26
1 మీ దేవుడు యెహోవా వారసత్వంగా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించి, దానిని స్వాధీనం చేసుకొని, దానిలో కాపురమున్న తరువాత 2 మీ దేవుడు యెహోవా మీకిచ్చే భూమినుంచి కూర్చుకొనే పంటలన్నిట్లో మొదట పండిన వాటిని తీసుకొని, గంపలో ఉంచాలి; మీ దేవుడు యెహోవా తన పేరుకు నివాసస్థలంగా ఎన్నుకొన్న స్థలానికి ఆ గంపను తీసుకుపోవాలి. 3 ఆ రోజులలో ఉండబోయే యాజి దగ్గరకు చేరి, అతడితో “యెహోవా మనకిస్తానని పూర్వీకులతో ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చివున్న సంగతి ఈనాడు మీ దేవుడు యెహోవా సన్నిధానంలో రూఢిగా చెపుతున్నాను” అనాలి.
4 యాజి ఆ గంపను మీ చేతినుంచి తీసుకొని, మీ దేవుడు యెహోవా బలిపీఠం ముందు ఉంచినప్పుడు మీ దేవుడు యెహోవా సన్నిధానంలో మీరు ఇలా చెప్పాలి: 5 “నా పూర్వీకుడు సంచరిస్తూ ఉండే ఆరాం దేశీయుడు. అతడు ఈజిప్ట్‌కు వెళ్ళాడు. కొద్దిమందితో అక్కడికి చేరి విదేశీయుడుగా అక్కడ ఉండిపోయాడు. వారు అక్కడ సంఖ్యలో అధికం అయ్యారు, బలంగల గొప్ప జనమయ్యారు. 6 ఈజిప్ట్ జాతివాళ్ళు మనల్ని హింసించి, బాధపెట్టి, మనమీద కఠిన దాస్యం మోపారు. 7 మనం మన పూర్వీకుల దేవుడు యెహోవాకు మొరపెట్టాం. ఆయన మన మొర విని, మన బాధలు, కష్టాలు, కడగండ్లు చూశాడు. 8 యెహోవా తన బలిష్ఠమైన హస్తంతో, చాపిన చేతితో, మహా భయంకరమైన చర్యలతో, అద్భుతమైన సూచనలతో, మహాక్రియలతో మనల్ని ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాడు. 9 ఈ స్థలానికి మనల్ని తెచ్చి పాలు తేనెలు నదులై పారుతూవున్న ఈ దేశాన్ని మనకిచ్చాడు. 10 ఇప్పుడు యెహోవా, నీవు నాకిచ్చిన భూమిలో మొదట పండిన వాటిని నేను తెచ్చాను.”
అలా చెప్పి మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో ఆ గంపను పెట్టి, మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో ఆరాధించాలి; 11 మీకూ మీ ఇంటివారికీ మీ దేవుడు యెహోవా అనుగ్రహించిన మేలంతటి విషయం మీరూ, లేవీగోత్రికులూ, మీమధ్య ఉన్న విదేశీయులూ సంతోషించాలి.
12 మూడో సంవత్సరం మీ రాబడి అంతట్లో పదోవంతును ఇచ్చే సంవత్సరం. ఆ ఏట ఆ పదో వంతు లేవీగోత్రికులకూ విదేశీయులకూ తండ్రిలేనివారికీ విధవరాండ్రకూ ఇవ్వాలి. వారు మీ గ్రామంలో తిని తృప్తి పొందాక, 13 మీరు మీ దేవుడు యెహోవా సన్నిధానంలో ఇలా అనాలి:
“నీవు నాకిచ్చిన నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం నా ఇంటినుంచి ప్రతిష్ఠ చేసిన పదో వంతును తీసివేసి, లేవీగోత్రికులకూ, విదేశీయులకూ, తండ్రిలేనివారికీ విధవరాండ్రకూ నేనిచ్చాను. నీ ఆజ్ఞలలో దేనినీ నేను మీరలేదు, దేనినీ మరవలేదు. 14 నేను శోకించే సమయంలో దానిలో కొంచెమైనా తినలేదు, అశుద్ధంగా ఉన్నప్పుడు దానిలో దేనినీ తీసివేయలేదు, చనిపోయిన వారికోసం దానిలో దేనినీ ఉపయోగించలేదు. నా దేవుడైన యెహోవా మాట విని, నీవు నాకాజ్ఞాపించినట్టు అంతా చేశాను. 15 నీ పవిత్రాలయంనుంచి, పరలోకంనుంచి, చూచి నీ ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలను దీవించు; నీవు మా పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు మాకిచ్చిన దేశాన్ని, పాలు తేనెలు నదులైపారుతూవున్న ఈ దేశాన్ని ఆశీర్వదించు.”
16 మీరు ఈ చట్టాలు, న్యాయ నిర్ణయాల ప్రకారం ప్రవర్తించాలని మీ దేవుడు యెహోవా ఈ రోజు మీ కాజ్ఞాపిస్తున్నాడు గనుక మీరు మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో వాటిని అనుసరించి నడుచుకోవాలి. 17 యెహోవాయే మీకు దేవుడనీ, మీరు ఆయన విధానాల్లో నడుస్తూ, ఆయన చట్టాలు, ఆజ్ఞలు, న్యాయనిర్ణయాలు ఆచరణలో పెట్టుకుంటూ, ఆయన మాట వింటూ ఉంటామని ఈనాడు ఆయనతో మాట ఇచ్చారు. 18 యెహోవా మీకు వాగ్దానం చేసినట్టు మీరే తన ప్రజలని, తనకు ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారని ఈ రోజు ఆయన మాట ఇచ్చాడు. తాను చెప్పినట్టు మీరు తన ఆజ్ఞలన్నీ పాటించాలనీ, 19 తాను సృజించిన సమస్త జనాలకంటే మిమ్మల్నే హెచ్చిస్తాననీ, అలా తనకు కీర్తి, పేరు, మహిమ కలిగించుకొంటాననీ, మీరు మీ దేవుడు యెహోవాకు పవిత్ర ప్రజగా ఉంటారనీ చెప్పాడు.