22
1 ✽స్వదేశస్తుడి ఎద్దు గానీ, గొర్రె గానీ త్రోవతప్పిపోవడం మీరు చూస్తే, చూడనట్లు దాటిపోకూడదు. తప్పనిసరిగా దానిని అతడి దగ్గరకు తోలుకుపోవాలి. 2 ఒకవేళ అతడు మీకు దగ్గరగా లేకపోతే, అతడెవరో మీకు తెలియకుండా ఉంటే ఆ జంతువును మీరు ఇంటికి తోలుకురావాలి. అతడు దానికోసం వచ్చేవరకు అది మీదగ్గరే ఉండిపోవాలి. అప్పుడు దాన్ని అతడికి అప్పగించాలి. 3 స్వదేశస్తుడు పోగొట్టుకొన్న గాడిద గానీ, వస్త్రం గానీ మరేదైనా మీకు కనిపిస్తే అలాగే చేయాలి. చూడనట్లు దాటిపోకూడదు. 4 అతడి గాడిద గానీ, ఎద్దు గానీ తోవలో పడి ఉండడం చూస్తే, చూడనట్లు దాటిపోకుండా దానిని లేవనెత్తడానికి సహాయం చేసితీరాలి.5 స్త్రీ పురుషుడి బట్టలు వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ బట్టలు వేసుకోకూడదు. అలా చేసేవారెవరైనా సరే మీ దేవుడు యెహోవాకు అసహ్యులు.
6 ✽పక్షి గూడు చెట్టు మీద గానీ, నేలమీద గానీ త్రోవలో కనిపిస్తుందనుకోండి. దానిలో ఉన్న పిల్లలమీద గానీ, గుడ్లమీద గానీ తల్లి పొదిగివుంటే పిల్లలతోపాటు తల్లిని తీసుకోకూడదు. 7 పిల్లలను తీసుకోవచ్చు గాని తల్లిని విడచిపెట్టితీరాలి. మీరు క్షేమంగా ఉండి చాలాకాలం బ్రతకాలని ఇందులో గల ఉద్దేశం.
8 ✽క్రొత్త ఇల్లు కట్టినప్పుడు దాని పైకప్పుకు చుట్టూ పిట్టగోడ కట్టాలి. లేకపోతే పైకప్పుమీదనుంచి ఎవడైనా పడిపోవడంవల్ల మీ ఇంటిమీదికి హత్యాదోషం వస్తుందేమో.
9 మీ ద్రాక్షతోటలలో రెండు రకాల విత్తనాలు వేయకూడదు. వేస్తే ఆ విత్తనాల పైరు, ద్రాక్షతోట రాబడి అపవిత్రంగా ఉంటాయి. 10 ఎద్దును, గాడిదను జత చేసి భూమి దున్నకూడదు. 11 ఉన్ని, జనుపనార కలిపి నేసిన బట్ట వేసుకోకూడదు.
12 మీలో ఎవరూ కప్పుకొనే తమ బట్ట నాలుగు చెంగులకు కుచ్చులు వేసుకోకూడదు.
13 ఎవడైనా పెండ్లి చేసుకొని భార్యతో శయనించిన తరువాత ఆమెను ద్వేషిస్తాడనుకోండి. 14 ఆమెమీద నేరం మోపి, ఆమె చెడ్డదంటూ “ఈ అమ్మాయిని నేను పెండ్లి చేసుకుని ఆమెతో శయనించినప్పుడు ఈమెలో కన్యరికం కనిపించలేదు” అని చెపుతాడనుకోండి. 15 అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ద్వారందగ్గర కూర్చుని ఉన్న ఊరి పెద్దల దగ్గరికి ఆ అమ్మాయి కన్యరికం రుజువులు తీసుకురావాలి. 16 ఆ అమ్మాయి తండ్రి ఆ పెద్దలతో ఇలా అనాలి:
“మా అమ్మాయిని ఈ మనిషికి పెండ్లి చేశాను, ఇతడు ఆమెను ద్వేషించి, 17 ‘మీ కూతురిలో కన్యరికం నాకు కనిపించలేదు’ అంటూ ఈమెమీద నేరం మోపాడు. అయితే మా అమ్మాయి కన్యరికానికి రుజువులివే.”
అప్పుడు వారు ఊరి పెద్దలముందు ఆ బట్టను పరచాలి.
18 అందుకు ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకొని శిక్షించాలి. 19 నూరు వెండి నాణేలు జుల్మానాగా వాడి దగ్గర తీసుకొని, ఆ అమ్మాయి తండ్రికివ్వాలి. ఎందుకంటే ఆ మనిషి ఇస్రాయేల్ దేశస్తురాలైన కన్యను నిందించాడు. ఆమె అతడికి భార్యగా ఉంటుంది. తాను బ్రతికిన రోజులన్నిటిలో అతడు ఆమెను విడవకూడదు. 20 ఒకవేళ అతడి మాటే నిజమైతే – ఆ అమ్మాయికి కన్య గురుతులు లేకపోతే – 21 ✝ఆ ఊరిపెద్దలు ఆ అమ్మాయిని ఆమె తండ్రి ఇంటి వాకిలిదగ్గరికి తీసుకురావాలి. ఆమె ఊరివారు రాళ్ళు రువ్వి ఆమెను చంపాలి. ఎందుకంటే, ఆమె తన తండ్రి ఇంట వ్యభిచారం చేసి ఇస్రాయేల్‌దేశంలో చెడు కార్యం చేసింది. ఈ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు తొలగించాలి.
22 ఎవడైనా మరో అతడి భార్యతో శయనించగా పట్టుబడితే, ఆ స్త్రీతో శయనించిన పురుషుడు, ఆ స్త్రీ ఇద్దరూ చావాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇస్రాయేల్‌ప్రజలలో నుంచి తొలగించాలి.
23 ఒక అమ్మాయికి – కన్యకు – ఒకడితో పెళ్ళి సంబంధం నిశ్చయమైతే ఎవడో ఒక మనిషి ఊరిలో ఆమెను చూచి ఆమెతో శయనిస్తే, 24 వారిద్దరిని ఊరి ద్వారం దగ్గరికి తీసుకువచ్చి, రాళ్ళు రువ్వి చంపాలి. ఆ అమ్మాయి ఊరిలో ఉండీ కేకలు పెట్టలేదు గనుక ఆమెను చంపాలి. ఆ మనిషి తన పొరుగువాడి భార్యను అవమానించాడు గనుక అతణ్ణి చంపాలి. ఈ విధంగా మీ మధ్యనుంచి ఆ దుర్మార్గాన్ని తొలగించాలి. 25 కానీ పెళ్ళి సంబంధం నిశ్చయమైన ఆ అమ్మాయిని ఊరి బయట ఆ మనిషి చూచి బలత్కారంగా ఆమెతో శయనిస్తే ఆమెతో శయనించినవాడు మాత్రమే చావాలి. 26 ఆ అమ్మాయిని ఏమీ చేయకూడదు. ఆమె చావతగ్గ పాపమేమీ చేయలేదు. ఎవడైనా తన పొరుగువాడి మీదికి లేచి ప్రాణనష్టం చేసినట్టే ఇది జరిగింది. 27 అతడు ఆమెను ఊరి బయట కలుసుకున్నాడు. పెళ్ళి సంబంధం నిశ్చయమైన ఆ అమ్మాయి కేకలు పెట్టినా ఆమెను రక్షించేవాడు లేకపోయాడు.
28 పెళ్ళి సంబంధం నిశ్చయం కాని కన్యను ఓ మనిషి పట్టుకొని ఆమెతో శయనించగా వారు పట్టుపడితే, 29 ఆమెతో శయనించినవాడు ఆ అమ్మాయి తండ్రికి యాభై వెండి నాణాలు ఇచ్చి ఆమెను వివాహమాడాలి. అతడు ఆమెను అవమానించాడు గనుక అతడు బ్రతికినన్నాళ్ళు ఆమెను విడిచి పెట్టకూడదు.
30 ✝ఎవడూ తన తండ్రి భార్యను తీసుకోకూడదు; అలా తన తండ్రికి అప్రతిష్ఠ కలిగించకూడదు.