25
1 ✝మనుషులు వ్యాజ్యమాడి తీర్పుకోసం న్యాయస్థానానికి వస్తే న్యాయాధిపతులు ఆ వ్యాజ్యం విమర్శించాలి; నిర్దోషిని నిర్దోషి అనీ దోషిని దోషి అనీ తీర్పు తీర్చాలి. 2 ఆ దోషిని కొరడా దెబ్బలు కొట్టాలని నిర్ణయమైతే అతడు పడుకొనేలా చేసి న్యాయాధిపతి అతడి దోషానికి తగ్గ దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుటే అతణ్ణి కొట్టించాలి. 3 ✝దోషిని నలభై దెబ్బల వరకు కొట్టించవచ్చు. అంతకు మించకూడదు. ఆ మీ సోదరుడు మీ దృష్టిలో నీచుడుగా కనిపించకుండేలా నలభై దెబ్బలకంటే ఎక్కువ కొట్టించకూడదు.4 ✝కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు.
5 ✝అన్నదమ్ములు కలిసి నివాసం చేస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకతను సంతానం లేక చనిపోతే, చనిపోయిన వాడి భార్య అతడి వంశంలో లేనివాణ్ణి పెండ్లి చేసుకోకూడదు. ఆమె భర్త తోబుట్టువు ఆమెదగ్గరికి వెళ్ళి ఆమెను వివాహమాడి, తన సోదరుడికి బదులు ఆమెపట్ల భర్త ధర్మం జరిగించాలి. 6 చనిపోయిన సోదరుడి పేరు ఇస్రాయేల్ ప్రజలలో నుంచి రద్దు కాకుండేలా ఆమెకు మొదట పుట్టినవాడు చనిపోయిన సోదరుడి కొడుకని భావించాలి. 7 ✝అతడికి తన తోబుట్టిన వాడి భార్యను వివాహమాడడానికి ఇష్టం లేకపోతే, అతడి సోదరుడి భార్య ఊరి ద్వారందగ్గరకు, పెద్దల దగ్గరికి వెళ్ళి ఇలా అనాలి – “నా భర్త తోబుట్టువు ఇస్రాయేల్‌ప్రజలలో తన సోదరుడికి పేరు స్థాపించడానికి ఒప్పుకోడు. భర్త సోదరుడి ధర్మం నాపట్ల జరిగించడు.” 8 అప్పుడు అతడి ఊరిపెద్దలు అతణ్ణి పిలిపించి, అతడితో మాట్లాడాలి. అతడు వారి ముందు నిలబడి “ఈమెను స్వీకరించడానికి నాకిష్టం లేదు” అని చెపుతాడనుకోండి. 9 అప్పుడు ఆ పెద్దల కళ్ళెదుటే అతడి సోదరుడి భార్య అతడి దగ్గరికి వచ్చి, అతడి కాలినుంచి చెప్పు ఊడదీసి, అతడి ముఖం ఎదుట ఉమ్మివేయాలి, “తన సోదరుడి వంశాన్ని నిలపని వాడికి ఇలా జరగాలి” అని చెప్పాలి. 10 ఆ తరువాత ఇస్రాయేల్‌ప్రజల్లో ‘చెప్పు ఊడదీయబడ్డవాడి వంశం’ అనే పేరు అతడికి ఉంటుంది.
11 ఇద్దరు మనుషులు పోట్లాడుకొంటూ ఉంటే వారిలో ఒకతని భార్య అతణ్ణి కొడుతున్నవాడి చేతిలోనుంచి తన భర్తను విడిపించడానికి వచ్చి చెయ్యి చాపి, వాడి మర్మాంగాలను పట్టుకొంటే ఆమె యొక్క చేతిని తెగనరకాలి. 12 ఆమెమీద దయ చూపకూడదు. 13 ✽వేరు వేరు తూనికెరాళ్ళు – బరువైనది ఒకటి, తేలికైనది ఒకటి – మీ సంచిలో ఉంచుకోకూడదు. 14 వేరు వేరు తూములు - ఒకటి పెద్దది ఒకటి చిన్నది - మీ ఇంట్లో ఉంచుకోకూడదు. 15 మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు చాలా కాలం బ్రతికేలా మీ తూనికెరాళ్ళ బరువు తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉండకూడదు. అవి సరిగానే ఉండాలి. మీ తూముకొలత తక్కువగానీ, ఎక్కువగానీ ఉండకూడదు. అది కూడా సరిగానే ఉండాలి. 16 ఈ విషయంలో వంచించే ప్రతివాడూ, అక్రమకారులంతా మీ దేవుడు యెహోవాకు అసహ్యం.
17 ✝మీరు ఈజిప్ట్‌నుంచి వచ్చినప్పుడు ప్రయాణంలో అమాలేకువాళ్ళు మీకు చేసినది జ్ఞాపకం ఉంచుకోండి. 18 ✽ మీరు అలిసిపోయి ఉన్నప్పుడు వాళ్ళు త్రోవలో మీకు ఎదురుపడి మీ వారిలో వెనుకపడ్డ బలహీనులందరి మీదికి వచ్చారు. వాళ్ళు దేవునికి భయపడలేదు. 19 ✝మీరు స్వాధీనం చేసుకొనేలా మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిచ్చేదేశంలో, చుట్టుపట్ల ఉన్న మీ శత్రువులందరి విషయం మీకు విశ్రాంతి ప్రసాదించాక, ఆకాశం క్రిందనుంచి అమాలేకుజాతివాళ్ళ పేరు తుడిచివేయాలి. మరవకండి.