6
1 మీరు స్వాధీనం చేసుకోవడానికి నది దాటి వెళ్ళే దేశంలో మీరు ఆచరణలో పెట్టవలసిన ఆజ్ఞలు, చట్టాలు, న్యాయ నిర్ణయాలు ఇవి; మీ దేవుడు యెహోవా మీకు వీటిని ఉపదేశించాలని నాకు ఆజ్ఞాపించాడు. 2 ✝మీరు, మీ కొడుకులు, మీ కొడుకుల సంతానం బ్రతికి ఉన్నంతవరకూ మీ దేవుడు యెహోవాపట్ల భయభక్తులు కలిగి, నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన చట్టాలన్నీ ఆజ్ఞలన్నీ పాటిస్తూ దీర్ఘకాలం బ్రతకాలని ఆయన ఉద్దేశం. 3 అందుచేత ఇస్రాయేల్ ప్రజలారా! పాలు తేనెలు నదులై పారుతున్న దేశంలో మీరు క్షేమంగా ఉండి, అధికంగా అభివృద్ధి అనుభవించేలా ఈ మాటలు విని విధేయులుగా ఉండండి. మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీతో అలా ప్రమాణం చేశాడు గదా!4 ✽ఇస్రాయేల్ ప్రజలారా, వినండి, యెహోవా మన దేవుడు, యెహోవా మాత్రమే✽. 5 హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, శక్తి అంతటితో మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ ఉండాలి. 6 ✽ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి. 7 వాటిని మీ సంతానానికి నేర్పాలి✽. మీరు ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు, దారి వెంబడి నడుస్తూ ఉన్నప్పుడూ, పడుకొనేటప్పుడు, లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. 8 సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి✽. అవి మీ నొసట జ్ఞాపకార్థమైన వ్రాతలాగా ఉండాలి. 9 మీ ఇంటి ద్వారబంధాలమీద, మీ తలుపులమీద వాటిని వ్రాయాలి✽.
10 ✽మీకిస్తానని మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశంలో ప్రవేశపెడతాడు. మీరు కట్టని శ్రేష్ఠమైన అందమైన పట్టణాలనూ, 11 మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇండ్లనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్ష తోటలనూ ఆలీవ్ చెట్ల తోటలనూ ఆయన మీకిస్తాడు. మీరు తిని తృప్తిగా ఉంటారు. 12 అప్పుడు ఈజిప్ట్‌దేశం నుంచి – ఆ దాస్య గృహంలోనుంచి – మిమ్మల్ని తీసుకువచ్చిన యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండాలి. 13 ✽మీ దేవుడు యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. ఆయన పేర ప్రమాణం చేయాలి. 14 ✽ మీ చుట్టూరా ఉండే జనాల దేవుళ్ళలో ఏ దేవుణ్ణీ మీరు అనుసరించి సేవించకూడదు. 15 మీ దేవుడు యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన రోషం గల దేవుడు. మీరు ఇతర దేవుళ్ళను అనుసరించి సేవిస్తే మీ దేవుడు యెహోవా కోపాగ్ని మీమీద రగులుకొని దేశంలో లేకుండా మిమ్మల్ని నాశనం చేస్తుంది, జాగ్రత్త!
16 ✽మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను పరీక్షించినట్టు ఆయనను పరీక్షించకూడదు. 17 మీ దేవుడు యెహోవా మీకు నియమించిన ఆజ్ఞలనూ, శాసనాలనూ, చట్టాలనూ జాగ్రత్తగా ఆచరించాలి. 18 యెహోవా దృష్టిలో ఏది న్యాయమో, ఏది మంచిదో అదే చేయాలి. దాని ఫలితంగా మీరు క్షేమంగా ఉండి, యెహోవా మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకొంటారు. 19 యెహోవా చెప్పినట్టు మీ శత్రువులందరినీ మీ ఎదుటనుంచి వెళ్ళగొట్టివేస్తారు.
20 ✽రాబోయే కాలంలో మీ కొడుకులు “మన దేవుడు యెహోవా మీకు ఈ శాసనాల్ని, చట్టాల్ని, న్యాయనిర్ణయాల్ని నియమించాడు. వాటి భావమేమిటి?” అని మిమ్మల్ని అడిగితే, మీ కొడుకులతో ఇలా అనాలి:
21 “మేము ఈజిప్ట్‌లో చక్రవర్తి దాసులం. గానీ తన బలిష్ఠమైన చేతితో యెహోవా మమ్మల్ని ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చాడు. 22 అంతేగాక, యెహోవా ఈజిప్ట్‌మీదా, చక్రవర్తిమీదా, అతడి ఇంటివారందరిమీదా బాధకరమైన గొప్ప అద్భుతాలనూ, సూచనలనూ కనుపరచాడు. మా కళ్ళెదుటే వాటిని జరిగించాడు. 23 తాను మన పూర్వీకులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో ప్రవేశపెట్టి దీనిని మనకివ్వడానికి యెహోవా మమ్మల్ని అక్కడనుంచి తీసుకువచ్చాడు. 24 మనం మన దేవుడు యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఈ శాసనాలు శిరసావహించాలని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. మనం బ్రతికి ఉండాలనీ బ్రతికి ఉన్నంతవరకూ క్షేమంగా ఉండాలనీ ఆయన ఉద్దేశం. 25 ✝మన దేవుడు యెహోవా మనకాజ్ఞాపించినట్టే ఆయన సన్నిధానంలో ఈ ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే, అది మనకు నిర్దోషత్వంగా ఉంటుంది.”