9
1 ✝ఇస్రాయేల్‌ప్రజలారా, వినండి, మీకంటే బలం గల గొప్ప జనాల దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు యొర్దానును దాటబోతున్నారు. వాళ్ళ పట్టణాలు గొప్పవి, వాటి ప్రాకారాలు ఆకాశం వరకు ఉంటాయి. 2 ✝ఆ ప్రజలు బలిష్ఠులు, పొడుగైనవాళ్ళు, మీకు తెలిసిన అనాకువాళ్ళ వంశీయులు. “అనాకువాళ్ళ ఎదుట నిలబడగలవారెవరు?” అనే మాట మీరు విన్నారు గదా! 3 ✝అయితే మీ దేవుడు యెహోవా తానే కాల్చివేసే మంటల్లాగా మీ ముందర దాటుతాడని మీరు ఈరోజు గుర్తించండి. ఆయనే వాళ్ళను నాశనం చేస్తాడు, మీ ముందు పడద్రోస్తాడు. కాబట్టి యెహోవా మీతో చెప్పినట్టే, మీరు వాళ్ళను వెళ్ళగొట్టివేస్తారు, త్వరలో వాళ్ళను నాశనం చేస్తారు.4 ✝మీ దేవుడు యెహోవా మీ ఎదుటనుంచి వాళ్ళను వెళ్ళగొట్టిన తరువాత, మీరు “మా నీతి నిజాయితీ కారణంగా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి యెహోవా మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు” అనుకోకూడదు. యెహోవా మీ ఎదుటనుంచి వాళ్ళను వెళ్ళగొట్టడానికి కారణం ఆ జనాల దుర్మార్గమే. 5 మీరు వచ్చి, వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కారణం మీ నీతి నిజాయితీ, మీ యథార్థత కాదు. ఆ జనాల దుర్మార్గాన్ని బట్టి మీ దేవుడు యెహోవా మీ ఎదుటనుంచి వాళ్ళను వెళ్ళగొట్టివేస్తాడు. అంతేగాక, మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలని యెహోవా ఉద్దేశిస్తున్నాడు. 6 ✽మీ దేవుడు యెహోవా ఈ మంచి దేశాన్ని మీ స్వాధీనం చేసే కారణం మీ నీతి నిజాయితీ కాదని తెలుసుకోండి. అసలు మీరు తలబిరుసుగా ఉన్న ప్రజలు.
7 ✽ ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం రేపిన సంగతి జ్ఞాపకం ఉంచుకోండి, అది మరవకండి. మీరు ఈజిప్ట్‌దేశంనుంచి బయలుదేరిన రోజునుంచి ఈ స్థలానికి వచ్చిన రోజువరకు మీరు యెహోవా మీద తిరగబడుతూ ఉన్నారు. 8 ✝హోరేబులో కూడా మీరు యెహోవాకు కోపం రేపారు. యెహోవాకు మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం వచ్చింది. 9 ఆ రాతి పలకలు – యెహోవా మీతో చేసిన ఒడంబడిక పలకలు – తీసుకోవడానికి నేను పర్వతం ఎక్కాను. అన్నపానాలు మాని ఆ పర్వతంమీద నలభై రోజులు రాత్రింబగళ్ళూ ఉన్నాను. 10 అప్పుడు దేవుని వ్రేలితో వ్రాసిన ఆ రెండు రాతి పలకలు యెహోవా నాకప్పగించాడు. మీరు సమావేశమైన ఆ రోజు పర్వతం మీద మంటల మధ్యనుంచి యెహోవా మీతో పలికిన వాక్కులన్నీ ఆ పలకలమీద వ్రాసి ఉన్నాయి. 11 ఆ నలభై పగళ్ళు నలభై రాత్రులు గడిచాక యెహోవా ఆ రెండు రాతి పలకలు – ఆ ఒడంబడిక పలకలు – నాకప్పగించాడు.
12 అప్పుడు యెహోవా “లే! ఇక్కడనుంచి త్వరగా దిగిపో! నీవు ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి ఆజ్ఞాపించిన మార్గంనుంచి త్వరగా తొలగిపోయి, తమకు పోత విగ్రహాన్ని చేసుకొన్నారు” అని నాతో చెప్పాడు.
13 యెహోవా నాతో ఇంకా అన్నాడు, “నేను ఈ ప్రజలను చూశాను, వారు తలబిరుసుగా ఉన్న ప్రజలు. 14 నన్ను వారిని నాశనం చెయ్యనియ్యి. వారికంటే నిన్ను బలం గల గొప్ప ప్రజగా చేస్తాను.”
15 నేను తిరిగి పర్వతం దిగి వచ్చాను. పర్వతం అగ్నితో మండుతూ ఉంది. ఆ రెండు ఒడంబడిక పలకలూ నా రెండు చేతుల్లో ఉన్నాయి. 16 అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసిన సంగతిని చూశాను. పోత దూడ విగ్రహాన్ని చేసి, యెహోవా మీకాజ్ఞాపించిన మార్గంనుంచి త్వరలోనే తొలగిపోయారు. 17 నేను ఆ రెండు పలకలు పట్టుకొన్నాను. మీ కండ్లెదుట నా చేతుల్లోనుంచి వాటిని కింద పడవేసి పగలగొట్టాను. 18 మీరు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి చేసిన మీ పాపాలన్నిటివల్ల ఆయనకు కోపం రేపారు. గనుక మునుపటిలాగా అన్నపానాలు మాని నలభై రోజులు రాత్రింబగళ్ళూ యెహోవా సన్నిధానంలో సాష్టాంగపడివున్నాను. 19 ఎందుకంటే, యెహోవాకు మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం వచ్చింది. ఆయన ఆగ్రహాన్ని, కోపాగ్నిని చూచి భయపడ్డాను. ఆ కాలంలో కూడా యెహోవా నా మనవి ఆలకించాడు. 20 యెహోవా అహరోన్ను కూడా నాశనం చేసేటంతగా అతడి మీద కోపపడ్డాడు. గనుక ఆ కాలంలో అహరోనుకోసం కూడా ప్రార్థన చేశాను. 21 అప్పుడు మీరు చేసిన పాపాన్ని, అంటే మీరు చేసిన ఆ దూడ విగ్రహాన్ని తీసుకొని అగ్నిలో వేసి కాల్చాను. నలగగొట్టాను. ధూళిలాగా పొడి చేసి, ఆ పర్వతంనుంచి పారే వాగులో దానిని పారబోశాను.
22 ✝తబేరా, మస్సా, కిబ్రోత్‌హత్తావా అనే స్థలాలలో కూడా మీరు యెహోవాకు కోపం రేపారు. 23 తరువాత యెహోవా మిమ్మల్ని కాదేష్‌బర్నేయా నుంచి పంపిస్తూ “మీరు వెళ్ళి, నేను మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి” అన్నప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు తిరగబడ్డారు. ఆయనను నమ్మలేదు. ఆయన మాట వినలేదు. 24 ✽నేను మిమ్మల్ని తెలుసుకొన్న మొదటి రోజునుంచీ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
25 ✝యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానన్నాడు. గనుక నేను యెహోవా సన్నిధానంలో నలభై రోజులు రాత్రింబగళ్ళు సాష్టాంగపడివున్నాను. 26 యెహోవాను ఇలా ప్రార్థించాను:
“యెహోవా ప్రభూ! నీ సొత్తయిన ప్రజలను నాశనం చేయకు. నీ మహత్తుమూలంగా వారిని విడిపించావు, బలిష్ఠమైన నీ హస్తంతో ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చావు. 27 నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులను తలచుకో. ఈ ప్రజల మొండితనాన్నీ దుర్మార్గాన్నీ పాపాన్నీ చూడకు. 28 నీవు ఏ దేశంనుంచి మమ్మల్ని తీసుకువచ్చావో ఆ దేశస్థులు ఇలా అంటారేమో – యెహోవా వారితో ప్రమాణం చేసిన దేశంలోకి వారిని చేర్చలేకపోయాడు, వారిని ద్వేషించాడు కూడా. గనుకనే ఎడారిలో వారిని చంపడానికి వారిని రప్పించాడు. 29 అయితే ఈ ప్రజ నీ ప్రజ, నీ సొత్తు. నీ మహా బలప్రభావాలతో, నీవు చాపిన నీ చేతితో ఈజిప్ట్ నుంచి వారిని తీసుకువచ్చావు”.