8
1 ✽మీరు బ్రతికి, సంఖ్యలో అధికమై, యెహోవా మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన దేశానికి వెళ్ళి దానిని స్వాధీనం చేసుకొనేలా ఈ వేళ నేను మీకిచ్చే అన్ని ఆజ్ఞలప్రకారం ప్రవర్తించాలి. 2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో చూచేందుకు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఎడారిలో ఈ మార్గమంతా ఈ నలభై ఏళ్ళు నడిపిస్తూ వచ్చాడు. మిమ్ములను పరీక్షించడానికి, మీ హృదయాల్లో ఉండేది పరీక్షించి చూడడానికి మిమ్మల్ని అణచివేశాడు. ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. 3 మిమ్మల్ని అణచి, మీకు ఆకలి రానిచ్చాడు; మీకు గానీ మీ పూర్వీకులకు గానీ, తెలియని మన్నాను ఆహారంగా ప్రసాదించాడు. మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ యెహోవా నోటనుంచి వచ్చే ప్రతి వాక్కువల్లా బ్రతుకుతాడని మీకు తెలియజేయాలని ఆయన ఉద్దేశం.4 ఈ నలభై ఏళ్ళు మీరు వేసుకొన్న బట్టలు పాతబడలేదు. మీ కాళ్ళకు వాపు కలగలేదు. 5 తండ్రి తన కొడుకును శిక్షించినట్టు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని శిక్షించేవాడని మీరు తెలుసుకోవాలి. ఆ సంగతి మీ హృదయంలో నాటాలి. 6 మీ దేవుడైన యెహోవాపట్ల భయభక్తులు కలిగి, ఆయన విధానాలను అనుసరించి నడుచుకోవడానికి ఆయన ఆజ్ఞలను పాటించాలి. 7 మీ దేవుడు యెహోవా మిమ్మల్ని మంచి దేశంలోకి తీసుకుపోతాడు. ఆ దేశంలో నీటివాగులు ఉన్నాయి. కొండల్లోనుంచీ, లోయలలోనుంచీ పెల్లుబికే ఊటలూ నీటిబుగ్గలు ఉన్నాయి. 8 ఆ దేశంలో గోధుమలు, యవలు, ద్రాక్షచెట్లు, అంజూర, దానిమ్మచెట్లు పెరుగుతాయి. ఆలీవ్‌నూనె, తేనె ఉన్న దేశం అది. 9 కొరత లేకుండా మీరు రొట్టెలు తినగల దేశం. అక్కడ మీకు కొదువ అంటూ ఏమీ ఉండదు. అది ఇనుప రాళ్ళు ఉన్న దేశం. ఆ దేశం కొండలలో మీరు రాగి తవ్వి తీయవచ్చు. 10 ✽మీరు అక్కడ తృప్తిగా భోజనం చేసి, మీ దేవుడు యెహోవా మీకిచ్చిన ఆ మంచి దేశం కోసం ఆయనను కీర్తిస్తారు.
11 ఈ రోజు నేను మీకు ఆదేశించే ఆయన ఆజ్ఞలను, న్యాయనిర్ణయాలను, చట్టాలను మీరు అనుసరించాలి. మీ దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండాలి. 12 మీరు కడుపునిండా తిని, మంచి ఇండ్లు కట్టి, వాటిలో కాపురమున్నప్పుడు, 13 మీ పశువులూ, మీ గొర్రె మేకలూ, మీ వెండి బంగారాలూ, మీకు కలిగినదంతా వృద్ధి అయినప్పుడు, 14 మీరు మిడిసిపడుతారేమో జాగ్రత్త! ఈజిప్ట్‌దేశంనుంచి – ఆ దాస్యగృహంలోనుంచి – మిమ్మల్ని తీసుకువచ్చిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో జాగ్రత్త! 15 విషసర్పాలు, తేళ్ళు ఉన్న భయంకరమైన ఆ గొప్ప ఎడారిలో ఆయన మీకు వెళ్ళవలసిన దారి చూపుతూ ఉన్నాడు. నీళ్ళు లేక ఎండిపోయిన ఆ ప్రదేశంలో, గట్టి బండనుంచి మీకు నీళ్ళు రప్పించాడు. 16 ✝మీ పూర్వీకులకు తెలియని మన్నాను ఆహారంగా ఆ ఎడారిలో మీకు ప్రసాదించాడు. చివరికి మీకు మేలు చేయాలని ఆయన అలా మిమ్మల్ని అణచివేశాడు, పరీక్షించాడు.
17 మీరు “మా సొంత బలప్రభావాలవల్ల ఇంత భాగ్యం మాకు లభించింది” అనుకుంటారేమో జాగ్రత్త! 18 ధనం సంపాదించుకొనే సామర్థ్యాన్ని మీకు కలిగించేవాడు మీ దేవుడు యెహోవాయే. తాను మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన తన ఒడంబడికను ఆ విధంగా సుస్థిరం చేస్తాడు. ఈ రోజు కూడా అలా జరుగుతూ ఉంది. ఆయనను జ్ఞాపకం ఉంచుకోండి.
19 ✽ఒకవేళ మీరు మీ దేవుడు యెహోవాను మరచి, ఇతర దేవుళ్ళను అనుసరించి, సేవించి, పూజిస్తే మీరు తప్పనిసరిగా నాశనం అవుతారని ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 20 మీ దేవుడు యెహోవా మాట మీరు వినకపొయ్యారా, మీకు ముందుగా యెహోవా నాశనం చేసిన జనాలలాగే మీరు కూడా నాశనం అవుతారు.