24
1 ✽ ఒక మనిషి ఒకామెను పెండ్లి చేసుకొన్న తరువాత ఆమెలో ఏదో అవలక్షణం అతనికి కనిపించడంవల్ల ఆమెను ఇష్టపడడనుకోండి, అతడు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటినుంచి ఆమెను పంపివేస్తాడనుకోండి. 2 ఆమె అతడి ఇంటినుంచి వెళ్ళి మరో పురుషుణ్ణి పెళ్ళి చేసుకొన్నాక, 3 ఆ రెండోవాడు కూడా ఆమెను ఇష్టపడకుండా, విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుంచి పంపివేస్తాడనుకోండి. లేక, ఆమెను పెండ్లి చేసుకొన్న ఆ రెండోవాడు చనిపోతాడనుకోండి. 4 ✝అలాంటప్పుడు ఆమెను పంపివేసిన ఆ మొదటి భర్త ఆమెను భార్యగా మళ్ళీ స్వీకరించకూడదు. అతడికి ఆమె అశుద్ధం. అతడు ఆమెను మళ్ళీ చేర్చుకొంటే అది యెహోవాకు అసహ్యం. మీ దేవుడు మీకు వారసత్వంగా ఇచ్చే దేశంమీదికి అపరాధం తెచ్చిపెట్టకూడదు.5 ✝ఎవడైనా కొత్తగా పెండ్లి చేసుకొంటే అతడు సైన్యంలో చేరకూడదు. అతడిమీద ఏ సాంఘిక బాధ్యతనూ మోపకూడదు. ఒక సంవత్సరం పూర్తిగా అలాంటి కర్తవ్యాలనుంచి విడుదల అయి, తను చేసుకొన్న భార్యను సంతోషపెట్టాలి.
6 తిరగలిని గానీ, తిరగటి పై రాతిని గానీ తాకట్టు పెట్టకూడదు. అది మనిషి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే.
7 ✝ఎవడైనా తన దేశస్తులలో – అంటే ఇస్రాయేల్‌ప్రజలలో – మనిషిని బలాత్కారంగా ఎత్తుకుపోయాడని వెల్లడి అయితే ఆ దొంగ చావాలి. అతడు ఆ మనిషిని దాసుడుగా చేసుకొన్నా, అమ్మివేసినా అతడు చావాలి. ఈ విధంగా మీ మధ్యనుంచి ఆ దుర్మార్గాన్ని తొలగించాలి.
8 ✝చర్మవ్యాధి విషయంలో లేవీ గోత్రికులైన యాజులు మీకిచ్చే ఉపదేశమంతటి ప్రకారం ప్రవర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉండండి. నేను వారికాజ్ఞాపించినట్టు చేయడానికి జాగ్రత్తగా ఉండండి. 9 ✽ మీరు ఈజిప్ట్‌నుంచి బయలుదేరి చేసిన ప్రయాణంలో మీ దేవుడు యెహోవా మిర్యాంకు ఏంచేశాడో జ్ఞాపకముంచుకోండి.
10 ✝మీలో ఎవరైనా పొరుగువాడికి ఏదైనా అప్పు గానీ, ఎరవు గానీ ఇస్తే అతడి దగ్గర వస్తువు తాకట్టు తీసుకోవడానికి అతడి ఇంట ప్రవేశించకూడదు. 11 బయట నిలబడాలి. అప్పు గానీ, ఎరవు గానీ తీసుకొన్నవాడు బయటికి మీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇవ్వాలి. 12 అతడు బీదవాడైతే అతడి తాకట్టు ఉంచుకొని పడుకోకూడదు. 13 అతడు తన బట్టను కప్పుకొని పడుకొని, మిమ్మల్ని దీవించేలా ప్రొద్దు క్రుంకేవేళ ఆ తాకట్టును అతడికి మళ్ళీ అప్పగించి తీరాలి. అది యెహోవా దృష్టికి మీ లెక్కలో ధర్మంగా ఉంటుంది.
14 ✝ఇస్రాయేల్ వారిలో గానీ, మీ దేశంలో మీ గ్రామాలలో ఉన్న విదేశీయులలో గానీ దరిద్రులైన కూలివారిని బాధించ కూడదు. 15 ✝ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి. ప్రొద్దు క్రుంకే ముందే దాన్ని ఇవ్వాలి. అతడు బీదవాడు గదా. ఆ కూలిమీద ఆశ పెట్టుకొంటాడు. ఆ విషయంలో మీ మీదికి అపరాధం రాకుండేలా, అతడు మీ గురించి యెహోవాకు మొరపెట్టకుండేలా అతడికి కూలి ఇవ్వాలి.
16 ✝కొడుకుల దోషాన్నిబట్టి తండ్రులకు మరణ శిక్ష విధించకూడదు; తండ్రుల దోషాన్నిబట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవడి పాపానికి వాడే మరణశిక్ష పొందాలి. 17 ✽ విదేశీయులకు గానీ, తండ్రిలేనివారికి గానీ న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. వైధవ్య వస్త్రాన్ని తాకట్టు తీసుకోకూడదు. 18 మీరు ఈజిప్ట్‌లో దాసులై ఉన్నారనీ మీ దేవుడు యెహోవా మిమ్మల్ని అక్కడనుంచి విడిపించాడనీ జ్ఞాపకముంచుకోవాలి. అందుకనే మీరిలా చెయ్యాలని ఆజ్ఞాపిస్తున్నాను.
19 మీ పొలంలో పంట కోసేటప్పుడు ఒక పన మరచిపోతే అది తేవడానికి తిరిగి వెళ్ళకూడదు. మీ దేవుడు యెహోవా మీ పనులన్నిటిలోను మీకు ఆశీస్సులు ప్రసాదించేలా ఆ పన విదేశీయులకూ, తండ్రిలేనివారికీ, విధవలకూ విడిచిపెట్టాలి. 20 ఆలీవ్ పండ్లను ఏరేటప్పుడు మీ వెనుక ఉన్న పరిగె ఏరకూడదు. అది విదేశీయులకూ, తండ్రిలేనివారికీ, విధవలకూ విడిచిపెట్టాలి. 21 ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు నీ వెనుక ఉన్న పరిగె ఏరకూడదు. అది విదేశీయులకూ, తండ్రిలేనివారికీ, విధవలకూ విడిచిపెట్టాలి. 22 మీరు ఈజిప్ట్‌దేశంలో దాసులై ఉన్నారని జ్ఞాపకముంచుకోవాలి. అందుకనే ఇలా చెయ్యాలని ఆజ్ఞాపిస్తున్నాను.