7
1 ✽మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో ప్రవేశించేలా మీ దేవుడు యెహోవా చేస్తాడు; అనేక జనాలను మీ ఎదుట పారదోలుతాడు. ఆ జనాలు హిత్తీ, గిర్గాషి, అమోరీ, కనాను, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవారు. సంఖ్యలో బలంలో మీకు మించిన ఏడు జనాలు వారు. 2 ✝మీ దేవుడు యెహోవా వాళ్ళను మీ చేతికప్పగించాక మీరు వాళ్ళను నాశనం చెయ్యాలి. వాళ్ళను నిర్మూలించాలి. వాళ్ళతో సంధి చేసుకోకూడదు. వాళ్ళను కరుణించకూడదు. 3 ✝మీరు వారితో వియ్యమందకూడదు. వాళ్ళ కొడుకులకు మీ కూతుళ్ళను ఇవ్వకూడదు. మీ కొడుకులకు వాళ్ళ కూతుళ్ళను పుచ్చుకోకూడదు. 4 ✽కారణం మీ కొడుకులు నన్ను అనుసరించడం మానుకొనేలా, ఇతర దేవుళ్ళను సేవించేలా వారిని మళ్ళిస్తారు, జాగ్రత్త! అలా జరిగితే యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకొని మిమ్మల్ని త్వరలో నాశనం చేస్తుంది. 5 ✽అందుచేత మీరు వాళ్ళకు ఇలా చెయ్యాలి – వాళ్ళ బలిపీఠాలను పడద్రోసి, వాళ్ళ పుణ్యశిలలను చితగ్గొట్టి, వాళ్ళ ఆషేరాదేవి స్తంభాలను నరికివేసి వాళ్ళ విగ్రహాలను కాల్చివేయాలి. 6 ✝ఎందుకంటే, మీరు మీ దేవుడు యెహోవాకు ప్రత్యేక ప్రజ. మీ దేవుడు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనాలలో మిమ్మల్ని తనకు స్వప్రజగా, తన సొత్తుగా ఎన్నుకొన్నాడు.7 ✝మీరు ఇతర ప్రజలకంటే ఎక్కువమంది కావడంచేత యెహోవా మిమ్మల్ని ప్రేమించలేదు, ఎన్నుకోలేదు– అసలు సమస్త జనాలలో మీరు కొద్దిమందే. 8 ✽యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు, తాను మీ పూర్వీకులతో చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు గనుక యెహోవా తన బలిష్ఠమైన హస్తంతో మిమ్మల్ని దాస్య గృహంలోనుంచీ, ఈజిప్ట్ రాజు ఫరో చేతిలోనుంచీ విడిపించాడు, ఇక్కడికి తీసుకువచ్చాడు. 9 ✝అందుచేత మీ దేవుడు యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన నమ్మదగిన దేవుడు. తనను ప్రేమిస్తూ, తన ఆజ్ఞలప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవారిపట్ల వెయ్యి తరాలవరకు తన ఒడంబడిక పాటిస్తాడు, అనుగ్రహం చూపుతాడు. 10 ✽ తనను ద్వేషించేవారికి ముఖాముఖిగా ప్రతిఫలమిచ్చి వారిని నాశనం చేస్తాడు. తనను ద్వేషించేవారి విషయం ఆయన ఆలస్యం చేయడు. ముఖాముఖిగా వారికి ప్రతిక్రియ చేస్తాడు. 11 మీరు ఇదంతా తెలుసుకోవాలి. ఈవేళ నేను మీకాదేశించే ఆజ్ఞల, చట్టాల, న్యాయనిర్ణయాల ప్రకారం ప్రవర్తించాలి.
12 మీరు ఈ న్యాయ నిర్ణయాలను విని, పాటించి, వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులతో ప్రమాణపూర్వకంగా చేసిన ఒడంబడిక మీకు నెరవేరుస్తాడు. మీమీద అనుగ్రహం చూపుతాడు. 13 ✝ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ, దీవిస్తూ, వృద్ధిచేస్తూ ఉంటాడు. మీకిస్తానని మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన దేశంలో మీ సంతానం మీదా, మీ పొలం పంటలు, మీ ధాన్యం, ద్రాక్షరసం, నూనె, మీ పశువుల పిల్లలు, మీ గొర్రెమేకల పిల్లల మీదా ఆయన దీవెనలు ఉంటాయి. 14 అన్ని జాతులకంటే మీరు ఎక్కువగా ఆశీస్సులు అనుభవిస్తారు. మీలో మగవాడికి గానీ, ఆడదానికి గానీ గొడ్డుతనం ఉండదు, మీ పశువులలోనూ ఉండదు. 15 ✝యెహోవా అన్ని రకాల రోగాలను మీ దగ్గరనుంచి తొలగిస్తాడు. ఈజిప్ట్‌లో మీకు తెలిసిన చెడ్డ జబ్బులను మీకు రానివ్వకుండా మీ పగవాళ్ళందరి మీదికి వాటిని రప్పిస్తాడు. 16 ✝మీ దేవుడు యెహోవా మీ వశం చేసే ప్రతి జనాన్ని మీరు సర్వనాశనం చేయాలి. మీరు వాళ్ళమీద జాలి చూపకూడదు, వాళ్ళ దేవుళ్ళను సేవించకూడదు. అది మీకు ఉచ్చులాగా ఉంటుంది.
17 ✽“ఈ జనాలు మాకంటే ఎక్కువమంది – మేము వాళ్ళను ఎలా పారదోలగలం?” అని మీరు అనుకుంటారేమో. 18 వాళ్ళకు మీరు భయపడకూడదు, మీ దేవుడు యెహోవా ఫరోకు, ఈజిప్ట్‌దేశమంతటికీ చేసినది మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. 19 మీ దేవుడు యెహోవా మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు మీ కళ్ళెదుట జరిగించిన ఆ గొప్ప పరీక్షలను, అద్భుతాలను, సూచనలను ఆయన బలిష్ఠమైన చేతిని, చాపిన హస్తాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు భయం పుట్టించే ఆ సమస్త జనాలకు మీ దేవుడు యెహోవా అలాగే చేస్తాడు. 20 ✝అంతే కాకుండా, మిగతావాళ్ళు, దాక్కొనేవాళ్ళు మీ ఎదుటనుంచి నశించేవరకూ మీ దేవుడు యెహోవా వాళ్ళమీదికి పెద్ద పెద్ద కందిరీగలను పంపిస్తాడు. 21 ✝మీ దేవుడు యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, బీకరుడు, గనుక మీరు వాళ్ళను చూచి భయపడకూడదు. 22 ✝మీ దేవుడు యెహోవా మీ ఎదుటనుంచి ఆ జనాలను కొంచెం కొంచెంగా తొలగిస్తాడు. అడవి మృగాలు ఎక్కువై మీకు అపాయకరం కాకూడదు గనుక మీరు ఆ జనాలను త్వరలోనే సర్వనాశనం చేయలేకపోతారు. 23 కానీ మీ దేవుడు యెహోవా వాళ్ళను మీ వశం చేసి, వాళ్ళు నాశనం అయ్యేవరకూ వాళ్ళను చిందరవందర చేసి తీరుతాడు. 24 ✝ఆయన వాళ్ళ రాజులను మీ వశం చేస్తాడు. మీరు ఆకాశం క్రింద వాళ్ళను నామరూపాలు లేకుండా చెయ్యాలి. వాళ్ళను నాశనం చేసేవరకూ ఎవ్వరూ మీ ఎదుట నిలబడలేకపోతారు. 25 ✽వాళ్ళ దేవుళ్ళ విగ్రహాలను మీరు కాల్చివేయాలి. వాటి మీద ఉండే వెండిని, బంగారాన్ని ఆశించకూడదు, తీసుకోకూడదు. దానివల్ల చిక్కుబడతారేమో జాగ్రత్త! అది మీ దేవుడు యెహోవాకు అసహ్యం. 26 దానిలాగే మీరు శాపానికి గురి కాకుండేలా అలాంటి ఏ అసహ్యమైన దానినీ మీ ఇంటికి తేకూడదు. అది శాపంక్రింద ఉన్న వస్తువు గనుక మీరు దానిని గర్హించాలి, ద్వేషంతో చూడాలి.