4
1 ✽ఇస్రాయేల్ ప్రజలారా! నేను మీకు ఉపదేశించే చట్టాలనూ, న్యాయనిర్ణయాలనూ అనుసరించి మెలగండి. అప్పుడు మీరు బ్రతికి, మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకొంటారు. 2 ✝మీ దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలే మీకిస్తున్నాను. మీరు వాటిని పాటించాలి. నేను ఆజ్ఞాపించే మాటలకు ఏ మాటా కలపకూడదు. వాటిలోనుంచి ఏదీ తీసివేయకూడదు. 3 ✝బేల్‌పెయోరు విషయంలో యెహోవా చేసినది మీరు కన్నులారా చూశారు గదా. బేల్ పెయోరు దేవుణ్ణి అనుసరించిన వారందరినీ మీ మధ్య లేకుండా మీ దేవుడు యెహోవా నాశనం చేశాడు. 4 అయితే మీ దేవుడు యెహోవాను విడవకుండా ఉన్న మీరందరూ ఈవేళ బతికి ఉన్నారు. 5 ✝నా దేవుడు యెహోవా నా కాజ్ఞాపించినట్టే చట్టాలనూ న్యాయనిర్ణయాలనూ మీకు ఉపదేశించాను. మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో మీరు వాటి ప్రకారం ప్రవర్తించాలి. 6 ✝వాటిని పాటించి ఆచరణలో పెట్టుకోవాలి. ఈ శాసనాలన్నిటిని గురించి వినే జనాలు “ఈ గొప్ప ప్రజ జ్ఞాన వివేకాలు గల జనం. అనుమానం లేదు” అంటారు. ఈ శాసనాలను పాటించడం వారి దృష్టిలో మీకు జ్ఞానం, వివేకం. 7 ✝మన దేవుడైన యెహోవాకు మొర పెట్టినప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఈ విధంగా మరి ఏ గొప్ప జనానికీ ఏ దేవుడూ సమీపంగా లేడు గదా. 8 ✝ఈ వేళ నేను మీకు నేర్పే ఈ సమస్త ఉపదేశంలాంటి నీతిగల చట్టాలూ న్యాయనిర్ణయాలూ ఏ గొప్ప జనానికి ఉన్నాయి?9 అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కన్నులారా చూచినవాటిని మరవకుండా, బ్రతికి ఉన్నంతవరకూ✽ అవి మీ హృదయంలోనుంచి తొలగిపోకుండా మీ మనస్సును పదిలంగా కాపాడుతూ ఉండాలి. మీరు చూచినవాటిని మీ కొడుకులకు, మీ కొడుకుల కొడుకులకు✽ తెలియజేయాలి. 10 ✝మీరు హోరేబు పర్వతం దగ్గర మీ దేవుడు యెహోవా సన్నిధానంలో నిలబడ్డ రోజును గురించి వారికి తెలియజేయాలి. ఆ రోజు యెహోవా నాతో, “నా దగ్గరికి ప్రజలను సమకూర్చు. వారు భూలోకంలో బ్రతికే రోజులన్నీ నాపట్ల భయభక్తులతో ప్రవర్తించడానికి నేర్చుకోవాలి, వారి సంతానానికి నేర్పాలి; గనుక వారికి నా మాటలు వినిపిస్తాను” అన్నాడు.
11 ✝అప్పుడు మీరు దగ్గరికి వచ్చి ఆ పర్వతం దిగువను నిలిచారు. ఆ పర్వతం మండుతూ ఉంది, మంటలు ఆకాశంవరకు లేచాయి. దానిని చీకటి, మబ్బు, దట్టమైన పొగ మంచు కమ్మాయి. 12 ఆ మంటల మధ్యలో నుంచి యెహోవా మీతో మాట్లాడాడు. మాట్లాడే స్వరం మీరు విన్నారు గాని ఏ ఆకారాన్నీ చూడలేదు. స్వరం వినిపించింది అంతే. 13 అప్పుడు పది ఆజ్ఞలు✽ అనే తన ఒడంబడిక యెహోవా మీకు తెలియజేశాడు. వాటి ప్రకారం మీరు ప్రవర్తించాలని ఆజ్ఞాపించాడు. రెండు రాతి పలకలమీద వాటిని రాశాడు. 14 మీరు నది దాటి స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో ఆచరణలో పెట్టవలసిన చట్టాలు, న్యాయ నిర్ణయాలు మీకు ఉపదేశించాలని యెహోవా నాకాజ్ఞ ఇచ్చాడు.
15 ✽హోరేబులో మంటల మధ్యనుంచి యెహోవా మీతో మాట్లాడిన రోజు మీరు ఏ రూపాన్నీ చూడలేదు గనుక మీరు భ్రష్టులు కాకుండా మీ కోసం ఏ విగ్రహాన్నీ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. 16 ✝మీరు ఏ ఆకారం గల విగ్రహాన్నీ, ఏ మగవాడి, ఏ ఆడదాని విగ్రహాన్నీ చేయకూడదు; 17 భూమిమీద ఉన్న ఏ జంతువు విగ్రహాన్నీ, గాలిలో ఎగిరే ఏ పక్షి విగ్రహాన్నీ, 18 నేలమీద ప్రాకే ఏ ప్రాణి విగ్రహాన్నీ, భూమికింద నీళ్ళలో ఉన్న ఏ చేప విగ్రహాన్నీ చేయకూడదు, జాగ్రత్త! 19 ✽అంతేగాక, ఆకాశంవైపు తలెత్తి, ఆకాశ సమూహం – సూర్య చంద్ర నక్షత్రాలను – చూచి, వాటిని పూజించడానికీ సేవించడానికీ దుష్టప్రేరేపణకు లొంగకుండా జాగ్రత్త! అవి మీ దేవుడు యెహోవా ఆకాశమంతటి కింద ఉన్న అన్ని జనాలకు ఇచ్చినవి గదా. 20 ✝మీరైతే తనకు స్వకీయ జనంగా ఉండాలని యెహోవా మిమ్మల్ని ఈజిప్ట్‌నుంచి – ఆ ఇనుప కొలిమిలో నుంచి – తీసుకువచ్చాడు. ఈ రోజు మీరు ఆయన స్వజనులే గదా.
21 ✝యెహోవా మీ మేలు కోరి నామీద కోపంగా ఉండి, నేను ఈ యొర్దాను దాటకూడదనీ, మీ దేవుడు యెహోవా వారసత్వంగా మీకిచ్చే ఈ మంచి దేశంలో ప్రవేశించకూడదనీ శపథం చేశాడు. 22 నేను యొర్దాను దాటను. ఈ దేశంలోనే చనిపోతాను. మీరైతే దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. 23 మీ దేవుడు యెహోవా మీతో చేసిన ఒడంబడికను మరవకూడదు, జాగ్రత్త! 24 ✝ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే మంటల్లాంటివాడు, రోషంగల దేవుడు.
25 ✽మీకు సంతానం కలిగి, ఆ సంతానానికి కూడా సంతానం కలిగి ఆ దేశంలో చాలా కాలం కాపురం ఉన్న తరువాత మీ జీవిత విధానాన్ని పాడు చేసుకొంటే ఏదైనా ఆకారంగల విగ్రహాన్ని చేస్తే, మీ దేవుడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి ఆయనకు కోపం✽ రేపితే 26 మీరు ఆ దేశంలో ఉండకుండా త్వరలో అంతు లేకుండాపోతారు. భూమినీ ఆకాశాన్నీ మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను; మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబొయ్యే ఆ దేశంలో ఎక్కువ రోజులు ఉండక పూర్తిగా నాశనమవుతారు. 27 యెహోవా మిమ్మల్ని వేరు వేరు ప్రజలమధ్యకు చెదరగొట్టివేస్తాడు. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తొలగిస్తాడో అక్కడి జనాలలో మీరు కొద్దిమందే మిగిలి ఉంటారు. 28 ✝అక్కడ కర్రతో, రాతితో మనుషులు తయారు చేసిన దేవుళ్ళను మీరు కొలుస్తారు. అవి చూడలేవు, వినలేవు, వాసన చూడలేవు. 29 ✽అక్కడ ఉండి, మీరు మీ దేవుడు యెహోవాను వెదుకుతారు. హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో వెదికితే మీరు ఆయనను కనుగొంటారు. 30 చివరి రోజుల్లో ఇవన్నీ మీకు సంభవించాక బాధలో మీరు మీ దేవుడు యెహోవావైపు తిరిగి, ఆయన మాట వింటారు. 31 మీ దేవుడు యెహోవా జాలిగల✽ దేవుడు. మిమ్మల్ని చెయ్యి విడువడు✽; మిమ్మల్ని నాశనం చెయ్యడు; ఆయన మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన ఒడంబడికను మరచిపోడు.
32 ✽దేవుడు భూమిమీద మానవుణ్ణి సృజించిన రోజు మొదలుకొని, మీకు పూర్వం ఉన్న కాలమంతటిని గురించీ పరిశీలించండి. ఆకాశంలో ఆ దిక్కునుంచి ఈ దిక్కువరకు వెదకండి. ఇంత గొప్ప క్రియ మరొకటి ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటి వార్త ఎక్కడైనా వినిపించిందా? 33 దేవుని స్వరం మంటల మధ్య నుంచి మాట్లాడడం మీరు విన్నట్లు మరే జనమైనా విని బతికిందా? 34 మీ దేవుడు యెహోవా మీ కళ్ళెదుటే విషమ పరీక్షలతో, అద్భుతమైన సూచనలతో, మహాక్రియలతో, యుద్ధంతో, బలిష్ఠమైన హస్తంతో, చాచిన చేతితో, మహా భయంకరమైన చర్యలతో మిమ్మల్ని ఈజిప్ట్‌నుంచి రప్పించాడు గదా. ఆ విధంగా మరే దేవుడైనా ఒక జనాన్ని మరో జనంలోనుంచి రప్పించడానికి ప్రయత్నం చేశాడా? 35 యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప మరో దేవుడు లేడనీ మీరు తెలుసుకొనేలా అవన్నీ మీకు చూపించాడు. 36 మీకు మీ శిక్షణకోసం ఉపదేశించడానికి ఆయన ఆకాశంలోనుంచి తన స్వరం వినిపించాడు. భూమిమీద తన గొప్ప మంటలు మీకు చూపించాడు. ఆ మంటల మధ్యనుంచి వినిపించిన ఆయన వాక్కులు మీరు విన్నారు. 37 ఆయన మీ పూర్వీకులను ప్రేమించాడు, వారి తరువాత వారి సంతానాన్ని ఎన్నుకొన్నాడు. మీకు తోడుగా ఉండి, తన మహాబలం చేత మిమ్మల్ని ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాడు. 38 మీకంటే బలమైన గొప్ప జనాలను మీ ఎదుటనుంచి వెళ్ళగొట్టి వారి దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టి, దాన్ని మీకు వారసత్వంగా ఇవ్వడానికి ఆయన ఉద్దేశించాడు. ఈ రోజు అలా జరుగుతూ ఉంది కూడా. 39 అందుచేత పైన ఉన్న ఆకాశంలో గానీ, కింద ఉన్న భూమిమీద గానీ, యెహోవాయే దేవుడనీ మరో దేవుడు లేడనీ ఈరోజు తెలుసుకోండి. మీ హృదయాలలో ఈ సంగతి నాటనివ్వండి. 40 ఈ రోజు నేను మీకిచ్చే ఆయన ఆజ్ఞలనూ శాసనాలనూ మీరు పాటించండి. అప్పుడు మీకూ, మీ తరువాత మీ సంతానానికీ క్షేమం కలుగుతుంది, మీ దేవుడు యెహోవా ఎల్లకాలం ఇచ్చే దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతుకుతారు.
41 ✝అప్పుడు మోషే యొర్దాను తూర్పు దిక్కున ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకించాడు. 42 ఎవరైనా పగ పట్టకుండా, బుద్ధిపూర్వకంగా కాకుండా ఒక మనిషిని చంపితే ఆ వ్యక్తి ఆ పట్టణాలలో ఒక దానికి పారిపోయేలా, పారిపోయి అందులో బ్రతికేలా మోషే వాటిని ప్రత్యేకించాడు. 43 ఆ పట్టణాలు బేసెరు, రామోతు, గోలాను. బేసెరు రూబేనుగోత్రికులకు అరణ్యంలో ఉన్న ఎత్తైన మైదానాల ప్రాంతంలో ఉంది; రామోతు గాదుగోత్రికులకు గిలాదులో ఉంది; గోలాను మనష్షేగోత్రికులకు బాషానులో ఉంది.
44 మోషే ఇస్రాయేల్ ప్రజలకిచ్చిన ఉపదేశం ఇది. 45 ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌నుంచి వచ్చిన తరువాత, యొర్దాను తూర్పున బేత్‌పెయోరు ఎదుటి లోయలో, హెష్బోనులో ఉండే అమోరీవాళ్ళ రాజు సీహోను దేశంలో ఉన్నప్పుడు, మోషే వారికి ఇచ్చిన విధులూ, చట్టాలూ న్యాయ నిర్ణయాలూ ఇవి. 46 మోషే, ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్‌నుంచి వచ్చి ఆ సీహోన్ను హతం చేశారు; 47 అతడి దేశాన్ని, బాషాను రాజు ఓగు దేశాన్ని కూడా స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఇద్దరు రాజులు యొర్దాను అవతల, తూర్పుదిక్కున ఉన్న అమోరీవాళ్ళ రాజులు. 48 ఇస్రాయేల్‌ప్రజలు స్వాధీనం చేసుకొన్న ప్రాంతం అర్నోను లోయ అంచున ఉన్న అరోయేర్‌నుంచి సీయోను పర్వతం అనే హెర్మోను వరకు, 49 యొర్దాను అవతల తూర్పున ఉన్న అరాబా లోయ అంతా పిస్గా పర్వతం చరియల దిగువగా అరాబా సరస్సు వరకు ఉంది.