15
1 ఏడో సంవత్సరం ముగింపులో అప్పులు రద్దు చేయాలి. 2 అప్పులు రద్దు చేయవలసిన విధానమేదంటే, తన పొరుగువాడికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు, ఆ అప్పులు రద్దు చేయాలి. యెహోవా పేర రద్దు చేసే సమయం ప్రకటించడం జరిగినందు చేత అప్పు తీర్చాలని తన పొరుగువాణ్ణిగానీ, స్వదేశస్తుణ్ణిగానీ బలవంతం చేయకూడదు. 3 ✽ విదేశస్తుణ్ణి బలవంతం చేయవచ్చు గాని స్వదేశస్తుడి దగ్గర మీరిచ్చిన అప్పును అతడి దగ్గర విడిచిపెట్టాలి. 4 ✽మీరు మీ వారసత్వంగా స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. 5 ఈ రోజు నేను మీ కాజ్ఞాపించే ఈ ఆజ్ఞలన్నిటిప్రకారం నడుచుకోవడానికి మీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వింటే, మీలో బీదలంటూ ఎవ్వరూ ఉండరు. 6 ఎందుకంటే మీ దేవుడు యెహోవా మీతో చెప్పినట్టు మిమ్మల్ని దీవిస్తాడు, గనుక మీరు అనేక జనాలకు అప్పిస్తారు గాని అప్పుచేయరు. అనేక జనాలను పరిపాలిస్తారు గాని వారు మిమ్మల్ని పరిపాలించరు.7 మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో, మీ ఊళ్ళలో ఎక్కడైనా మీ స్వదేశీయులలో బీదవారిపట్ల హృదయం కఠినం చేసుకోకూడదు. వారికి సహాయం చెయ్యకుండా ఉండకూడదు. 8 అతడికి తప్పక సహాయం చేసి అతడి అక్కరకు కావలసినదంతా అతడికి అప్పిచ్చితీరాలి. 9 “ఏడో ఏట – అప్పులు రద్దుచేసే ఏడు దగ్గరపడింది” అనే చెడు తలంపు మీ మనస్సులో ఉండకుండా జాగ్రత్తపడాలి. అక్కరలో ఉన్న మీ స్వదేశీయుణ్ణి దయ చూడకుండా అతడికేమీ ఇయ్యకపోతే, ఒక వేళ అతడు మీ విషయం యెహోవాకు మొరపెట్టవచ్చు. అది మీకు అపరాధమవుతుంది. 10 మీరు అతడికి కావలసినదంతా ఇచ్చితీరాలి. అప్పుడు మీ దేవుడు యెహోవా మీ పనులన్నిటి లోనూ మీరు చేయ తలపెట్టే కృషి అంతటిలోనూ మీకూ ఆశీస్సులు ప్రసాదిస్తాడు, గనుక అతడికి ఇచ్చినందుకు హృదయంలో విచారపడకూడదు. 11 బీదలు దేశంలో తప్పక ఉంటారు. అందుచేత మీ దేశంలో ఉండే మీ స్వదేశీయులలో అక్కరపడ్డ బీదలకు మీరు సహాయం చేయాలని మీకాజ్ఞ జారీ చేస్తున్నాను.
12 ✽ మీ స్వదేశీయులలో – హీబ్రూవాణ్ణి గానీ, హీబ్రూ స్త్రీని గానీ – మీకు అమ్మడం జరిగితే ఆ వ్యక్తి మీకు ఆరు ఏండ్లు సేవ చేయాలి. ఏడో ఏట ఆ వ్యక్తిని మీరు స్వతంత్రంగా వెళ్ళనివ్వాలి. 13 అయితే అతణ్ణి అలా వెళ్ళనిచ్చినప్పుడు అతణ్ణి వట్టిచేతులతో పంపివేయకూడదు. 14 మీ మందలో, కళ్ళంలో, ద్రాక్షగానుగ తొట్టిలో నుంచి కొంత అతడికిచ్చి తీరాలి. మీ దేవుడైన యెహోవా దీవెనలవల్ల మీకు కలిగినదానిలో నుంచి కొంత అతడికివ్వాలి. 15 మీరు ఈజిప్ట్ దేశంలో దాసులుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని విడిపించాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ కారణంచేత ఈ సంగతి ఈరోజు మీ కాజ్ఞాపిస్తున్నాను. 16 ✝ఒక వేళ మీ దగ్గర అతడికి మేలు కలిగినందుకు ఆ దాసుడు మిమ్మల్ని మీ ఇంటివారిని ప్రేమించి “నేను మీ దగ్గరనుంచి వెళ్ళిపోను” అంటాడేమో. 17 అలాంటప్పుడు మీరు కదురును చేతపట్టుకొని తలుపులోకి దిగేలా అతడి చెవికి దానిని గుచ్చాలి. ఆ తరువాతే అతడు ఎప్పుడూ మీకు దాసుడుగా ఉంటాడు. అలాగే మీ దాసికి కూడా చేయాలి. 18 అయితే అతణ్ణి స్వతంత్రంగా వెళ్ళనిస్తే, అది కష్టమని మీరు అనుకోకూడదు. అతడు ఆరు సంవత్సరాలు కూలికి వచ్చినవాడికంటే రెండంతల సేవ మీకు చేశాడు. మీ దేవుడు యెహోవా దీనిని గురించి చెప్పినట్టు మీరు చేస్తే, మీ పనులన్నిటిలో ఆయన మీకు ఆశీస్సులు ప్రసాదిస్తాడు.
19 ✝మీ పశువులలో, గొర్రెమేకలలో తొలి చూలు ప్రతి మగదానిని మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ చేయాలి. మీ కోడెలలో తొలిచూలు దానితో పని చేయకూడదు. మీ గొర్రెమేకలలో తొలిచూలుదాని బొచ్చు కత్తిరించకూడదు. 20 యెహోవా ఎన్నుకొన్న స్థలంలో మీరూ, మీ ఇంటివారూ మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో ప్రతి ఏటా ఆ తొలిచూలు పిల్లల మాంసం తినాలి. 21 ✝ఒకవేళ ఆ జంతువులలో దేనికైనా ఏదైనా లోపం – కుంటితనం గానీ, గుడ్డితనం గానీ, మరే లోపమైనా గానీ – ఉంటే, మీ దేవుడైన యెహోవాకు దానిని అర్పించకూడదు. 22 జింకను, దుప్పిని తిన్నట్టు మీ ఊరిలో దాన్ని తినాలి. శుద్ధంగా ఉన్నవారు, అశుద్ధంగా ఉన్నవారు భేదం లేకుండా దానిని తినవచ్చు. 23 ✝దాని రక్తం మాత్రం తినకూడదు. నీళ్ళలాగా భూమిమీద దానిని పారబోయాలి.