16
1 మీ దేవుడు యెహోవా అబీబ్ నెలలో రాత్రి వేళ మిమ్మల్ని ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాడు. గనుక అబీబ్ నెలను ప్రత్యేకమైన నెలగా ఆచరించి మీ దేవుడు యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. 2 మీ దేవుడైన యెహోవాకు పశువులలో నుంచి గానీ, గొర్రెమేకలలో నుంచి గానీ ఒకదానిని బలిగా అర్పించాలి. యెహోవా తన పేరుకు నివాసస్థానంగా ఎన్నుకొన్న స్థలంలోనే పస్కాబలి అర్పించాలి. 3 పస్కా బలితోపాటు పొంగిన రొట్టెను తినకూడదు. మీరు త్వరపడి ఈజిప్ట్‌దేశంనుంచి వచ్చారు గదా. మీరు ఈజిప్ట్ దేశం నుంచి వచ్చిన రోజును మీరు జీవించే కాలమంతా జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక పస్కా పండుగ సమయంలో బాధసూచకమైన పొంగని రొట్టెలు ఏడు రోజులు తినాలి. 4 ఆ ఏడు రోజులు మీ ప్రాంతాలన్నిటిలోనూ పొంగజేసే పదార్థమేదీ కనిపించకూడదు. అంతేగాక, ఆ మొదటిరోజు సాయం సమయంలో మీరు వధించే దాని మాంసంలో కొంచెమైనా తెల్లవారేవరకు మిగల్చకూడదు. 5 మీ దేవుడు యెహోవా మీకిచ్చే గ్రామాలలో దేనిలోనూ పస్కా బలిని వధించకూడదు. 6 గాని మీ దేవుడు యెహోవా తన పేరుకు నివాసస్థానంగా ఎన్నుకొన్న స్థలంలోనే ఆ బలిని వధించాలి. మీరు ఈజిప్ట్‌నుంచి వచ్చిన వేళ – ప్రొద్దు క్రుంకేవేళ – దానిని వధించాలి. 7 మీ దేవుడు యెహోవా ఎన్నుకొన్న స్థలంలోనే మీరు దానిని కాల్చి తినాలి. తెల్లవారినప్పుడు తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి. 8 ఆరు రోజులు మీరు పొంగని రొట్టెలు తినాలి. ఏడో రోజు మీ దేవుడు యెహోవాకు పవిత్రసభ రోజు. ఆ రోజు బ్రతుకుదెరువుకోసం ఏ పనీ చేయకూడదు.
9 ఏడు వారాలు మీరు లెక్కించాలి – పంటపొలాలలో కొడవలి మొదట వేసిన వారం మీరు లెక్కించడం ఆరంభించాలి. 10 ఏడు వారాలు లెక్కించి మీ దేవుడు యెహోవాకు “వారాల పండుగ” ఆచరించాలి. అప్పుడు మీ దేవుడు యెహోవా మీకు ఆశీస్సులు ప్రసాదించిన కొద్ది మీరు స్వేచ్ఛార్పణలు అర్పించాలి. 11 మీ దేవుడు యెహోవా తన పేరుకు నివాసస్థానంగా ఎన్నుకొన్న స్థలంలో, ఆయన సన్నిధానంలో మీరు సంతోషించాలి. మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, మీ మధ్య ఉన్న విదేశీయులు, తండ్రిలేనివారు, వితంతువులు సంతోషించాలి. 12 మీరూ ఈజిప్ట్‌లో దాసులుగా ఉన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకొని, ఈ శాసనాలు పాటించి వాటి ప్రకారం జరిగించాలి.
13 మీ కళ్ళంలోనుంచి ధాన్యాన్ని, మీ గానుగ తొట్టిలోనుంచి మీ ద్రాక్షరసాన్ని సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగ ఏడు రోజులు ఆచరించాలి. 14 ఈ పండుగలో మీరు సంతోషించాలి – మీరు, మీ కొడుకులు, మీ కూతుళ్ళు, మీ దాసులు, మీ దాసీలు, మీ గ్రామాలలో ఉన్న లేవీవారు, విదేశీయులు, తండ్రిలేనివారు, వితంతువులు సంతోషించాలి. 15 మీ దేవుడు యెహోవా మీ పంటలన్నిటిలో మీ చేతులు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని దీవిస్తాడు. గనుక యెహోవా ఎన్నుకొన్న ఆ స్థలంలో ఆయనకు ఏడు రోజులు మహా సంతోషంతో పండుగ చేయాలి.
16 సంవత్సరానికి ఈ మూడుసార్లు మీ దేవుడు యెహోవా ఎన్నుకొన్న ఆ స్థలంలో ఆయన సన్నిధానంలో మగవారంతా కనబడాలి – రొట్టెల పండుగ, వారాల పండుగ, పర్ణశాలల పండుగ. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధానంలోకి రాకూడదు. 17 మీ దేవుడు యెహోవా ఒక్కొక్కరికి ప్రసాదించిన ఆశీస్సుల ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వగల కానుక ఇవ్వాలి.
18 మీ దేవుడు యెహోవా మీకిచ్చే మీ గ్రామాలన్నిటిలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, నాయకులను మీరు నియమించాలి. వారు న్యాయాన్ని అనుసరించి ప్రజలకు తీర్పు తీర్చాలి. 19 మీరు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతం చూపకూడదు. లంచం పుచ్చుకోకూడదు. లంచం జ్ఞానుల కండ్లకు గుడ్డితనం కలిగిస్తుంది, న్యాయవర్తనుల మాటలు వక్రం చేస్తుంది. 20 మీరు బ్రతికి, మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశాన్ని స్వాధీనం చేసుకొనేలా మీరు కేవలం న్యాయాన్నే అనుసరించి నడుచుకోవాలి.
21 మీ దేవుడు యెహోవాకు మీరు కట్టే బలిపీఠానికి సమీపంలో ఏ రకమైన “పుణ్య” వృక్షాన్ని నాటకూడదు. 22 ఏ స్తంభాన్నీ నిలబెట్టకూడదు. అలాంటివి మీ దేవుడు యెహోవాకు అసహ్యం.