23
1 ✽ఎవడికైనా వృషణాలు చితగ్గొట్టడం గానీ పురుషాంగం కోయడం గానీ జరిగితే అతడు యెహోవా సమాజంలో చేరకూడదు. 2 ✽వ్యభిచారం వల్ల పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు. అతడి సంతానంలో పదో తరంవరకు ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు. పదో తరంవరకు వాళ్ళలో ఎవరూ ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. 3 ✽అమ్మోను జాతివాడు గానీ, మోయాబు జాతివాడు గానీ యెహోవా సమాజంలో చేరకూడదు. 4 ఎందుకంటే మీరు ఈజిప్ట్ నుంచి వస్తూ ఉన్నప్పుడు వారు అన్నపానాలు తీసుకొని మిమ్మల్ని కలుసుకోలేదు. అంతేగాక, మిమ్మల్ని శపించడానికి బహుమతులిచ్చి అరామ్నహారయింలో ఉన్న పెతోరునుంచి బెయోరు కొడుకు బిలాంను పిలిపించారు. 5 ✽అయితే మీ దేవుడైన యెహోవా బిలాం మాటకు ఒప్పుకోలేదు. మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక మీ దేవుడు యెహోవా ఆ శాపాన్ని దీవెనగా చేశాడు. 6 ✽ఆ కారణంవల్ల మీరు బ్రతికే రోజులన్నిటిలో ఎన్నడూ వాళ్ళకు క్షేమాన్ని గానీ మేలును గానీ కలిగించడానికి ప్రయత్నం చేయకూడదు.7 ✝ఎదోం జాతివాళ్ళు మీకు బంధువులు గనుక వాళ్ళను అసహ్యించుకోకూడదు. ఈజిప్ట్‌దేశంలో మీరు విదేశీయులుగా ఉన్నారు గనుక ఈజిప్ట్‌వాళ్ళను అసహ్యించుకోకూడదు. 8 వారి సంతానంలో మూడో తరంవారు యెహోవా సమాజంలో చేరవచ్చు.
9 మీరు సైన్యంగా శత్రువులతో యుద్ధానికి బయలు దేరేటప్పుడు మీరు ప్రతి చెడ్డదానికి దూరం కావాలి. 10 ✝రాత్రివేళ తనకు వీర్యస్ఖలనం జరగడం వల్ల ఒక వ్యక్తి అశుద్ధమైతే అతడు శిబిరం వెలుపలికి వెళ్ళిపోయి, అందులోకి తిరిగి రాక, 11 సాయంకాలాన స్నానం చేసి ప్రొద్దుక్రుంకిన తరువాత అతడు శిబిరంలో చేరాలి. 12 శిబిరం వెలుపల బహిర్భూమిగా ప్రత్యేక స్థలం ఏర్పరచుకోవాలి. 13 మీ దగ్గర ఆయుధాలే గాక ఒక పార కూడా ఉండాలి. బహిర్భూమికి వెళ్ళేటప్పుడు దానితో త్రవ్వి, వెనక్కు తిరిగి, మలాన్ని కప్పివేయాలి. 14 ✝మీ దేవుడు యెహోవా మిమ్మల్ని రక్షించడానికీ మీ శత్రువులను మీ వశం చేయడానికీ మీ శిబిరంలో నడుస్తూవుంటాడు గనుక మీ శిబిరం పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే ఆయన ఏదైనా అసహ్యమైనదానిని చూచి మిమ్మల్ని వదలివేస్తాడేమో.
15 ఎవడైనా ఒక దాసుడు తన యజమాని దగ్గరనుంచి తప్పించుకుని మీ దగ్గరికి వస్తే, అతణ్ణి అతడి యజమానికి అప్పగించకూడదు. 16 అతడు తనకు ఇష్టం వచ్చిన చోట, మీ గ్రామాలలో తను ఎన్నుకొన్నదానిలో మీతో కలిసి మీ మధ్య నివాసం చేయవచ్చు. మీరు అతణ్ణి బాధించకూడదు.
17 ✽ఇస్రాయేల్‌జాతి స్త్రీలలో ఎవరూ అన్యుల గుళ్ళకు వేశ్యలుగా ఉండకూడదు. పురుషులలో ఎవడూ ఆ గుళ్ళకు చెందిన పురుష సంపర్కులుగా ఉండకూడదు. 18 అలాంటి పురుష సంపర్కంవల్ల గానీ, ఆ వేశ్యా వృత్తి వల్ల గానీ వచ్చే డబ్బును మ్రొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా నివాసానికి తేకూడదు. ఈ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.
19 ✽మీలో ఎవరూ డబ్బును గానీ, భోజన పదార్థాలను గానీ వడ్డీకి వేసే దేనినైనా ఇస్రాయేల్ వారికి వడ్డీకివ్వకూడదు. 20 విదేశీయుడికి వడ్డీకి అప్పివ్వవచ్చు గాని, ఇస్రాయేల్‌వారికి కాదు. అప్పుడు స్వాధీనం చేసుకోవడానికి చేరబోయే దేశంలో మీ దేవుడు యెహోవా మీ ప్రయత్నాలన్నిటిని దీవిస్తాడు.
21 ✝మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొన్న తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయడం మీకు పాపం అవుతుంది. మీ దేవుడు యెహోవా మీరు చేసినదానిని గురించి విచారణ చేసి తీరుతాడు. 22 మ్రొక్కుకోకపోవడం మీకు పాపం కాదు. 23 మీ పెదవులనుంచి బయలుదేరే మాటను నేరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మ్రొక్కుకొంటే నోటి మాటప్రకారం చేయాలి.
24 ✝మీ పొరుగువాడి ద్రాక్షతోట ద్వారా దాటిపోతుంటే, మీకిష్టమున్న అన్ని పండ్లు తినవచ్చు గాని మీ గంపలో పండ్లేమీ వేసుకోకూడదు. 25 మీ పొరుగువాడి పంట పొలం మీదుగా దాటిపోతూవుంటే మీ చేతితో వెన్నులు త్రుంచుకోవచ్చు గాని మీ పొరుగువాడి పంట పొలంమీద కొడవలి వేయకూడదు.