13
1  ఒక ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ మధ్య బయలుదేరుతాడనుకోండి. మీకు తెలియని “ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం పదండి” అని చెప్పి ఏదైనా అద్భుతమైన సూచన గానీ, శకునం గానీ చూపుతాడనుకోండి. 2 ఆ సూచన, ఆ శకునం నెరవేరినా 3  ఆ ప్రవక్త మాటలు, కలలు కనేవాడి మాటలు మీరు వినకూడదు. మీరు మీ దేవుడు యెహోవాను హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నారో లేదో వెల్లడి చేయడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. 4 మీరు మీ దేవుడు యెహోవానే అనుసరించి నడుచుకోవాలి. ఆయనపట్లే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు శిరసావహించాలి. ఆయన మాటే వింటూ, ఆయనకే సేవ చేస్తూ, ఆయనను విడువకుండా ఉండాలి. 5 ఆ ప్రవక్తనూ కలలు కనేవాణ్ణీ చంపాలి. ఎందుకంటే, మిమ్మల్ని ఈజిప్ట్‌దేశంనుంచి – ఆ దాస్యగృహంలో నుంచి – విడిపించి తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవా మీద వాడు తిరుగుబాటు ప్రకటించాడు. మీరు ఏ మార్గంలో నడుచుకోవాలని మీ దేవుడు యెహోవా మీకాజ్ఞాపించాడో అందులోనుంచి మిమ్మల్ని తొలగించడానికి ప్రయత్నం చేశాడు. వాణ్ణి చంపి మీ మధ్యనుంచి ఆ దుర్మార్గాన్ని నిర్మూలించాలి.
6 ఒక వేళ నీ తోబుట్టినవాడు – నీ తల్లి కొడుకు – గానీ, నీ కొడుకు గానీ, నీ కూతురు గానీ, నీ ప్రేమ చూరగొన్న నీ భార్య గానీ, నీ ప్రాణ స్నేహితుడు గానీ నిన్ను రహస్యంగా ప్రేరేపిస్తూ, నీకూ నీ పూర్వీకులకూ తెలియని “ఇతర దేవుళ్ళను పూజిద్దాం, పదండి” అంటాడనుకోండి. 7 ఆ దేవుళ్ళు మీకు సమీపంగా మీ చుట్టూరా ఉన్న జనాల దేవుళ్ళు కావచ్చు, మీకు దూరంగా, భూమి కొనలవరకు ఉండే ప్రజల దేవుళ్ళు కావచ్చు. 8 అలాంటి దేవుళ్ళలో ఏ దేవుణ్ణయినా పూజించడానికి మిమ్మల్ని ప్రేరేపించే వాడి మాటకు మీరు లొంగకూడదు, వాడు చెప్పేది వినకూడదు. వాడిమీద దయ చూపకూడదు, జాలిపడకూడదు, వాడి విషయం దాచి పెట్టకూడదు. 9 వాణ్ణి చంపితీరాలి. వాణ్ణి చంపడానికి మొదట మీ చెయ్యి, తరువాత ప్రజలందరి చేతులు వాడిమీద పడాలి. 10 రాళ్ళు రువ్వి వాణ్ణి చంపాలి. ఎందుకని? ఈజిప్ట్‌దేశంనుంచి – ఆ దాస్య గృహంలో నుంచి – మిమ్మల్ని తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవా దగ్గరనుంచి వాడు మిమ్మల్ని తొలగించడానికి ప్రయత్నం చేశాడు. 11 ఇస్రాయేల్ ప్రజలంతా ఇది విని భయపడుతారు, మీ మధ్య ఇలాంటి దుర్మార్గం అప్పటినుంచి చేయకుండా ఉంటారు.
12 మీరు నివసించడానికి మీ దేవుడు యెహోవా మీకిచ్చే ఊళ్ళలో ఏదో ఒకదానిలో, 13 పనికిమాలినవాళ్ళు కొంతమంది మీ మధ్య బయలుదేరి, మీకు తెలియని “ఇతర దేవుళ్ళను పూజిద్దాం పదండి” అంటూ తమ ఊరివాళ్ళను ప్రేరేపించారని మీరు వింటారనుకోండి. 14 అలాంటప్పుడు మీరు ఆ సంగతి బాగా పరిశీలించి, విమర్శించి, విచారించాలి. అది నిజమైతే, అలాంటి అసహ్యమైన కృత్యం మీ మధ్య జరగడం నిశ్చయమైతే, 15 మీరు ఆ ఊరివాళ్ళను కత్తిపాలు చేసితీరాలి. దానినీ దానిలో ఉన్నదంతా, దాని పశువులనూ కత్తితో పూర్తిగా నాశనం చేయాలి. 16 దాని వస్తువులన్నీ విశాలవీధిలో చేర్చి, మీ దేవుడు యెహోవా పేర ఆ ఊరినీ దాని వస్తువులన్నిటినీ పూర్తిగా కాల్చివేయాలి. ఆ ఊరు ఎవరినీ మళ్ళీ కట్టనివ్వకూడదు. అది ఎల్లకాలం పాడుదిబ్బగా ఉండాలి. నాశనం చేయవలసిన ఆ వస్తువులలో ఏదీ మీ దగ్గర ఉంచుకోకూడదు. 17 అప్పుడు యెహోవా తన కోపాగ్ని నుంచి మళ్ళుకొని మిమ్మల్ని కరుణించి కనికరించి, మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన ప్రకారం మీరు సంఖ్యలో అధికమయ్యేలా చేస్తాడు. 18 మీరు మీ దేవుడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తిస్తూ, నేను ఈ రోజు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నీ శిరసావహించడానికి ఆయన మాట వింటూవుంటే ఆయన అలా చేస్తాడు.