18
1 లేవీవారైన యాజులకు, ఆ మాటకొస్తే లేవీగోత్రికులందరికీ, ఇస్రాయేల్ ప్రజలతో భాగమూ వారసత్వమూ ఉండవు. ప్రజలు యెహోవాకు అర్పించే హోమాలు వారు తింటారు. అదే వారికి భాగం. 2 స్వదేశస్తుల మధ్య వారికి వారసత్వం ఉండదు. యెహోవా వారితో చెప్పినట్టు ఆయనే వారికి వారసత్వం.
3 బలులర్పించేవారు యాజులకు ఇవ్వవలసినదేమిటంటే, ఆ బలి ఎద్దు కానివ్వండి, గొర్రె కానివ్వండి వారు యాజికి కుడి జబ్బనూ, రెండు దవడలనూ, పొట్టనూ ఇవ్వాలి. 4 మీ ధాన్యంలో, ద్రాక్షరసంలో, నూనెలో ప్రథమ ఫలం, మీ గొర్రెల మొదటి బొచ్చు అతడికివ్వాలి. 5 యెహోవా పేర నిలబడి ఎల్లకాలం సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణీ, అతడి సంతానాన్నీ మీ దేవుడు యెహోవా ఎన్నుకొన్నాడు.
6 లేవీగోత్రికుడు ఇస్రాయేల్ దేశంలో మీ గ్రామాలలో తాను నివసించే గ్రామంనుంచి యెహోవా ఎన్నుకొన్న ఆ స్థలానికి చాలా అభిలాషతో వస్తాడనుకోండి. 7 అలాంటప్పుడు అక్కడ యెహోవా సన్నిధానంలో నిలబడే తన సాటి లేవీ గోత్రికులందరిలాగే అతడు కూడా తన దేవుడు యెహోవా పేర సేవ చేయవచ్చు. 8 తన వంశంవారిపట్ల వచ్చుబడి కాక, అతడు ఇతర యాజులలాగే వంతు పొందాలి.
9 మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించాక అక్కడి జనాల అసహ్య కార్యకలాపాలను చూచి వాటిని చేయకూడదు. 10  తన కొడుకును గానీ కూతుర్ని గానీ, అగ్నిద్వారా దాటించేవాణ్ణి మీ మధ్య ఉండనివ్వకూడదు. సోదె చెప్పేవ్యక్తిని గానీ, మేఘశకునాలు, సర్ప శకునాలు చెప్పేవ్యక్తిని గానీ, చేతబడి చేసే వ్యక్తిని గానీ, 11 మంత్రవిద్య అభ్యసించే వ్యక్తిని గానీ, కర్ణ పిశాచాన్ని సంప్రదించే వ్యక్తిని గానీ, పూనకం వచ్చి పలికే వ్యక్తిని గానీ, చచ్చినవారిని పిలిచే వ్యక్తిని గానీ మీ మధ్య ఉండనివ్వకూడదు. 12 వీటిని చేసే ప్రతి వ్యక్తీ యెహోవాకు అసహ్యం. ఆ జనాలు ఈ అసహ్యమైన వాటిని చేసినందుకే మీ దేవుడు యెహోవా మీ ఎదుటనుంచి వాళ్ళను వెళ్ళగొట్టివేస్తున్నాడు. 13 మీరు మీ దేవుడు యెహోవా దృష్టిలో యథార్థవంతులై ఉండాలి. 14 ఎవరి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారో ఆ జనాలు శకునాలు చెప్పేవాళ్ళ మాట, సోదెగాండ్ర మాట వింటారు. మీకైతే అలా చేయడానికి మీ దేవుడు యెహోవా సెలవియ్యలేదు.
15 మీ దేవుడు యెహోవా మీ మధ్య మీ కోసం నాలాంటి మరో ప్రవక్తను మీ దేశస్తులలోనే బయలుదేరేలా చేస్తాడు. ఆయన మాట మీరు వినాలి. 16 హోరేబు పర్వతం దగ్గర మీరు సమావేశమైన రోజు మీరు మీ దేవుడైన యెహోవాను కోరినట్టే యెహోవా చేస్తాడు. “మేము చావకుండేలా మా దేవుడు యెహోవా స్వరం మాకు మళ్ళీ వినిపించకుండా ఈ గొప్ప మంట ఇకనుంచి కనిపించకుండా ఉండాలి!” అని మీరన్నారు.
17 అందుకు యెహోవా నాతో అన్నాడు, “వారు చెప్పిన మాట మంచిదే. 18 వారికోసం వారి స్వదేశస్తులలో నీలాంటి ప్రవక్త బయలు దేరేలా చేస్తాను. ఆయన నోట నా మాటలను ఉంచుతాను. నేను ఆయనకు ఆజ్ఞాపించినదంతా ఆయన వారితో చెప్తాడు. 19 నా పేర ఆయన చెప్పే నా మాటలు ఎవరైనా శిరసావహించకపోతే, వారికి తగిన ప్రతిక్రియ చేస్తాను. 20 అంతేకాదు, ఎవడైనా ఒక ప్రవక్త గర్వించి, నేను అతడి కాజ్ఞాపించని మాట నా పేర పలికితే అతడు చావాలి; ఇతర దేవుళ్ళ పేరున పలికితే ఆ ప్రవక్త చావాలి.”
21 “ఏదో మాట యెహోవా చెప్పినది కాదని మాకెలా తెలుస్తుంది?” అంటూ మీరు చెప్పుకొంటారేమో. 22 ఎవడైనా ఒక ప్రవక్త యెహోవా పేర పలికేటప్పుడు ఆ మాటప్రకారం జరుగకపోతే, అది నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అతిశయించి ఆ మాట చెప్పాడు. దానికి భయపడవద్దు.