27
1 మోషే, ఇస్రాయేల్‌ప్రజల పెద్దలు ప్రజలకిలా ఆజ్ఞాపించారు: “ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలన్నిటి ప్రకారం మీరు ప్రవర్తించాలి. 2 మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను దాటే రోజు మీరు పెద్ద రాళ్ళను నిలబెట్టి, వాటిమీద సున్నం పూయాలి; 3 మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకు మాట ఇచ్చినట్టు, మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో, పాలు తేనెలు నదులై పారుతూవున్న దేశంలో ప్రవేశించడానికి మీరు నదిని దాటాక ఆ రాళ్ళమీద ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నీ రాయాలి. 4 మీరు యొర్దాను దాటాక, నేను ఈవేళ మీకాజ్ఞాపించినట్టు, ఆ రాళ్ళను ఏబాల్ పర్వతం మీద నిలబెట్టాలి, వాటిమీద సున్నం పూయాలి. 5 అక్కడ మీ దేవుడు యెహోవాకు రాళ్ళతో బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం రాళ్ళమీద ఇనుప పనిముట్టుపడకూడదు. 6 చెక్కనిరాళ్ళతోనే మీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాలి. దానిమీద మీ దేవుడైన యెహోవాకు హోమబలులు సమర్పించాలి. 7 శాంతిబలులు కూడా సమర్పించి, అక్కడ భోజనం చేసి, మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో సంతోషించాలి. 8 ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నీ సున్నం పూసిన ఆ రాళ్ళమీద చాలా స్పష్టంగా రాయాలి.”
9 మోషే, యాజులైన లేవీ గోత్రికులు ఇస్రాయేల్ ప్రజలందరితోనూ ఇలా అన్నారు: “ఇస్రాయేల్ ప్రజలారా! మౌనం వహించి వినండి! ఈరోజు మీరు మీ దేవుడు యెహోవాకు ప్రత్యేక ప్రజ అయ్యారు. 10 కనుక మీ దేవుడైన యెహోవా మాట వినాలి; ఈ రోజు నేను మీ కాజ్ఞాపించే ఆయన శాసనాలు, ఆజ్ఞలప్రకారం ప్రవర్తించాలి.”
11 ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: 12 మీరు యొర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాకారు, యోసేపు, బెన్యామీను గోత్రాలవారు ప్రజలగురించి దీవెనలు పలకడానికి గెరిజీమ్ పర్వతం మీద నిలబడాలి. 13 శాపాలు పలకడానికి రూబేను, గాదు, ఆషేరు, బెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాలవారు ఏబాల్ పర్వతం మీద నిలబడాలి. 14 అప్పుడు లేవీగోత్రికులు ఇస్రాయేల్ ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి:
15 “మలిచిన విగ్రహాన్ని గానీ, పోత విగ్రహాన్ని గానీ చేయించి, దానిని చాటున నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు. విగ్రహం శిల్పి చేతులతో చేసినది. అది యెహోవాకు అసహ్యం.”
అందుకు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
16 “తన తండ్రిని గానీ, తల్లిని గానీ అవమానపరచేవాడు శాపగ్రస్తుడు” అని వారు చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
17 “తన పొరుగువాడి సరిహద్దు రాయిని తీసివేసేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
18 “గుడ్డివాణ్ణి త్రోవ తప్పించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
19 “విదేశీయులపట్ల, తండ్రిలేనివారిపట్ల, విధవరాండ్రపట్ల న్యాయాన్ని వక్రం చేసేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
20 “తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి శయ్య అపవిత్రపరచినట్టే. వాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
21 “ఏదైనా జంతువుతో సంపర్కం చేసేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
22 “తన తోబుట్టిన ఆమెతో – తన తండ్రి కూతురుతో గానీ, తన తల్లి కూతురుతో గానీ శయనించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
23 “తన భార్య తల్లితో శయనించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
24 “రహస్యంగా తన పొరుగువాణ్ణి చావగొట్టేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
25 “నిర్దోషి ప్రాణాన్ని తీయడానికి లంచం పుచ్చుకొన్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
26  “ఈ ధర్మశాస్త్ర వాక్కులప్రకారం ప్రవర్తించకుండా వాటిని నెరవేర్చకుండా ఉండేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.