20
1 ✝మీరు మీ శత్రువులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మీ కంటే ఎక్కువమందిని, గుర్రాలను, రథాలను చూస్తే వారికి భయపడకూడదు. ఈజిప్ట్‌దేశంనుంచి మిమ్మల్ని తీసుకువచ్చిన మీ దేవుడు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. 2 మీరు యుద్ధానికి సమీపించినప్పుడు యాజి ప్రజలదగ్గరికి వచ్చి వారితో ఇలా చెప్పాలి:3 “ఇస్రాయేల్ ప్రజలారా, వినండి! ఈవేళ మీరు శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నారు. మీ హృదయంలో పిరికితనం ఉండనివ్వకండి. హడలిపోండి! అధైర్యం చెందకండి! వాళ్ళను చూచి భయపడకండి! 4 మీ శత్రువులతో యుద్ధం చేయడానికీ మిమ్మల్ని రక్షించడానికీ మీతోపాటు వస్తున్నది మీ దేవుడు యెహోవాయే!”
5 అధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి: “మీలో ఎవడైనా కొత్త ఇల్లు కట్టి ప్రతిష్ఠ చేయకుండా ఉన్నాడా? అయితే అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే ఈ యుద్ధంలో అతడు చనిపోతాడేమో, వేరొకడు ఆ ఇల్లు ప్రతిష్ఠ చేస్తాడేమో. 6 ఎవడైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పండ్లు తినకుండా ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే అతడు ఈ యుద్ధంలో చనిపోతాడేమో, వేరొకడు దాని పండ్లు తింటాడేమో. 7 ఎవడైనా స్త్రీని ప్రధానం చేసుకొని ఇంకా పెళ్ళిచేసుకోకుండా ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే అతడు ఈ యుద్ధంలో చనిపోతాడేమో, వేరొకడు ఆమెను పెళ్ళి చేసుకొంటాడేమో”.
8 ✝అధిపతులు ప్రజలతో ఇంకా అనాలి, “ఎవడికైనా భయాందోళనగా ఉందా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే అతడి అధైర్యంవల్ల అతడి సాటి సైనికుల గుండెలు కూడా నీరైపోతాయేమో”. 9 అధిపతులు ప్రజలతో మాట్లాడడం ముగించాక వారిమీద సేనాధిపతులను నియమించాలి.
10 ఏదైనా పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు శాంతికోసం రాయబారం పంపించాలి. 11 ✝ఆ పట్టణస్తులు శాంతి కావాలని ఒప్పుకొని ద్వారం తలుపులు తీస్తే, ఆ పట్టణంలో ఉన్న ప్రజలంతా మీకు కప్పం కట్టేవాళ్ళవుతారు. సేవ చేస్తారు. 12 ఆ పట్టణం మీతో సమాధానపడక యుద్ధం జరిగిస్తే దానిని ముట్టడివేయాలి. 13 మీ దేవుడు యెహోవా దానిని మీ చేతికప్పగించినప్పుడు దానిలో ఉన్న మగ వాళ్ళందర్నీ కత్తివాత హతం చేయాలి. 14 స్త్రీలను, చిన్నవాళ్ళను, పశువులను, పట్టణంలో ఉండేదంతా కొల్లసొమ్ముగా మీరు తీసుకోవచ్చు. మీ దేవుడు యెహోవా మీకిచ్చే మీ శత్రువుల కొల్లసొమ్మును మీరు వాడుకోవచ్చు. 15 మీ దగ్గర ఉన్న జనాల పట్టణాలు గాక మీకు చాలా దూరంగా ఉండే పట్టణాలు అన్నిటికీ ఇలాగే చేయాలి. 16 ✽ అయితే మీ దేవుడు యెహోవా మీకు వారసత్వంగా ఇచ్చే జనాల పట్టణాలలో ఊపిరి పీల్చే దేనినీ బ్రతకనివ్వకూడదు. 17 హిత్తి, అమోరీ, కనాను, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవారిని, మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టే, సమూలంగా నాశనం చేయాలి. 18 వాళ్ళు తమ దేవుళ్ళ విషయం చేసిన అసహ్యమైన పనులు మీకు నేర్పించకుండేలా, వాళ్ళలాగా మీరు మీ దేవుడు యెహోవాకు విరోధంగా పాపాలు చేయకుండేలా వాళ్ళను నిర్మూలించాలి.
19 ✽ఏదైనా పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి దానిమీదికి యుద్ధానికి వెళ్ళి చాలా రోజులు ముట్టడి వేస్తూవుంటే, అక్కడి చెట్లను గొడ్డలిచేత పాడు చేయకూడదు. మీరు వాటిని ముట్టడించడానికి పొలంలో ఉన్న చెట్లు మనుషులా? వాటి పండ్లు తినవచ్చు గాని, ఆ చెట్లను నరికివేయకూడదు. 20 ఏ చెట్లయితే తినదగ్గ పండ్లు కాసేవి కావని మీరు తెలుసుకొంటారో వాటిని మాత్రమే పాడు చేయవచ్చు, నరికివేయవచ్చు, మీతో యుద్ధం చేసే పట్టణం ఓడిపోయేవరకు దానికి ముట్టడి దిబ్బలు వాటితో కట్టవచ్చు.