3
1 ✽ అప్పుడు బాషాను వైపుకు తిరిగి అక్కడికి వెళ్ళాం. బాషానురాజు ఓగు, అతడి జనమంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి మనకు ఎదురుగా వచ్చారు.2 యెహోవా “అతడికి భయపడకు. నేను అతణ్ణి అతడి సమస్త జనాన్ని, అతడి దేశాన్ని నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో కాపురమున్న అమోరీవారి రాజు సీహోనుకు చేసినట్టు ఇతడికి చేస్తావు” అన్నాడు నాతో.
3 ఆ విధంగా మన దేవుడైన యెహోవా బాషాను రాజు ఓగునూ అతడి సమస్త జనాన్నీ మనకు అప్పగించాడు. అతడికి ఎవ్వరూ మిగలకుండా వాళ్ళను హతమార్చాం. 4 ఆ కాలంలో అతడి పట్టణాలన్నిటినీ పట్టుకొన్నాం. వారి పట్టణాలలో మనం పట్టుకోని పట్టణం అంటూ ఒక్కటి కూడా లేకపోయింది. బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రదేశమంతటినీ దాని అరవై పట్టణాలను పట్టుకున్నాం. 5 ఈ పట్టణాలన్నిటికీ ఎత్తయిన గోడలూ ద్వారం తలుపులూ గడియలూ ఉన్నాయి. ఈ పట్టణాలు గాక గోడలులేని అనేక గ్రామాలనుకూడా పట్టుకున్నాం. 6 ✝మనం హెష్బోను రాజైన సీహోనును చేసినట్టే వాటిని సర్వనాశనం చేశాం. ప్రతి పట్టణంలో స్త్రీ పురుషులనూ పిల్లలనూ కూడా నిర్మూలించాం. 7 పశువులన్నిటినీ, ఆ పట్టణాల సొమ్మును కొల్లగొట్టాం.
8 ఆ కాలంలో ఈ విధంగా అర్నోను లోయనుంచి హెర్మోనుపర్వతం వరకు, యొర్దాను తూర్పుదిక్కున ఉన్నప్రదేశాన్ని అమోరీవారి ఇద్దరు రాజుల స్వాధీనంలో ఉంటే మనం పట్టుకున్నాం. 9 (హెర్మోను పర్వతాన్ని సీదోనువాసులు ‘షిర్యోన్’ అంటారు. అమోరీవాళ్ళు దానిని ‘శెనీర్’ అంటారు.) 10 ఈ మైదానాల ప్రాంతం పట్టణాలన్నిటినీ గిలాదునూ బాషానునూ అంతా – బాషానులో ఓగు రాజ్యంలోని సల్కా, ఎద్రెయీ అనే పట్టణాలవరకు పట్టుకున్నాం. 11 (రెఫాయీం వాళ్ళలో బాషానురాజు ఓగు ఒక్కడే మిగిలేవాడు. అతడి మంచం ఇనుప మంచం. అది అమ్మోనువారి రబ్బాలో ఉంది గదా. ఆ మంచం పొడుగు మామూలు మనిషి మూర ప్రకారం తొమ్మిది మూరలు. దాని వెడల్పు నాలుగు మూరలు.)
12 ✝ఆ కాలంలో ఈ ప్రదేశాలను పట్టుకొన్నప్పుడు అర్నోనులోయ దగ్గర ఉన్న అరోయేర్‌నుంచి ఉన్న ప్రాంతం, గిలాదు కొండసీమలో సగం, దాని పట్టణాలతోపాటు రూబేను గోత్రికులకూ గాదుగోత్రికులకూ ఇచ్చాను. 13 గిలాదులో మిగతా ప్రాంతం ఓగు రాజ్యం అయిన బాషాను అంతా మనష్షే అర్ధ గోత్రానికి ఇచ్చాను. 14 (ఆ అర్గోబు ప్రదేశమంతటినీ బాషాను అంతటినీ ‘రెఫాయీం వాళ్ళ దేశం’ అంటారు. అర్గోబు ప్రదేశమంతటినీ, గెషూరివారి, మాయాకావారి సరిహద్దుల వరకూ మనష్షే వంశీయుడైన యాయీరు పట్టుకున్నాడు. ఆ బాషానుకూ, అక్కడి గ్రామాలకూ ‘హవ్వోత్ యాయీరు’ అనే పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ ఆ పేరు ఉంది.)
15 గిలాదు ప్రదేశాన్ని మాకీరు వంశీయులకు ఇచ్చాను. 16 నేను రూబేను గోత్రికులకూ గాదు గోత్రికులకూ ఇచ్చినది గిలాదు మొదలుకొని అర్నోనులోయ మధ్యవరకు, అమ్మోనువారి పడమటి సరిహద్దు అయిన యబ్బోకు ఏటివరకు ఉన్న ప్రాంతం. 17 కిన్నెరెతు సరస్సు మొదలుకొని అరాబా సరస్సు (ఉప్పు సముద్రం) వరకు, తూర్పు దిక్కున పిస్గా పర్వత చరియలవరకు ఉన్న ఆ అరాబా ప్రాంతానికి సరిహద్దు యొర్దాను నది. 18 ఆ కాలంలో నేను మీకు ఇలా ఆజ్ఞాపించాను: “మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడు యెహోవా దీనిని మీకిచ్చాడు. మీలో ఉన్న వీరులందరూ ఆయుధాలు ధరించి, మీ సోదరులైన ఇస్రాయేల్‌ప్రజల ముందర నది దాటాలి. 19 మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు – మీకు చాలా పశువులు ఉన్నాయని నాకు తెలుసు – నేను మీకిచ్చిన ఇక్కడి పట్టణాలలోఉండిపోవచ్చు. 20 యెహోవా మీకు విశ్రాంతి ఇచ్చినట్టే మీ బంధువులకు కూడా విశ్రాంతి ఇచ్చేవరకూ, మీ దేవుడు యెహోవా యొర్దాను అవతల వారికిచ్చే దేశాన్ని వారు స్వాధీనం చేసుకొనేవరకూ, మీరు వారికి తోడ్పడాలి. తరువాత మీలో ప్రతి ఒక్కరూ నేను మీకిచ్చిన మీ మీ ఆస్తిపాస్తుల దగ్గరికి తిరిగి రావాలి.”
21 ✽ఆ కాలంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను: “నీ దేవుడు యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నీవు కన్నులారా చూశావు. నీవు దాటివెళ్ళే అన్ని రాజ్యాలకూ యెహోవా అలాగే చేస్తాడు. 22 మీ దేవుడు యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు అక్కడివాళ్ళకు భయపడకూడదు.”
23 ఆ కాలంలో నేను యెహోవాను ఇలా బ్రతిమిలాడుకొన్నాను: 24 “యెహోవా! ప్రభూ! నీ మహత్తునూ బలమైన నీ చేయినీ నీ సేవకుడైన నాకు కనుపరచడం మొదలుపెట్టావు. నీవు చేసే కార్యకలాపాలు, మహా క్రియలు చేయగల మరో దేవుడు పరలోకంలో గానీ, భూమిమీద గానీ ఎవ్వడూ లేడు. 25 దయ చూపి, నన్ను అవతలికి వెళ్ళనియ్యి. యొర్దాను అవతలి ఆ మంచి దేశాన్ని, ఆ మంచి కొండసీమను లెబానోన్ను చూడనివ్వు.”
26 ✽కానీ యెహోవా మీ మేలు కోరి నా మీద కోపపడ్డాడు. నా మనవి వినలేదు. యెహోవా నాతో అన్నాడు, “చాలు. ఇకమీదట ఈ సంగతి నాతో మాట్లాడవద్దు. 27 నీవు ఈ యొర్దాను దాటకూడదు. పిస్గాపర్వత శిఖరానికి ఎక్కిపో. నీ తలెత్తి పడమటివైపు, ఉత్తరంవైపు, దక్షిణంవైపు, తూర్పువైపు ఈ ప్రదేశాలను చూడు. 28 ✽యెహోషువ ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి, నీవు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనం చేసుకొనేలా చేస్తాడు. అతడికి ఆజ్ఞాపించు. అతణ్ణి ధైర్యపరచు, బలపరచు.” 29 అప్పుడు మనం బేత్ పెయోరు దగ్గర ఉన్న లోయలో ఉండిపోయాం.