12
1 మీరు స్వాధీనం చేసుకోవాలని మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశంలో మీరు జాగ్రత్తగా పాటించవలసిన చట్టాలు, న్యాయ నిర్ణయాలు ఇవి. మీరు భూమిమీద బ్రతికే రోజులన్నీ వాటిని పాటించాలి. 2 ✽మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశంవాళ్ళు ఎత్తయిన కొండలమీదా గుట్టలమీదా పచ్చని చెట్లన్నిటిక్రిందా తమ దేవుళ్ళను కొలిచారు. మీరు ఆ స్థలాలన్నిటినీ పాడు చేసి తీరాలి. 3 వాళ్ళ బలిపీఠాలను పడద్రోసి, వాళ్ళ దేవతాస్తంభాలను తుత్తునియలుగా చేసి, వాళ్ళ అషేరాదేవి స్తంభాలను కాల్చివేసి, వాళ్ళ దేవుళ్ళ విగ్రహాలను కూలద్రోయాలి. ఆ దేవుళ్ళ పేర్లను అక్కడ లేకుండా నిర్మూలించి తీరాలి. 4 వాళ్ళు తమ దేవుళ్ళకు చేసినట్టు మీరు మీ దేవుడు యెహోవా పట్ల ప్రవర్తించకూడదు. 5 ✝మీ దేవుడు యెహోవా మీ గోత్రాలన్నిటిలో తన పేరును స్థాపించుకోవడానికి ఒక స్థలాన్ని ఎన్నుకొంటాడు. అది ఆయనకు నివాస స్థానంగా ఉంటుంది. మీరు అక్కడికే వచ్చి ఆయన దగ్గర విచారణ చేయాలి. 6 అక్కడికే మీరు హోమాలు, బలులు, పదోవంతులు, ప్రత్యేకనైవేద్యాలు, దీక్ష అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువుల్లో, గొర్రెమేకలలో తొలి చూలులను తీసుకురావాలి. 7 అక్కడ మీరు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించినందు చేత మీ చేతి పనులన్నిటినిబట్టి మీరూ మీ కుటుంబాలూ సంతోషించాలి.8 ఈ రోజుల్లో మనమిక్కడ చేస్తున్నట్టు అప్పుడు మీలో ప్రతి ఒక్కరూ తన దృష్టికి ఏది మంచిదో అది చేయకూడదు. 9 మీ దేవుడు యెహోవా మీకిచ్చే విశ్రాంతి స్థలంలో, వారసత్వంలో మీరు ఇంకా ప్రవేశించలేదు గదా. 10 మీరు యొర్దాను దాటి, మీ దేవుడు యెహోవా మీకు వారసత్వంగా ఇచ్చే దేశంలో నివాసులైన తరువాత, మీరు నిర్భయంగా నివసించేలా మీ చుట్టూరా వున్న శత్రువుల విషయం ఆయన మీకు విశ్రాంతి ప్రసాదిస్తాడు. 11 అప్పుడు మీ దేవుడు యెహోవా తన పేరుకు నివాసస్థానంగా ఎన్నుకొన్న స్థలానికే మీరు రావాలి. నేను మీకాజ్ఞ ఇచ్చే ప్రకారం మీ హోమాలు, బలులు, పదో వంతులు మీరు చేసే ప్రత్యేక నైవేద్యాలు, యెహోవాకు మ్రొక్కుకునే మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్ళను అక్కడికే తీసుకురావాలి. 12 అప్పుడు మీరు, మీ కొడుకులు, మీ కూతుళ్ళు, మీ దాసులు, మీ దాసీలు, మీ పట్టణాలలో కాపురముండే లేవీగోత్రికులు మీ దేవుడు యెహోవా సన్నిధానంలో సంతోషించాలి. (లేవీగోత్రికులు మీ మధ్య వాటా, వారసత్వం ఉండవు గదా.) 13 మీకు కనిపించే ప్రతి స్థలంలో మీ హోమ బలులు అర్పించకూడదు సుమీ. 14 యెహోవా మీ గోత్రాలలో ఒకదానిలో ఒక స్థలం ఎన్నుకుంటాడు. అక్కడే మీరు మీ హోమ బలులు అర్పించి, నేను మీ కాజ్ఞాపించే ప్రకారమే అంతా జరిగించాలి.
15 ✝అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినకొద్దీ మీ మీ ఇండ్లలో ఇష్టం వచ్చినట్లు జంతువులను వధించి మాంసం తినవచ్చు, జింకనూ దుప్పినీ తిన్నట్టు తినవచ్చు. శుద్ధంగా ఉన్నవారు గానీ, అశుద్ధంగా ఉన్నవారు గానీ తినవచ్చు. 16 ✝రక్తంతో మాత్రం మీరు తినకూడదు. దానిని నీళ్ళలాగా నేలమీద పారబోయాలి. 17 అయితే మీ ధాన్యంలో గానీ, ద్రాక్షరసంలో గానీ, నూనెలో గానీ పదో వంతును మీ ఇండ్లలో తినకూడదు. మీ గోవులలో గానీ, గొర్రెమేకల మందలో గానీ తొలిచూలు పిల్లలను తినకూడదు. మీరు మ్రొక్కుకొనే మ్రొక్కుబళ్ళలో మీ స్వేచ్ఛార్పణలలో, ప్రత్యేక నైవేద్యాలలో దేనినీ తినకూడదు. 18 మీ దేవుడు యెహోవా ఎన్నుకొనే స్థలంలోనే ఆయన సన్నిధానంలో వాటిని తినాలి. మీరు మీ కొడుకులు, మీ కూతుళ్ళు, మీ దాసులు, దాసీలు, మీ ఊళ్ళలో నివసించే లేవీ గోత్రికులు అక్కడనే వాటిని తినాలి. మీరు చేయబూనుకొనే కార్యకలాపాలన్నిటినిబట్టి మీ దేవుడు యెహోవా సన్నిధానంలో సంతోషించాలి. 19 ✝మీ దేశంలో మీరు బ్రతికి ఉన్నంత కాలమూ లేవీగోత్రికుల విషయం అశ్రద్ధ చేయకూడదు.
20 మీ దేవుడు యెహోవా మీ సరిహద్దులు విశాలపరుస్తానని మీకు ప్రమాణం చేశాడు. ఆయన అలా చేసినతరువాత మీరు “మాంసం తింటాం” అంటారు. మాంసం తినే ఆశ మీకు వస్తుంది గదా. అప్పుడు ఇష్టం వచ్చినట్టు మీరు మాంసం తినవచ్చు. 21 ఒక వేళ మీ దేవుడు యెహోవా తన పేరును ఉంచుకోవడానికి ఎన్నుకొన్న స్థలం మీలో కొందరికి ఎక్కువ దూరంగా ఉంటుందనుకోండి. అలాంటప్పుడు యెహోవా మీకిచ్చే పశువులలో గానీ, గొర్రెమేకలలో గానీ ఒకదానిని, నేను మీకు ఆజ్ఞ ఇచ్చినట్టు, చంపి, ఇష్టం వచ్చినట్టు మీ ఇంట తినవచ్చు. 22 జింకనూ దుప్పినీ తిన్నట్టు దానిని తినవచ్చు. శుద్ధంగా ఉన్నవారైనా, అశుద్ధంగా ఉన్నవారైనా భేదం లేకుండా అందరూ తినవచ్చు. 23 రక్తం మాత్రం తిననే తినకూడదు, జాగ్రత్త! ఎందుకంటే రక్తం ప్రాణం. మాంసంతో ప్రాణాన్ని తినకూడదు. 24 మీరు దానిని తినకుండా, భూమిమీద నీళ్ళలాగా పారబోయాలి. 25 మీరు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించినందుచేత మీకూ మీ తరువాత మీ సంతానానికీ మేలు కలగాలని రక్తం తినకూడదు. 26 మీరు అర్పించే పవిత్ర అర్పణలు, మ్రొక్కుబళ్ళు యెహోవా ఎన్నుకొన్న స్థలానికి తీసుకురావాలి. 27 ✝మీ హోమబలులు – వాటి రక్తం, మాంసం – మీ దేవుడైన యెహోవా బలిపీఠంమీద సమర్పించాలి. మీ బలుల రక్తం మీ దేవుడైన యెహోవా యొక్క బలిపీఠంమీద పోయాలి గాని వాటి మాంసం మీరు తినవచ్చు. 28 మీ దేవుడైన యెహోవా దృష్టిలో న్యాయంగా సరిగా ప్రవర్తించినందుచేత మీకూ మీ తరువాత మీ సంతానానికీ శాశ్వతంగా మేలు కలిగేలా నేను మీకాజ్ఞాపించే ఈ మాటలు జాగ్రత్తగా పాటించాలి.
29 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశజనాలను మీ దేవుడు యెహోవా మీ ఎదుట లేకుండా చేస్తాడు. మీరు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివాసం చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. 30 వాళ్ళు మీ ఎదుట లేకుండా నాశనమైపోయిన తరువాత మీరు వాళ్ళ మార్గాలలో చిక్కకుండేలా జాగ్రత్త! “ఈ జనాలు తమ దేవుళ్ళను ఎలా కొలుస్తారో మేమూ అలాగే చేస్తామ”ని వాళ్ళ దేవుళ్ళను గురించి విచారణ చేయకుండా జాగ్రత్త!
31 ✝యెహోవా ద్వేషించే ప్రతి అసహ్యమైన కార్యాన్నీ వాళ్ళు తమ దేవుళ్ళను పూజిస్తూ చేస్తారు. మీరు మీ దేవుడు యెహోవా విషయం అలా చేయకూడదు. వాళ్ళు తమ దేవుళ్ళ పేరున, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ సైతం హోమంగా కాల్చివేస్తారు. 32 ✝నేను మీకాజ్ఞాపించే ప్రతి మాట ప్రకారం మీరు ప్రవర్తించాలి. ఈ మాటలకు ఏదీ కలుపకూడదు, వాటిలో నుంచీ ఏదీ తీసివేయకూడదు.