11
1 ✝కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆయన చెప్పినదాని ప్రకారం చేస్తూ, ఆయన చట్టాలను, న్యాయనిర్ణయాలను, ఆజ్ఞలను ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. 2 ఈ రోజు మీతోనే మాట్లాడుతున్నాను గానీ మీ దేవుడు యెహోవా చేసిన శిక్షణను అనుభవించకుండా, ఎరగకుండా ఉన్న మీ సంతానంతో కాదని మీరు గుర్తించండి. యెహోవా మహత్తు, ఆయన బలిష్ఠమైన హస్తం, ఆయన చాపిన చెయ్యి మీకు తెలుసు. 3 ✝ఈజిప్ట్‌లో, ఈజిప్ట్ చక్రవర్తి ఫరోకు, అతడి దేశమంతటికీ ఆయన చేసిన అద్భుతమైన సూచనలు, క్రియలు మీకు తెలుసు. 4 ✝ఆయన ఈజిప్ట్ సైన్యానికీ వాళ్ళ గుర్రాలకూ రథాలకూ చేసినది మీరు చూశారు. వాళ్ళు మిమ్మల్ని తరుముతూ ఉంటే ఎర్ర సముద్రం నీళ్ళు వాళ్ళమీద పారేలా చేశాడు. ఈ రోజు వరకూ యెహోవా వాళ్ళను నాశనం చేసిన సంగతి మీకు తెలుసు. 5 మీరు ఈ చోటికి చేరేవరకు ఎడారిలో మీ కోసం ఆయన ఏం చేసినదీ మీకు తెలుసు. 6 ✝రూబేను గోత్రికుడైన ఏలీయాబు కొడుకులైన దాతానుకూ అబీరాంకూ ఆయన చేసినది కూడా మీరు చూశారు. ఇస్రాయేల్ ప్రజలమధ్య భూమి నోరు తెరచి వాళ్ళనూ, వాళ్ళ ఇంటివాళ్ళనూ, గుడారాలనూ, వాళ్ళదగ్గర ఉన్న సమస్త జీవరాసులనూ మింగివేసింది. 7 యెహోవా చేసిన ఆ క్రియలన్నీ మీ కండ్లకు కనిపించాయి గదా.8 ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తే మీరు బలం పుంజుకొని ఏ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి నది దాటి వెళ్తున్నారో ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోగలరు. 9 ఆ దేశంలో దీర్ఘ కాలం నివసించగలరు. యెహోవా మీ పూర్వీకులకూ వారి సంతానానికీ ఇస్తానని వారితో ప్రమాణం చేసిన దేశం అది. పాలు తేనెలు నదులై పారుతూ ఉన్న దేశం. 10 మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశం మీరు బయలుదేరి వచ్చిన ఈజిప్ట్‌దేశంలాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు వేసి, కూరతోటకు నీరు కట్టినట్టు మీ కాళ్ళతో మీ పొలాలకు నీరు కట్టారు. 11 మీరు నది దాటి, స్వాధీనం చేసుకోబొయ్యే దేశం కొండలూ లోయలూ ఉన్న దేశం. ఆకాశ వర్షాల నీరు త్రాగే దేశం. 12 ✝అది మీ దేవుడు యెహోవా లక్ష్యపెట్టే దేశం. మీ దేవుడు యెహోవా కనుచూపు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎప్పుడూ ఆ దేశం మీద ఉంటుంది.
13 ✽మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ సేవిస్తూ ఉండాలని ఈ రోజు నేను మీకాజ్ఞాపిస్తున్నాను. ఈ ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా శిరసావహిస్తే, ఆయన 14 “మీ దేశానికి వర్షాలు వాటి కాలాలలో కురిపిస్తాను. మీరు మీ ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని, నూనెను కూర్చుకొనేలా తొలకరి వాన కడవరి వాన కురిపిస్తాను. 15 మీ పశువులకోసం మీ మైదానాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు భోజనం చేసి తృప్తిపడతారు” అంటాడు.
16 ✝అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ హృదయం మోసపోతుందేమో, మీరు సరైన మార్గం విడిచి ఇతర దేవుళ్ళను పూజించి సేవిస్తారేమో, 17 ✽అలాంటప్పుడు యెహోవా కోపం మీ మీద రగులుకొంటుంది. ఆయన ఆకాశాన్ని మూసివేస్తాడు. వాన రాదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చే ఆ మంచి దేశంలో లేకుండా మీరు త్వరలో నశించిపోతారు.
18 ✝కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలో మీ మనస్సులో బాగా ఉంచుకోవాలి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. అవి మీ నొసట ఉండాలి. 19 మీ ఇండ్లలో కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకొన్నప్పుడు, లేచినప్పుడు ఈ మాటల గురించి మాట్లాడుతూ మీ పిల్లలకు నేర్పాలి. 20 మీ ఇండ్ల ద్వారబంధాల మీద మీ గుమ్మాలమీద వ్రాయాలి. 21 మీరు అలా చేస్తూ ఉంటే యెహోవా మీ పూర్వీకులకిస్తానని ప్రమాణం చేసిన దేశంలో మీరు, మీ సంతానం సుదీర్ఘకాలం నివసిస్తారు. భూమికి పైగా ఆకాశం నిలిచేటంత కాలం మీరు అక్కడ ఉంటారు. 22 మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ, ఆయన విధానాలన్నిటి ప్రకారమూ నడుచుకుంటూ, ఆయనను విడవకుండా మీరు చేయాలని నేను మీకిచ్చే ఈ ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధతో పాటించాలి. 23 అప్పుడు యెహోవా మీ ఎదుటనుంచి ఆ జనాలన్నిటినీ వెళ్ళగొట్టివేస్తాడు, మీకంటే బలమైన గొప్ప జనాల దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. 24 మీరు పాదం మోపే ప్రతీ స్థలం మీది అవుతుంది. ఎడారినుంచి లెబానోనువరకూ, యూఫ్రటీస్ నదినుంచి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దులు వ్యాపిస్తాయి. 25 ఎవ్వరూ మీ ఎదుట నిలబడలేకపోతారు. తాను మీతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టే దేశమంతటికీ మీ గురించిన భయాందోళన మీ దేవుడు యెహోవా పుట్టిస్తాడు.
26 ✽ ఇదిగో వినండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను. 27 ఈవేళ నేను మీకు ఇచ్చే మీ దేవుడు యెహోవా యొక్క ఆజ్ఞలు శిరసావహిస్తే మీకు దీవెన వస్తుంది. 28 మీ దేవుడు యెహోవా ఆజ్ఞలు శిరసావహించకుండా, ఈ వేళ నేను మీకాజ్ఞాపించే మార్గంనుంచి తొలగిపోయి మీరు ఎరుగని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం వస్తుంది. 29 ✝మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో మీ దేవుడు యెహోవా మిమ్మల్ని చేర్చిన తరువాత ఆ దీవెన గెరిజీం కొండమీద ప్రకటించాలి. ఏబాల్ కొండమీద ఆ శాపం ప్రకటించాలి. 30 ఆ కొండలు యొర్దాను అవతల, పడమటి దిక్కుగా మోరేలోని సిందూర వృక్షాల దగ్గర ఉన్న గిల్గాలుకు ఎదురుగా ఉన్నాయి గదా. ఆ ప్రదేశం అరాబాలో నివసించే కనానువాళ్ళది. 31 మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ యొర్దాను దాటబోతున్నారు. మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివసిస్తారు. 32 ఈ రోజు నేను మీకు నియమించే చట్టాలు, న్యాయనిర్ణయాల ప్రకారం అక్కడ మీరు ప్రవర్తించాలి.