్పించాడు. ఇది తాను మీతో చెప్పినట్టే, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చెప్పిన ప్రకారంగానే. 13 మీ దేవుడు యెహోవా ఈవేళ మీతో చేస్తున్న ఒడంబడిక మీరు అంగీకరించి, ఆయన వాగ్దానం చేసినదానిలో పాల్గొనడానికి మీరంతా ఇక్కడ నిలుచున్నారు.
14 నేను ఈ ఒడంబడిక, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు. 15 ఇక్కడ మనతో కూడా మన దేవుడు యెహోవా సన్నిధానంలో నిలబడివున్నవారితోనూ, ఈవేళ ఇక్కడ మనతోకూడా ఉండని వారితోనూ చేస్తున్నాను. 16 మనం ఈజిప్ట్‌దేశంలో నివసించిన సంగతి మీకు తెలుసు. ప్రయాణమై వచ్చి, వేరు వేరు జనాల మధ్యనుంచి మనం దాటివచ్చిన సంగతి కూడా తెలుసు. 17 వాళ్ళ అసహ్య విగ్రహాలు, దేవుళ్ళ ప్రతిమలు – కొయ్య, రాతి, వెండి, బంగారు విగ్రహాలు – మీకు కనిపించాయి. 18 ✽ ఆ జనాల దేవుళ్లను కొలవడానికి మన దేవుడు యెహోవా నుంచి తొలగే హృదయం మీలో ఏ పురుషుడికీ ఏ స్త్రీకీ ఏ కుటుంబానికీ ఏ గోత్రానికీ ఉండకూడదు. అలాంటి చేదైన విషం పుట్టించే మూలాధారం మీమధ్య ఉండకూడదు. 19 ✽అలాంటి మనసు గలవాడు ఈ శాపవాక్కులు విన్నప్పుడు లోలోపల తనను పొగడుకొంటూ “నా మొండి హృదయాన్ని అనుసరించి ప్రవర్తించినా నాకు క్షేమమే కలుగుతుంది” అనుకొంటాడు. అయితే దానివల్ల ఆరిన ప్రాంతంతో కూడా నీళ్ళున్న ప్రాంతం పాడైపోతుంది. 20 యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం వాడిమీద రగులుకొంటాయి. ఈ గ్రంథంలో రాసివున్న శాపాలన్నీ వాడికి తగులుతాయి. వాడి పేరు ఆకాశంక్రింద ఉండకుండా యెహోవా తుడిచివేస్తాడు. 21 ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్న ఒడంబడిక శాపాలన్నిటి ప్రకారం వాడికి కీడు చేయడానికి యెహోవా ఇస్రాయేల్ ప్రజల గోత్రాలన్నిట్లోనుంచి వాణ్ణి వేరుపరుస్తాడు.
22 ✝రాబోయే తరంవారు – మీ తరువాత జన్మించే మీ సంతతివారు – దూర దేశం నుంచి వచ్చే విదేశీయులు మీ దేశానికి యెహోవా చేసినది చూస్తారు. 23 దానిలో వచ్చిన తెగుళ్ళూ రోగాలూ చూస్తారు. దేశమంతా గంధకంచేత, ఉప్పుచేత చెడిపోయి, ఎండిపోయి ఉండడం చూచి, అది ఫలించని, ఏ మొక్క మొలవని బీడు భూమిగా ఉండడం చూచి, యెహోవా తన కోపోద్రేకంచేత నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీంలాగా అది ఉండడం చూచి అన్ని దేశాల వాళ్ళు ఇలా అంటారు: 24 ✝“యెహోవా ఈ దేశాన్ని ఎందుకు ఇలా చేశాడు? ఈ మహా తీవ్ర కోపానికి కారణమేమిటి?”
25 ✝అందుకు జవాబిస్తూ కొందరు ఇలా చెపుతారు. “ఎందుకని? వారి పూర్వీకుల దేవుడు యెహోవా వారిని ఈజిప్ట్‌దేశం నుంచి తీసుకువచ్చాక, ఆయన వారితో చేసిన ఒడంబడికను వారు నిరాకరించారు. 26 తమకు తెలియని దేవుళ్ళను, పూజించకూడదని యెహోవా చెప్పిన దేవుళ్ళను, కొలిచి పూజించారు. 27 ✝అందుకనే ఈ దేశంమీద యెహోవా కోపాగ్ని రగులుకొంది; ఈ గ్రంథంలో రాసివున్న శాపాలన్నిటినీ ఈ దేశంమీదికి తెప్పించాడు. 28 ✝యెహోవా తన కోపం, ఆగ్రహం, మహా ఉగ్రతలచేత వారిని వారి దేశంలో లేకుండా నిర్మూలించి, వేరే దేశానికి వెళ్ళగొట్టాడు. ఈ రోజువరకు వారక్కడే ఉన్నారు.”
29 ✽రహస్య సంగతులు మన దేవుడు యెహోవాకు చెందుతాయి. ఆయన వెల్లడి చేసినవి మనకూ మన సంతానానికీ సదాకాలం చెందుతాయి. ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నిటి ప్రకారమూ మనం ప్రవర్తించాలని ఇందులో ఉన్న ఉద్దేశం.