19
1 మీ దేవుడు యెహోవా ఎవరి దేశాన్ని మీకిస్తాడో ఆ జనాలను మీ దేవుడు యెహోవా నాశనం చేశాక మీరు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకుని, వాళ్ళ పట్టణాలలో వాళ్ళ ఇండ్లలో కాపురం చేస్తారు. 2 అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మూడు పట్టణాలు ప్రత్యేకించాలి. 3 మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా చేసి ఆ పట్టణాలకు త్రోవలు తయారు చేయాలి. ఒకవేళ ఎవడైనా మరో వ్యక్తిని చంపితే ఆ పట్టణాలలో ఒకదానికి పారిపోయే విధంగా చేయాలి. 4 మనిషిని చంపి, పారిపోయి, బ్రతకగల వారెవరంటే, ద్వేషించకుండా, బుద్ధిపూర్వకంగా కాకుండా పొరుగువాణ్ణి చంపినవారే. 5 ఒక వ్యక్తి చెట్లు నరకడానికి తన పొరుగువాడితోపాటు అడవికి పోతాడనుకోండి. చెట్టు నరకడానికి చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి అతడి పొరుగువాడికి తగిలితే చస్తాడనుకోండి. అలాంటప్పుడు అతడు ఆ మూడు పట్టణాలలో ఒక దానికి పారిపోయి తన ప్రాణం దక్కించుకొంటాడు. 6 లేకపోతే, త్రోవ ఎక్కువ దూరమైతే హత్య విషయం ప్రతీకారం చేసేవాడు కోపాగ్నితో మండిపడి, ఆ మనిషిని చంపినవాడి వెంట తరిమి అతణ్ణి చంపుతాడేమో. అయితే అతడు తన పొరుగువాణ్ణి అంతకుముందు ద్వేషించలేదు గనుక అతనికి మరణశిక్ష తగదు. 7 అందుకనే “మీ కోసం మూడు పట్టణాలు ప్రత్యేకించాలి” అంటూ మీకాజ్ఞాపించాను.
8 మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఎప్పుడూ ఆయన విధానాలలో నడుచుకోవాలని ఈ రోజు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే మీరు చేస్తే, 9 మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు మీ సరిహద్దులు విశాలం చేస్తాడు, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిస్తాడు. అప్పుడు ఆ మూడు పట్టణాలు గాక ఇంకా మూడు పట్టణాలు ప్రత్యేకించాలి. 10 మీ దేవుడు యెహోవా మీ వారసత్వంకోసం మీకిచ్చే దేశంలో నిరపరాధులను చంపడంవల్ల హత్య విషయమైన అపరాధం మీమీదికి రాకుండేలా మీరు ఈ విధంగా చేయాలి.
11 కానీ ఎవడైన ఒక వ్యక్తి తన పొరుగువాణ్ణి ద్వేషిస్తూ, అతడికోసం పొంచివుండి, అతడిపైబడి అతణ్ణి చంపుతాడనుకోండి. 12 ఆ పట్టణాలలో ఒక దానికి అతడు పారిపోయినా, వాడి ఊరి పెద్దలు మనుషులను పంపించి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి, హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అప్పగించి చంపించాలి. 13 వాడిమీద జాలి చూపకూడదు. మీకు క్షేమంగా ఉండేలా ఇస్రాయేల్‌ప్రజల మధ్యనుంచి నిరపరాధుల హత్య విషయమైన అపరాధాన్ని తొలగించాలి.
14 మీరు స్వాధీనం చేసుకోవాలని మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీ మీ వారసత్వాలలో పూర్వీకుల నియామకం ప్రకారం సరిహద్దు రాళ్ళు ఉంటాయి. మీ పొరుగువారి సరిహద్దు రాళ్ళను మీరు తీసివేయకూడదు.
15 ఒక మనిషి ఏదైనా అపరాధం గానీ, తప్పిదం గానీ చేస్తే, అది ఏదైనా సరే, దాని గురించి ఒకే సాక్షి సాక్ష్యం మీరు అంగీకరించకూడదు. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదే ప్రతి సంగతి రూఢి అవుతుంది. 16 ఇద్దరు వ్యక్తుల వ్యాజ్యం విషయంలో అపకార బుద్ధిగల సాక్షి నిలబడి వారిలో ఒకరిమీద అబద్ధ సాక్షం చెపితే, 17 వ్యాజ్యమాడే ఆ ఇద్దరు యెహోవా సన్నిధానంలో, ఆ కాలంలో ఉండబోయే యాజుల, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి. 18 న్యాయాధిపతులు ఆ సంగతిని బాగా విచారించాలి. ఆ సాక్షి అబద్ధసాక్షి అని, సాటి మానవుడి మీద అబద్ధసాక్ష్యం చెప్పాడని వెల్లడి అవుతుందనుకోండి. 19 అలాంటప్పుడు వాడు సాటి మానవునికి చేయదలచినట్టే వాడికి చేయాలి. ఈ విధంగా మీ మధ్యనుంచి ఆ దుర్మార్గాన్ని తొలగించాలి. 20 మిగతా ప్రజలు అది విని, భయపడి అప్పటినుంచి మీ దేశంలో అలాంటి దుర్మార్గం చేయకుండా ఉంటారు. 21 అలాంటి వాడిమీద జాలి చూపకూడదు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు – ఇదే మీకు నియమం.