21
1 మీ దేవుడు యెహోవా మీ స్వాధీనం చేసే దేశంలో ఒకవేళ ఎవరైన ఒకరు హతమై పొలంలో పడివుండడం కనిపిస్తే, 2 మీ పెద్దలు, న్యాయాధిపతులు అక్కడికి రావాలి, వారు హతమైన వ్యక్తికి చుట్టూరా ఉన్న గ్రామాల దూరం కొలిపించాలి. 3 హతమైన వ్యక్తికి ఏ గ్రామం దగ్గరగా ఉందో ఆ గ్రామం పెద్దలు ఇలా చేయాలి– ఏ పనికీ ఉపయోగించకుండా కాడి కట్టని పెయ్యను ఎన్నుకోవాలి. 4 ✽వాగు ఉన్న లోయలోకి, సాగు చేయని బీడుభూమి దగ్గరికి ఆ పెయ్యను తోలుకుపోవాలి. ఆ లోయలో పెయ్య మెడ విరుగతియ్యాలి. 5 అప్పుడు వారు లేవీ సంతానమైన యాజుల దగ్గరికి రావాలి. మీ దేవుడు యెహోవా తనకు సేవ చేయడానికీ తన పేర దీవించడానికీ వారిని ఎన్నుకున్నాడు గనుక వారి నోటి మాటప్రకారమే ప్రతి వివాదమూ దౌర్జన్యకాండా పరిష్కారం అవుతుంది. 6 ✝అప్పుడు హతమైన ఆ వ్యక్తికి దగ్గరలో ఉన్న ఆ ఊరి పెద్దలంతా ఆ లోయలో మెడను విరుగతీసిన ఆ పెయ్యమీద తమ చేతులు కడుక్కోవాలి.7 “మా చేతులు ఈ రక్తపాతం చేయలేదు, మా కండ్లు ఇది చూడలేదు. 8 ✝యెహోవా, నీవు విడుదల చేసిన నీ ఇస్రాయేల్ ప్రజను క్షమించు. నీ ఇస్రాయేల్ ప్రజల మీద నిరపరాధి ప్రాణం తీసి అపరాధం మోపవద్దు” అని వారు చెప్పాలి.
9 ఈ విధంగా యెహోవా దృష్టిలో ఏది సరిగా ఉందో అది చేయడంవల్ల మీ మధ్యనుంచి నిరపరాధి హత్య విషయమైన అపరాధం తొలగించాలి.
10 ✽మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు మీ దేవుడు యెహోవా వాళ్ళను మీ చేతికప్పగించాక మీరు వాళ్లను బందీలుగా తీసుకువస్తారు. 11 చెరపట్టినవాళ్ళలో రూపవతిని చూచి ఆశించి, ఆమెను పెండ్లి చేసుకోవాలనుకొంటే, 12 మీ ఇంటికి ఆమెను తీసుకురావచ్చు. అక్కడ ఆమె తల క్షౌరం చేయించుకొని, గోళ్ళను తీయించుకోవాలి, 13 తన చెరబట్టలు తీసివేయాలి. మీ ఇంట ఉండిపోతూ నెల రోజులు తన తల్లిదండ్రులను గురించి విలపించాలి. ఆ తరువాత ఆమె దగ్గరికి పోవచ్చు. మీరిద్దరు భార్యభర్తలవుతారు. 14 ఆమె మీకు నచ్చకపోతే, ఆమె మనస్సు నచ్చిన చోటికి ఆమెను వెళ్ళనివ్వండి. మీవల్ల ఆమెకు అవమానం కలిగింది గనుక ఆమెను ఏమాత్రమూ డబ్బుకు అమ్మకూడదు, దాసిలాగా చూడకూడదు.
15 ఒకతనికి ఇద్దరు భార్యలున్నారనుకోండి. ఒకామెను ప్రేమిస్తాడు, మరో ఆమెను ద్వేషిస్తాడు. అతడివల్ల ఇద్దరికీ పిల్లలు కలుగుతారు. 16 అతడు ద్వేషించే భార్య కొడుకు జ్యేష్ఠుడైతే అతడికి బదులుగా ప్రేమించే భార్య కొడుకును జ్యేష్ఠుడుగా చేయకూడదు. 17 ✝ద్వేషించిన భార్య కొడుకే జ్యేష్ఠుడని ఎంచి, తన ఆస్తి అంతట్లో రెండంతలు అతడికివ్వాలి. ఇతడు అతడి బలారంభం. జ్యేష్ఠుడి హక్కు ఇతడిదే.
18 ఒక మనిషికి మొండికెత్తిన కొడుకు ఉన్నాడనుకోండి, ఎప్పుడూ తిరుగుబాటు చేస్తూవుంటాడు. తండ్రి మాట గానీ, తల్లి మాట గానీ వినడు. వారు అతణ్ణి శిక్షించినా వారి మాట వినడు. 19 అలాంటప్పుడు అతడి తల్లిదండ్రులు అతణ్ణి పట్టుకొని ఊరి ద్వారం దగ్గర కూర్చుని ఉన్న ఊరి పెద్దల దగ్గరికి తేవాలి. 20 అప్పుడు వారు ఊరి పెద్దలతో “వీడు మా కొడుకు. వీడు మొండివాడు, ఎప్పుడూ తిరుగుబాటు చేస్తూవుంటాడు, మా మాట వినడు. వీడు తిండిబోతుగా తాగుబోతుగా తయారయ్యాడు” అని చెప్పాలి. 21 అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్ళు రువ్వి అతణ్ణి చంపాలి✽. ఇలా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి తొలగించాలి. అది విని ఇస్రాయేల్ ప్రజలందరికీ భయం ఉంటుంది.
22 ✝మరణశిక్షకు తగిన పాపం ఎవడైనా చేస్తాడనుకోండి. అతణ్ణి చంపి మ్రానుమీద వ్రేలాడదీస్తే, 23 అతడి శవం రాత్రివేళ ఆ మ్రానుమీద ఉండిపోకూడదు. అతణ్ణి చంపిన రోజే అతణ్ణి పాతిపెట్టితీరాలి. ఎందుకంటే మ్రానుమీద వ్రేలాడేవాడు దేవునిచేత శాపగ్రస్తుడు. మీ దేవుడు యెహోవా వారసత్వంగా మీకిచ్చే దేశాన్ని మీరు అశుద్ధం చేయకూడదు.