28
1 ✽మీ దేవుడు యెహోవా మాట మీరు శ్రద్ధగా వింటూ, నేను ఈ రోజు మీకిచ్చే ఆజ్ఞలన్నిటిప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే, మీ దేవుడు యెహోవా భూమిమీద ఉన్న సమస్త జనాలకంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. 2 మీరు మీ దేవుడు యెహోవా మాట వింటూ ఉంటే ఈ దీవెనలన్నీ మిమ్మల్ని అందుకొని మీమీదికి వస్తాయి: 3 ✽పట్టణంలో మీమీదికి దీవెనలు వస్తాయి. పొలంలో – దీవెనలు వస్తాయి. 4 మీ సంతానంమీద, మీ భూఫలాలమీద, మీ పశువుల పిల్లలమీద – మీ ఆవు, గొర్రె, మేకల పిల్లలమీద దీవెనలు ఉంటాయి. 5 మీ గంప విషయం, పిండిపిసికే మీ తొట్టి విషయం దీవెనలు అనుభవిస్తారు. 6 మీరు లోపలికి వచ్చినప్పుడు మీమీద దీవెనలు, బయటికి వెళ్ళినప్పుడు మీమీద దీవెనలు ఉంటాయి. 7 మీమీద పడే మీ శత్రువులు మీ ఎదుటే హతమయ్యేలా యెహోవా చేస్తాడు. వాళ్ళు ఒకే ఒక త్రోవలో మీకు ఎదురు వస్తారు, ఏడు త్రోవలలో మీ ఎదుటనుంచి పారిపోతారు. 8 మీ ధాన్య గిడ్డంగులలో, మీరు చేసే ప్రయత్నాలన్నిట్లో మీరు దీవెనలు అనుభవించేలా యెహోవా చేస్తాడు. మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.9 మీరు మీ దేవుడు యెహోవా ఆజ్ఞలు పాటిస్తూ ఆయన విధానాల్లో నడుచుకుంటూ ఉంటే, తాను మీకు ప్రమాణం చేసినట్టు యెహోవా తనకోసం మిమ్మల్ని పవిత్ర ప్రజగా స్థాపిస్తాడు. 10 మీకు ‘తనవారు’ అనే పేరు యెహోవా పెట్టాడని లోకంలో జనాలంతా గ్రహించి మిమ్మల్ని మీ గురించి భయంతో ఉంటారు. 11 యెహోవా మీకిస్తానని మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా మీ సంతానం విషయంలో, మీ పశువుల పిల్లల విషయంలో, మీ పొలాల పంటల విషయంలో మీకు చాలా అభివృద్ధి కలిగిస్తాడు. 12 మీరు చేసే పనులన్నిటిమీద ఆశీస్సులు వచ్చేలా మీ దేశంమీద వాన దాని కాలంలో వచ్చేలా యెహోవా ఆకాశం అనే తన ఖజానా తెరుస్తాడు. మీరు అనేక జనాలకు అప్పిస్తారు గాని అప్పు చేయరు. 13 ఈరోజు నేను మీకు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు ఇస్తున్నాను. మీరు వాటిని విని ఆ ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే, 14 ఈ రోజు నేను మీకాజ్ఞాపించే మాటల్లో ఏ మాటనుంచీ కుడికి గానీ, ఎడమకు గానీ తొలగకుండా, ఇతర దేవుళ్ళను అనుసరించకుండా కొలవకుండా ఉంటే, యెహోవా మిమ్మల్ని తలగా చేస్తాడు గాని తోకగా కాదు. మీరు పైవారుగా ఉంటారు, గాని క్రిందివారు కాదు.
15 ✽కానీ మీ దేవుడు యెహోవా చెప్పిన మాట మీరు వినకపోతే, ఈరోజు నేను ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటినీ చట్టాలన్నిటినీ పాటించి వాటి ప్రకారం ప్రవర్తించకుండా ఉంటే, ఈ శాపాలన్నీ మీకు తగులుతాయి: 16 పట్టణంలో మీకు శాపం ప్రాప్తిస్తుంది. పొలంలో మీకు శాపం ప్రాప్తిస్తుంది. 17 మీ గంపకూ, మీ పిండిపిసికే తొట్టికీ శాపం ప్రాప్తిస్తుంది. 18 మీ సంతానానికీ మీ భూఫలాలకూ మీ ఆవుల, గొర్రెల, మేకల పిల్లలకూ శాపం ప్రాప్తిస్తుంది. 19 మీరు లోపలికి వచ్చేటప్పుడు శాపం, బయటికి వెళ్ళేటప్పుడు శాపం ప్రాప్తిస్తుంది.
20 ✽మీరు నన్ను విడచి, చేసిన దుర్మార్గాల కారణంగా మీరు ధ్వంసమై, త్వరలో నశించేవరకు మీరు చేయబూనుకొనే పనులన్నిటిల్లో యెహోవా శాపాన్ని, అవహేళనను, చీవాట్లను మీ మీదికి పంపిస్తాడు. 21 ✝మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో లేకుండా నాశనమయ్యేవరకు రోగాలు మీకు అంటుకొని ఉండేలా యెహోవా చేస్తాడు. 22 యెహోవా క్షయరోగంచేత, చలి జ్వరంచేత, వేడి వాపులచేత, మహా తాపంచేత, వర్షంలేమిచేత, కంకి కాటుకచేత, బూజుచేత మిమ్మల్ని మొత్తుతాడు. మీరు నాశనమయ్యేవరకు అవి మిమ్మల్ని తరుముతుంటాయి. 23 ✝మీ తలమీద ఆకాశం కంచులాగా, మీ క్రింద ఉన్న నేల ఇనుములాగా ఉంటాయి. 24 మీ దేశంలో వానకు బదులు దుమ్ము, ఇసుక వచ్చిపడేలా యెహోవా చేస్తాడు. మీరు నశించిపొయ్యేవరకు అలాంటి వర్షమే ఆకాశం నుంచి మీమీద కురుస్తుంది.
25 ✝అంతేగాక, మీ శత్రువులు మిమ్మల్ని ఓడగొట్టేలా యెహోవా చేస్తాడు. మీరు ఒకే త్రోవలో వాళ్ళకు ఎదురుగా బయలుదేరుతారు, ఏడు త్రోవలలో వాళ్ళ బారినుంచి పారిపోతారు. లోకంలో అన్ని రాజ్యాలకూ మీరు అసహ్యం పుట్టించే దృశ్యంలాగా ఉంటారు. 26 ✝గాలిలో ఎగిరే అన్ని రకాల పక్షులకూ భూమృగాలకూ మీ శవాలు ఆహారం అవుతాయి. వాటిని బెదిరించి వెళ్ళగొట్టే వాడెవ్వడూ ఉండడు.
27 యెహోవా ఈజిప్ట్ కురుపుచేత, మూలవ్యాధిచేత, చర్మవ్యాధులచేత, గజ్జిచేత మిమ్మల్ని బాధిస్తాడు. మీరు వాటిని పోగొట్టుకోలేకపోతారు. 28 యెహోవా మిమ్మల్ని వెర్రితనంతో గుడ్డితనంతో హృదయ దిగ్భ్రమతో మొత్తుతాడు. 29 గుడ్డివాడు చీకటిలో తడువులాడుతూ ఉన్నట్టు మీరు మధ్యాహ్న సమయంలో తడువులాడుతూ ఉంటారు. మీరు చేసే పనులలో అభివృద్ధి చెందరు. రోజు రోజుకు ఇతరులు మిమ్మల్ని బాధిస్తారు, దోచుకుంటారు. మిమ్మల్ని రక్షించేవాడు అంటూ ఎవ్వడూ ఉండడు. 30 ✝ఒకామెను ప్రధానం చేసుకొంటే మరో అతను ఆమెతో పోతాడు. ఇల్లు కట్టినా దానిలో కాపురం ఉండరు. ద్రాక్షతోట నాటితే దాని పళ్ళు తినరు. 31 మీ కళ్ళెదుటే మీ ఎద్దును వధించడం జరుగుతుంది గానీ దాని మాంసం మీరు తినరు. మీ గాడిదను మీ ముందునుంచి దోచుకోవడం జరుగుతుంది. దానిని మీ దగ్గరికి మళ్ళీ తేవడం జరగదు. మీ గొర్రె మేకలు మీ శత్రువుల వశం అవుతాయి. మీకు సహాయం చేసే వాడెవ్వడూ ఉండడు. 32 మీ కొడుకులూ కూతుళ్ళూ ఇతర జనాల స్వాధీనం అవుతారు. వారికోసం రోజంతా చూచి, చూచి మీ కండ్లు కాయలు కాస్తాయి. అంతేగాని మీకు చేతనయ్యేది ఏమీ ఉండదు. 33 ✝మీకు తెలియని జనం మీ పొలం పంటలు, మీ కష్టార్జితమంతా తినివేస్తుంది. మీరు హింసకే బాధకే ఎప్పుడూ గురి అవుతూ ఉంటారు. 34 మీ కళ్ళెదుటే జరుగుతూ ఉండేవి చూచి వెర్రివారవుతారు. 35 అరికాలినుంచి నడినెత్తివరకు, మోకాళ్ళమీద, తొడలమీద కుదరని చెడు పుండ్లు పుట్టించి యెహోవా మిమ్మల్ని బాధిస్తాడు. 36 ✝మిమ్మల్ని, మీరు మీమీద నియమించుకోబోయే మీ రాజునూ వేరే దేశప్రజల దగ్గరికి చేరుస్తాడు. ఆ ప్రజలు మీరు గానీ మీ పూర్వీకులు గానీ ఎరిగిన ప్రజలు కారు. అక్కడ మీరు కొయ్యదేవుళ్ళను, రాతి దేవుళ్ళను కొలుస్తారు. 37 ✝యెహోవా మిమ్మల్ని చేర్చే అన్ని దేశాల ప్రజలలో మీరు ఆశ్చర్యానికీ సామెతకూ నిందకూ కారణమవుతారు.
38 ✝మీరు చాలా విత్తనాలు పొలంలోకి తీసుకుపోయి, కొంచెమే ఇంటికి తెస్తారు. ఎందుకంటే మిడతలు మీ పంట తినివేస్తాయి. 39 మీరు ద్రాక్షతోటలు నాటుతారు, వాటిని బాగు చేస్తారు గాని ద్రాక్షపండ్లు సేకరించరు. ద్రాక్షరసం తాగరు. పురుగులు ఆ పండ్లు తినివేస్తాయి. 40 మీ ప్రాంతాలలో ఆలీవ్ చెట్లు ఉంటాయి గాని ఆలీవ్ నూనెతో తలను అంటుకోరు. ఆ ఆలీవ్ కాయలు రాలిపోతాయి. 41 మీకు కొడుకులూ కూతుళ్ళూ కలుగుతారు గాని వారు మీ దగ్గర ఉండరు. వారు బందీలుగా వేరు దేశానికి వెళ్తారు. 42 మీ చెట్లన్నీ, మీ పొలం పంటలు మిడతల గుంపులు ఆక్రమించుకొంటాయి. 43 మీ మధ్య ఉన్న విదేశీయులు మీ కంటె ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. మీరు క్షీణించిపోతూ ఉంటారు. 44 వాళ్ళు మీకు అప్పులిస్తారు గాని మీరు వాళ్ళకు అప్పులియ్యలేకపోతారు. వాళ్ళు తలగా ఉంటారు, మీరు తోకగా ఉంటారు.
45 మీరు మీ దేవుడైన యెహోవా మాట వినక, ఆయన మీకిచ్చిన ఆజ్ఞల, చట్టాల ప్రకారం ప్రవర్తించకపోవడం చేతనే మీరు నశించేవరకు ఈ శాపాలన్నీ మిమ్మల్ని తరిమి అందుకొని, మీ మీద పడుతాయి. 46 అవి చిరకాలం మీ మీదా మీ సంతానం మీదా సూచనగా, ఆశ్చర్యకారణంగా ఉంటాయి. 47 మీకు అంతా సమృద్ధిగా ఉన్నా మీరు సంతోషంతో, సంబరంతో మీ దేవుడు యెహోవాకు సేవ చేయకపోవడం చేత, 48 ✝మీ మీదికి యెహోవా రప్పించే మీ శత్రువులకు సేవ చేస్తారు. ఆకలిదప్పులతో, వస్త్రహీనతతో, ప్రతి విధమైన లేమితో వారికి సేవ చేస్తారు. వారు మిమ్మల్ని నాశనం చేసేవరకు మీ మెడలమీద ఇనుప కాడి ఉంచుతారు. 49 ✝చాలా దూరంగా ఉన్న – భూలోకం కొననుంచి – ఒక జనాన్ని యెహోవా మీ మీదికి రప్పిస్తాడు. ఆ ప్రజాభాష మీకు రాదు. ఆ జనం గద్ద ఎగిరివచ్చేట్టు మీ మీదికి వస్తుంది. 50 వాళ్ళ ముఖ ఆకృతి క్రూరంగా ఉంటుంది. వృద్ధులనీ, పసివారనీ వాళ్ళు దయ చూపరు. 51 మీరు నాశనం అయ్యేవరకు వాళ్ళు మీ పశువులను, మీ పొలాల పంటలను తినివేస్తారు. మిమ్మల్ని నాశనం చేసే వరకు ధాన్యాన్ని గానీ, ద్రాక్షరసాన్ని గానీ, నూనెను గానీ, పశువులను గానీ, గొర్రెమేకలను గానీ మీకు మిగలనివ్వరు. 52 ✝మీరు ఆశ్రయించే ఎత్తయిన ప్రాకారాలు కూలిపోయేవరకు మీ దేశమంతటా, మీ అన్ని పట్టణాలలో మిమ్మల్ని ముట్టడి వేస్తారు. మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో అంతా మీ పట్టణాలన్నిటిలోనూ మిమ్మల్ని ముట్టడి వేస్తారు. 53 అప్పుడు ముట్టడితోనూ, మీ శత్రువులు మిమ్మల్ని పెట్టె ఇబ్బందిలోనూ మీ సంతానాన్ని – మీ దేవుడు యెహోవా మీకిచ్చే మీ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తింటారు. 54 మీలో మృదువైన స్వభావం, చాలా సుకుమారం గల వ్యక్తి కూడా తన సొంత పిల్లల శరీరాలను తింటూ, వాటిలో కొంచమైనా తన తోబుట్టువుకూ, తన ప్రియ భార్యకూ, తన మిగతా పిల్లలకూ పెట్టకుండా వారివైపు విషం చూపులు చూస్తాడు. 55 ఎందుకంటే తినడానికి అతడికి మిగిలినదేమీ ఉండదనుకుంటాడు. మీ శత్రువులు మీ గ్రామాలన్నిట్లో మిమ్మల్ని పెట్టే ఇబ్బందిలో, ముట్టడిలో అలా జరుగుతుంది. 56 మీలో మృదువైన, సున్నితమైన స్త్రీ, నేలమీద తన అరికాలు మోపడానికి తెగించలేనంతటి మృదువైన, సున్నితమైన స్త్రీకూడా తన కాళ్ళమధ్య నుంచి పడే మావిని, తాను కనే పిల్లలను రహస్యంగా తింటుంది. 57 తన ప్రియ భర్తవైపు, తన కొడుకువైపు, తన కూతురువైపు విషం చూపులు చూస్తుంది. ఎందుకంటే, తినడానికి ఆమెకు మిగిలినది ఏమీ ఉండదనుకొంటుంది. మీ శత్రువులు మీ గ్రామాలలో మిమ్మల్ని పెట్టే ఇబ్బందిలో, వేసే ముట్టడిలో అలా జరుగుతుంది.
58 ✽ఈ గ్రంథంలో రాసి ఉన్న ధర్మశాస్త్ర వాక్కులన్నీ పాటించి, వాటి ప్రకారం ప్రవర్తించకపోతే, “మీ దేవుడు యెహోవా” అనే ఘనమైన పేరుకు – భయభక్తులకు పాత్రమైన ఆ పేరుకు – భయపడకుండా ఉంటే, 59 ✽యెహోవా మీకూ మీ సంతానానికీ విపరీతమైన వ్యాధులు కలిగిస్తాడు. అవి దీర్ఘ కాలం ఉండే కఠిన వ్యాధులూ చెడు రోగాలూ అయివుంటాయి. 60 ఈజిప్ట్‌లో ఉన్న రోగాలన్నీ ఆయన మీ మీదికి రప్పిస్తాడు. ఆ రోగాలకు మీరు భయపడ్డారు గదా. అవి మిమ్మల్ని అంటుకొని ఉంటాయి. 61 మీరు నశించిపోయే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉండని అన్ని వ్యాధులు, రోగాలు కూడా ఆయన మీకు కలిగిస్తాడు. 62 ✝మీరు మీ దేవుడు యెహోవా మాట వినకపోవడం చేత మీరు సంఖ్యలో తక్కువై కొద్దిమందే మిగిలివుంటారు. అంతకుముందు మీరు లెక్కకు ఆకాశ నక్షత్రాల లాగా ఉన్నారు. 63 ✽మీకు మేలు చేయడంలో మీ సంఖ్య అధికం చేయడంలో యెహోవా మిమ్మల్ని గురించి సంతోషించాడు. అప్పుడు మిమ్మల్ని నాశనం చేసి నిర్మూలించడంలో యెహోవా సంతోషిస్తాడు. కనుక మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించబోయే దేశంనుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది. 64 ✝భూతలం ఈ కొననుంచి ఆ కొనవరకు అన్ని జనాల మధ్యకు యెహోవా మిమ్మల్ని చెదరగొట్టివేస్తాడు. అక్కడ కొయ్యతో, రాతితో చేసిన ఇతర దేవుళ్ళను మీరు కొలుస్తారు. ఆ దేవుళ్ళు మీకు గానీ, మీ పూర్వీకులకు గానీ తెలియదు. 65 ✽ ఆ జనాలమధ్య మీకు నెమ్మది అంటూ ఉండదు. మీ అరికాలికి కూడా విశ్రాంతి కలగదు. అక్కడ మీ గుండెలు కంపించేలా, మీ కండ్లు మసకబారేలా, మీ ప్రాణాలు క్రుంగిపోయేలా యెహోవా చేస్తాడు. 66 మీరు బ్రతుకుతారో చస్తారో మీకు అనుమానంగా ఉంటుంది. రాత్రింబగళ్ళూ మీకు భయం వేస్తూ ఉంటుంది. మీ ప్రాణాలు మీకు దక్కుతాయనే నమ్మకం మీకేమీ ఉండదు. 67 మీకు హృదయంలో పుట్టే భయంవల్ల, మీకు కనిపించేవాటి వల్ల పొద్దు పొడిస్తే “అయ్యో, సాయంకాలం వస్తే ఎంత బావుండు” అంటారు. 68 మీరు ఇంకెప్పుడూ ఈజిప్ట్‌ను చూడకూడదని నేను మీతో చెప్పాను గాని యెహోవా ఆ దేశానికి ఓడలమీద మిమ్మల్ని మళ్ళీ చేరుస్తాడు. అక్కడ మీ శత్రువులకు దాసులుగా దాసీలుగా మిమ్మల్ని మీరే అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు. గాని మిమ్మల్ని కొనేవారెవ్వరూ ఉండరు.