14
1 మీరు మీ దేవుడైన యెహోవా సంతానం. చనిపోయిన వారి విషయం మిమ్మల్ని మీరు కోసుకోకూడదు, మీ నొసట ఉన్న వెండ్రుకలను క్షౌరం చేసుకోకూడదు. 2 మీరు మీ దేవుడు యెహోవాకు పవిత్రప్రజ. భూతలమంతటిమీద ఉన్న జనాలన్నిటిలోనూ ప్రత్యేకమైన సొత్తుగా, తనకు స్వప్రజగా ఉండడానికి యెహోవా మిమ్మల్నే ఎన్నుకొన్నాడు.
3 మీరు అసహ్యమైన దేనినీ తినకూడదు. 4 మీరు తినదగ్గ జంతువులు ఇవి – ఎద్దు, గొర్రె, మేక, 5 కారుమేక, కొండగొర్రె, ప్రతిరకమైన దుప్పి, జింక, లేడి, 6 జంతువులలో ఏవైతే చీలిన గిట్టలుండి నెమరు వేస్తాయో వాటినే మీరు తినవచ్చు. 7 కొన్ని జంతువులకు చీలిన గిట్టలున్నా అవి నెమరు వేయవు; నెమరు వేసినా చీలిన గిట్టలు ఉండవు. అలాంటివాటిని మీరు తినకూడదు. ఒంటె, పొట్టి కుందేలు, కుందేలు నెమరువేస్తాయి గానీ వాటికి చీలిన గిట్టలుండవు. గనుక అవి మీకు అశుద్ధం. వాటిని తినకూడదు. 8 పందికి చీలిన గిట్టలు ఉన్నాయి గాని అది నెమరువేయదు. అది కూడా మీకు అశుద్ధం. అలాంటివాటి మాంసం తినకూడదు. వాటి పీనుగులను తాకకూడదు.
9 జలప్రాణులలో వేటికి రెక్కలూ, పొలుసులూ ఉంటాయో వాటినే తినవచ్చు. 10 వేటికి రెక్కలూ పొలుసులూ ఉండవో వాటిని తినకూడదు. అవి మీకు అశుద్ధం.
11 ప్రతి రకం శుద్ధ పక్షిని మీరు తినవచ్చు. 12 మీరు తినకూడనివి – గరుడపక్షి, రాబందు, క్రౌంచపక్షి, 13 ప్రతి రకమైన గద్ద, 14 ప్రతి రకమైన కాకి, 15 నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి రకమైన డేగ, 16 పెగిడెకంటె, చెరువుకాకి, గుడ్లగూబ, 17 హంస, గూడబాతు, నల్లరాబందు, 18 సంకుబుడికొంగ, ప్రతి రకమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలం. 19 ప్రతి రకమైన ఎగిరే పురుగు మీకు అశుద్ధం. వాటిని తినకూడదు. 20 ప్రతి రకమైన శుద్ధ పక్షిని మీరు తినవచ్చు.
21 చచ్చినదానిని మీరు తినకూడదు. మీ ఊరిలో ఉన్న విదేశీయులకు దానిని ఇవ్వవచ్చు. వారు దానిని తినవచ్చు. లేకపోతే పరదేశికి దానిని అమ్మవచ్చు. మీరు మీ దేవుడైన యెహోవాకు పవిత్ర ప్రజ. మేకపిల్లను దాని తల్లి పాలతో వండకూడదు.
22 ప్రతి సంవత్సరం మీరు వేసిన విత్తనాల పంటలో పదోవంతు వేరు చేసితీరాలి. 23 మీ దేవుడు యెహోవా తన పేరుకు నివాసస్థానంగా ఎన్నుకొన్న స్థలంలో ఆయన సన్నిధానంలో మీ పంటలో, ద్రాక్షరసంలో, నూనెలో పదోవంతును తినాలి. మీ పశువులలో, గొర్రెమేకలలో తొలిచూలు పిల్లలను అక్కడే తినాలి. మీ దేవుడైన యెహోవా పట్ల ఎప్పుడూ భయభక్తులతో ప్రవర్తించాలని ఆయన ఉద్దేశం. 24 మీ దేవుడు యెహోవా తన పేరుకు నివాసస్థానంగా ఎన్నుకొన్న స్థలం మీకు ఎక్కువ దూరంగా ఉండడంచేత తీసుకురావలసిన వాటిని అక్కడికి మోసుకొని రాలేరనుకోండి. అలాంటప్పుడు మీ దేవుడు యెహోవా మీకు ఆశీస్సులు ప్రసాదించినప్పుడు, 25 వాటిని వెండికి మార్చి, ఆ వెండిని చేతపట్టుకొని, మీ దేవుడు యెహోవా ఎన్నుకొన్న స్థలానికి వెళ్ళాలి. 26 అక్కడే, మీరు ఇష్టపడే దేనికైనా – ఎద్దులకు గానీ, గొర్రెలకు గానీ, ద్రాక్షరసానికి గానీ, మద్యపానానికి గానీ, మీరు ఇష్టపడే దానికి ఆ వెండి ఇవ్వాలి. అక్కడే, మీ దేవుడు యెహోవా సన్నిధానంలో భోజనం చేసి, మీరూ మీ ఇంటివారూ సంతోషించాలి. 27 మీ ఊళ్ళలో నివసించే లేవీగోత్రికుల విషయం అశ్రద్ధ చేయకూడదు. మీ మధ్య వారికి భాగమూ వారసత్వమూ లేవు గదా.
28 మీ దేవుడు యెహోవా మీ చేతి పని అంతట్లో మీకు ఆశీస్సులు ప్రసాదించేలా మీరు ఈ విధంగా చెయ్యాలి – మూడు సంవత్సరాలకు ఒక సారి, ఆ ఏడాది మీకు కలిగిన పంటలో పదో వంతు అంతా తీసుకువచ్చి మీ ఊరిలో ఉంచాలి. 29 అప్పుడు మీ ఊరిలో ఉండి, మీ మధ్య భాగమూ వారసత్వమూ లేని లేవీవారు, విదేశీయులు, తండ్రిలేనివారు, వితంతువులు వచ్చి సంతృప్తిగా భోజనం చేయవచ్చు.