17
1 మీ దేవుడైన యెహోవాకు మచ్చగానీ, లోపం గానీ ఉన్న ఎద్దును, గొర్రెను బలిగా అర్పించకూడదు. అలా చేయడం మీ దేవుడు యెహోవాకు అసహ్యం.
2 మీ మధ్యలో, మీ దేవుడు యెహోవా మీకిచ్చే గ్రామాలలో ఎవరైనా – పురుషుడు గానీ, స్త్రీ గానీ – మీ దేవుడు యెహోవా ఒడంబడిక మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేసి, 3 నేనిచ్చిన ఆజ్ఞకు విరోధంగా ఇతర దేవుళ్ళను కొలిచి పూజించారంటే, సూర్యుణ్ణి గానీ, చంద్రుణ్ణి గానీ, ఆకాశ నక్షత్రాలలో ఉన్న దేనినైనా పూజించారంటే, 4 అది మీకు తెలిసినప్పుడు, మీరు ఆ సంగతి విన్నతరువాత బాగా విచారణ చేయాలి. అది నిజమైతే, అలాంటి అసహ్య కార్యం ఇస్రాయేల్ ప్రజలలో జరగడం నిశ్చయం అయితే, 5 ఆ దుర్మార్గం చేసిన వ్యక్తిని – పురుషుణ్ణి గానీ, స్త్రీని గానీ – మీ ఊరి ద్వారాల దగ్గరికి తీసుకువచ్చి రాళ్ళు రువ్వి చంపాలి. 6 ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదే చావవలసిన వ్యక్తికి మరణశిక్ష విధించాలి– ఒకే సాక్షి మాటమీద కాదు. 7 ఆ వ్యక్తిని చంపడానికి మొదట ఆ సాక్షులు, తరువాత ప్రజలంతా ఆ వ్యక్తి మీద చేతులు వేయాలి. ఈ విధంగా మీ మధ్య నుంచి ఆ దుర్మార్గాన్ని తొలగించాలి.
8 హత్యకు హత్యకు, ఫిర్యాదుకు ఫిర్యాదుకు, దెబ్బకు దెబ్బకు, మీ గ్రామాలలో తగాదాలు పుట్టినప్పుడు వాటిని పరిష్కారం చేయడం మీకు చేతకాకపోతే, మీరు లేచి మీ దేవుడైన యెహోవా ఎన్నుకొన్న ఆ స్థలానికి వెళ్ళాలి. 9 అక్కడ యాజులైన లేవీగోత్రికుల దగ్గరికి, ఆ రోజుల్లో ఉండబోయే న్యాయాధిపతి దగ్గరికి వచ్చి విచారణ చేయాలి. వారు ఆ సంగతికి తగిన నిర్ణయం తెలుపుతారు. 10 యెహోవా ఎన్నుకొన్న ఆ స్థలంలో వారు మీకు చెప్పే పరిష్కారం ప్రకారం మీరు జరిగించాలి. వారు మీకు ఇచ్చే అన్ని ఉపదేశాలకు అనుగుణంగా చేయడానికి జాగ్రత్తగా ఉండాలి. 11 వారు మీకిచ్చే ఉపదేశం ప్రకారం, చెప్పే నిర్ణయంప్రకారం మీరు జరిగించాలి. వారు చేసే పరిష్కారంనుంచి కుడికి గానీ, ఎడమకు గానీ మీరు తిరుగకూడదు. 12 మీ దేవుడైన యెహోవాకు సేవ చేయడానికి అక్కడ నిలబడే ఆ యాజి మాట గానీ, ఆ న్యాయాధిపతి మాట గానీ ఎవడైనా గర్వించి వినకపోతే ఆ మనిషి చావాలి. ఈ విధంగా దుర్మార్గాన్ని ఇస్రాయేల్‌ప్రజలలో లేకుండా నిర్మూలించాలి. 13 అది విని ప్రజంతా భయపడి, అలా గర్వంగా ప్రవర్తించకుండా ఉంటారు.
14 మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో చేరి, దానిని స్వాధీనం చేసుకొని, దానిలో నివసించేటప్పుడు “మన చుట్టూరా ఉన్న సమస్త జనాలలాగా మనమీద రాజును నియమించు కుందామ”ని మీరు చెప్పుకొంటే 15 మీ దేవుడు యెహోవా ఎన్నుకొనేవాణ్ణే మీమీద రాజుగా నియమించుకోవాలి. మీ ప్రజలలోనే ఒక వ్యక్తిని మీమీద రాజుగా నియమించుకోవాలి. ఇస్రాయేల్‌వాడు కాని విదేశీయుణ్ణి మీమీద నియమించు కోకూడదు. 16 ఆ రాజు ఎక్కువ గుర్రాలను సంపాదించు కోకూడదు. ఎక్కువ గుర్రాలను సంపాదించు కోవడానికి ప్రజలు ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళిపోయేలా అతడు చేయకూడదు. “ఇక నుంచి మీరు ఆ త్రోవన వెళ్ళకూడద”ని యెహోవా మీతో చెప్పాడు గదా. 17 అతడి హృదయం యెహోవానుంచి తొలగి పోకుండేలా అతడు అనేక స్త్రీలను పెళ్ళి చేసుకోకూడదు. చాలా వెండి బంగారాలు తనకోసం సంపాదించుకోకూడదు. 18 అతడు రాజ్యసింహాసనం మీద ఆసీనుడైన తరువాత ఈ ధర్మశాస్త్ర ప్రతిని ఒక దానిని తనకోసం వ్రాసుకోవాలి. లేవీగోత్రికులైన యాజుల స్వాధీనంలో ఉన్న గ్రంథం చూచి ఆ ప్రతిని వ్రాసుకోవాలి. 19 ఆ ప్రతి అతడి దగ్గర ఉండాలి. తాను బ్రతికే రోజులన్నీ దాన్ని చదువుతూ ఉండాలి. అతడు తన దేవుడైన యెహోవాపట్ల భయభక్తులు కలిగి, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ మాటలన్నీ, ఈ శాసనాలన్నీ శిరసావహించి వాటిప్రకారం ప్రవర్తించడానికి నేర్చుకోవాలని దీని ఉద్దేశం. 20 అప్పుడు అతడు తన ప్రజలమీద మిడిసిపడడు, ఈ ఉపదేశంనుంచి కుడికి గానీ, ఎడమకు గానీ తొలగిపోడు. అయితే రాజ్యంలో అతడు, అతడి కొడుకులు ఇస్రాయేల్ ప్రజలమధ్య దీర్ఘ పరిపాలన చేయగలుగుతారు.