10
1 ✝ఆ కాలంలో యెహోవా నాతో అన్నాడు, “మునుపటి పలకలలాంటి రెండు రాతి పలకలను చెక్కి పర్వతం ఎక్కి నా దగ్గరికి రా. నీవు కర్రతో ఒక పెట్టెను కూడా చేయాలి. 2 నీవు పగులగొట్టిన ఆ మొదటి పలకలమీద ఉన్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాస్తాను. నీవు ఆ పెట్టెలో వాటిని ఉంచాలి.”3 అందుచేత తుమ్మకర్రతో పెట్టెను చేసి మొదటి పలకలలాంటి రెండు రాతి పలకలను చెక్కి, ఆ రెండు పలకలు చేతపట్టుకొని పర్వతమెక్కాను. 4 మీరు సమావేశమైన రోజు యెహోవా పర్వతంమీద మంటలమధ్యనుంచి మీతో పలికిన ఆ పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు ఆ పలకలమీద మళ్ళీ వ్రాశాడు, వాటిని నాకిచ్చాడు. 5 ✝నేను తిరిగి పర్వతం దిగివచ్చి, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు నేను చేసిన పెట్టెలో ఆ పలకలు ఉంచాను. అప్పటినుంచి ఆ పెట్టెలో ఉన్నాయి.
6 (తరువాత ఇస్రాయేల్‌ప్రజలు బెయేరోత్ బెనాయాకాను నుంచి బయలుదేరి మోసేరాకు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయి సమాధిపాలయ్యాడు. అతడి స్థానంలో అతడి కొడుకు ఎలియాజరు యాజి అయ్యాడు. 7 అక్కడనుంచి వారు గుద్గోదుకు, గుద్గోదునుంచి యొతబాతాకు ప్రయాణం అయ్యారు. యొతబాతా నీటి వాగులున్న ప్రదేశం. 8 ✝ఆ కాలంలో యెహోవా లేవీగోత్రికులను ప్రత్యేకించుకొన్నాడు. యెహోవా యొక్క మందసాన్ని మోయాలని, యెహోవా సన్నిధానంలో నిలబడి సేవ చేయాలని, ఆయన పేర దీవెనలు పలకాలని ఆయన వారిని ప్రత్యేకించుకొన్నాడు. ఈ రోజువరకు వారు అలాగే చేస్తున్నారు. 9 కాబట్టి లేవీగోత్రికులు తమ ప్రజలతోపాటు భాగం, వారసత్వం పొందలేదు. మీ దేవుడు యెహోవా వారితో చెప్పినట్టు యెహోవాయే వారికి వారసత్వం.)
10 ఆ కాలంలో, మునుపటిలాగా నలభై రాత్రింబగళ్ళూ నేను ఆ పర్వతంమీద గడిపాను. అప్పుడు కూడా యెహోవా నా మనవి ఆలకించి, మిమ్మల్ని నాశనం చేయకుండా ఉండిపోయాడు.
11 యెహోవా నాతో “లేచి, ప్రయాణమై ఈ ప్రజల ముందర సాగిపో. నేను వారికిస్తానని వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన దేశంలో ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకొనేలా చెయ్యి” అన్నాడు.
12 ✽ కాబట్టి ఇస్రాయేల్ ప్రజలారా, మీ దేవుడైన యెహోవా మీరు ఏం చేయాలని కోరుతున్నాడు? మీరు మీ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు కలిగి, ఆయన విధానాలన్నిటిలో నడుచుకోవాలి. మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ హృదయ పూర్వకంగా సంపూర్ణ ఆత్మతో సేవిస్తూ ఉండాలి. 13 మీ మేలుకోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, చట్టాలను శిరసావహించాలి. ఆయన కోరేది అదే. 14 ✝చూడండి, ఆకాశం, మహాకాశం, భూమి, భూమిపై ఉన్నదంతా, మీ దేవుడు యెహోవావే. 15 ✝అయినా యెహోవాకు మీ పూర్వీకులను ప్రేమతో చూడడం ఇష్టమైంది. వారి సంతానమైన మిమ్మల్ని జనాలన్నిటినుంచి ఎన్నుకొన్నాడు. ఈనాటికి ఇది నిజం. 16 కనుక మీ హృదయాలకు సున్నతి✽ చేసుకోండి. ఇకనుంచి మూర్ఖులు కాకుండా ఉండండి. 17 ✝మీ దేవుడు యెహోవా దేవుళ్ళకంటే అతీతుడు, ప్రభువులకు ప్రభువు, ఆయనే గొప్ప దేవుడు, బలాఢ్యుడూ బీకరుడూ అయిన దేవుడు. ఆయన పక్షపాతం చూపించనివాడు. లంచం పుచ్చుకోనివాడు. 18 ✝తల్లిదండ్రులు లేనివారికీ విధవరాండ్లకూ న్యాయం తీరుస్తాడు, విదేశీయులను ప్రేమతో చూస్తూ వారికి అన్నవస్త్రాలను ప్రసాదిస్తాడు. 19 ✝కనుక మీరు విదేశీయులను ఆదరాభిమానాలతో చూడాలి. పూర్వం మీరు కూడా ఈజిప్ట్‌లో విదేశీయులే గదా. 20 మీ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు✽ కలిగి ఆయనకు సేవ చేస్తూ ఉండాలి. ఆయనను ఏమాత్రం విడువకుండా✽ ఆయన పేర ప్రమాణం చేయాలి. 21 ✝కీర్తనీయుడు ఆయనే. మీకు దేవుడు ఆయనే. మీరు కన్నులారా చూస్తుండగా భయంకరమైన ఆ గొప్ప క్రియలు మీకోసం చేశాడు. 22 ✝మీ పూర్వీకులు ఈజిప్ట్‌కు వెళ్ళినప్పుడు వారు డెబ్భైమంది మాత్రమే. ఇప్పుడు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని సంఖ్యలో ఆకాశ నక్షత్రాలలాగా చేశాడు.