5
1 మోషే ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిపించి ఇలా అన్నాడు: ఈ రోజు నేను మీకు చెప్పే చట్టాలు, న్యాయనిర్ణయాలు వినండి. వాటిని నేర్చుకోండి. వాటిననుసరించి నడుచుకోండి. 2 ✝మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒడంబడిక చేశాడు. 3 ఈ రోజు ఇక్కడ బ్రతికి ఉన్న మనతోనే యెహోవా ఈ ఒడంబడిక చేశాడు గానీ మన పూర్వీకులతో కాదు. 4 యెహోవా ఆ పర్వతం మీద మంటల మధ్యనుంచి ముఖాముఖిగా మీతో మాట్లాడాడు. 5 మీరు ఆ మంటలకు భయపడి ఆ పర్వతమెక్కలేదు గనుక యెహోవా వాక్కులు మీకు తెలియజేయడానికి యెహోవాకూ మీకూ మధ్య నేను నిలబడ్డాను. అప్పుడు యెహోవా అన్నాడు: 6 ✝“నేను యెహోవాను; ఈజిప్ట్‌దేశంనుంచి – ఆ దాస్య గృహంలోనుంచి – మిమ్ములను తీసుకువచ్చిన మీ దేవుణ్ణి. 7 నేను గాక వేరే దేవుడు మీకుండకూడదు. 8 మీ కోసం ఏ విగ్రహమూ చేసుకోకూడదు; పైన ఆకాశంలో గానీ, క్రింద భూమిమీద గానీ, భూమిక్రింద నీళ్ళలో గానీ ఏ రూపమూ చేసుకోకూడదు. 9 అలాంటివాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకంటే మీ దేవుడు యెహోవానైన నేను రోషంగల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాలవరకు తండ్రుల నేరాలు కొడుకుల మీదికి రప్పిస్తాను. 10 నన్ను ప్రేమిస్తూ, నా ఆజ్ఞలప్రకారం ప్రవర్తిస్తూ ఉండే వారిమీద వెయ్యి తరాలవరకు అనుగ్రహం చూపుతాను.11 “మీ దేవుడైన యెహోవా పేరు వ్యర్థంగా పలకకూడదు. యెహోవా తన పేరు వ్యర్థంగా పలికేవారిని శిక్షించకుండా ఉండడు.
12 “మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినం పవిత్ర దినంగా ఆచరించాలి. 13 ఆరు రోజులు పాటుపడి మీ పనంతా చెయ్యాలి. 14 కాని ఏడో రోజు మీ దేవుడు యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున మీరు, మీ కొడుకులు, మీ కూతుళ్ళు, మీ దాసులు, మీ దాసీలు, మీ ఎడ్లు, మీ గాడిదలు, మీ పశువులు, మీ దగ్గర కాపురం ఉన్న పరదేశులు ఏ పనీ చెయ్యకూడదు. మీలాగే మీ దాసులు, దాసీలు విశ్రమించేలా మీరు ఈ విధంగా చెయ్యాలి. 15 పూర్వం ఈజిప్ట్‌దేశంలో మీరు దాసులనీ, మీ దేవుడు యెహోవా బలిష్ఠమైన హస్తంతో, చాపిన చేతితో మిమ్ముల్ని అక్కడనుంచి తీసుకువచ్చాడనీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుచేత విశ్రాంతి దినం ఆచరించాలని మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించాడు.
16 “మీ దేవుడు యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతికేలా, క్షేమంగా ఉండేలా, మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు మీ తండ్రినీ తల్లినీ సన్మానించాలి.
17 “హత్య చెయ్యకూడదు.
18 “వ్యభిచారం చెయ్యకూడదు.
19 “దొంగతనం చెయ్యకూడదు.
20 “మీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు.
21 “మీ పొరుగువాడి భార్యను ఆశించకూడదు. పొరుగువాడి ఇల్లు గానీ పొలం గానీ దాసుణ్ణి గానీ దాసిని గానీ ఎద్దును గానీ గాడిదను గానీ పొరుగువాడికున్న దేనినీ ఆశించకూడదు.” 22 ✝ఈ వాక్కులు యెహోవా ఆ పర్వతం మీద మంటలు, మబ్బు, దట్టమైనా పొగమంచులలో నుంచి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో చెప్పాడు. ఆ తరువాత ఆయన ఊరుకొన్నాడు. ఈ వాక్కులు రెండు రాతి పలకల మీద రాసి నాకిచ్చాడు. 23 ఆ పర్వతం మంటలవల్ల మండుతూ ఉంటే, ఆ చీకటి మధ్యనుంచి ఆ స్వరం మీరు విన్నప్పుడు మీ గోత్రాల నాయకులూ, మీ పెద్దలూ నా దగ్గరికి వచ్చారు. మీరు నాతో ఇలా అన్నారు:
24 “మన దేవుడు యెహోవా తన మహిమాప్రకాశాన్ని మహత్తునూ మనకు చూపించాడు. మంటలలోనుంచి ఆయన స్వరం మనకు వినిపించింది. దేవుడు మనుషులతో మాట్లాడుతాడనీ, మాట్లాడితే మనుషులు బతకగలరనీ ఇవ్వేళ మాకు తెలిసిపోయింది. 25 ✝అయితే ఇప్పుడు మేము ఎందుకు చచ్చిపోవాలి? ఈ గొప్ప మంటలు మమ్మల్ని దహించి వేస్తాయి. అంతేగాక, మన దేవుడు యెహోవా స్వరాన్ని ఇంకా వింటే చచ్చిపోతాం. 26 ✝మానవకోటి అంతట్లో మాలాగా మరెవరైనా సజీవ దేవుని స్వరం మంటలలో నుంచి పలకడం విని బతికారా? 27 మీరే మన దేవుడు యెహోవా దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పేదంతా వినండి. మన దేవుడు యెహోవా మీతో చెప్పేదంతా మీరే వచ్చి మాతో చెప్పండి. అప్పుడు మేము విని దాని ప్రకారం చేస్తాం.”
28 మీరు నాతో మాట్లాడినప్పుడు మీరు చెప్పినది యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు: “ఈ ప్రజలు నీతో చెప్పిన సంగతులు నేను విన్నాను. వారు చెప్పినదంతా మంచిదే. 29 ✽ వారికీ వారి సంతానానికీ ఎల్లకాలం క్షేమంగా ఉండేలా నాపట్ల భయభక్తులు గలిగి నా ఆజ్ఞలన్నిటికీ లోబడే హృదయం వారికుంటే ఎంత బాగుంటుంది! 30 ‘మీ గుడారాలకు తిరిగి వెళ్ళాల’ ని నీవు వెళ్ళి వారితో చెప్పు. 31 ✝తరువాత నీవు ఇక్కడ నా దగ్గర నిలబడాలి. నీవు వారికి ఉపదేశించవలసిన ఆజ్ఞలు, చట్టాలు, న్యాయ నిర్ణయాలు అన్నీ నేను నీతో చెప్తాను. వారు స్వాధీనం చేసుకోవడానికి నేను వారికిచ్చే దేశంలో వారు వాటి ప్రకారం ప్రవర్తించాలి.” 32 ✝అందుచేత మీరు కుడికి గానీ ఎడమకు గానీ తొలగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించినట్టే చేయడానికి జాగ్రత్తగా ఉండాలి. 33 ✝మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో మీరు బ్రతుకుతూ, క్షేమంగా ఉండి, చాలాకాలం బ్రతికేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గమంతట్లో నడుచుకోవాలి.