2
1 తరువాత యెహోవా నాతో చెప్పినట్టు మనం ఎర్రసముద్రంవైపుకు తిరిగి, ఎడారికి ప్రయాణమయ్యాం. శేయీరు కొండసీమలో తిరుగాడుతూ మనం చాలా రోజులు గడిపాం. 2 అప్పుడు యెహోవా నాతో 3 “మీరు ఈ కొండసీమలో తిరిగినకాలం చాలు. ఉత్తర దిక్కుకు తిరగండి” అన్నాడు.
4 ఆయన నాతో ఇంకా అన్నాడు, “నీవు ప్రజలకు ఈ విధంగా ఆదేశించు – శేయీరులో కాపురమున్న ఏశావు సంతతివారు మీ బంధువులు. మీరు వాళ్ళ సరిహద్దులను దాటి వెళ్ళబోతున్నారు. వారు మీకు భయపడతారు గానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 వారిని రెచ్చగొట్టకూడదు. నేను శేయీరు కొండసీమను ఏశావు స్వాధీనం చేశాను గనుక వారి భూమిలో ఒక్క అడుగైనా మీకివ్వను. 6 మీరు డబ్బిచ్చి వారిదగ్గర ఆహార పదార్థాలను కొని తినవచ్చు. నీళ్ళకోసం వారికి డబ్బిచ్చి త్రాగవచ్చు. 7 మీరు చేసిన పనులన్నిట్లో మీ దేవుడు యెహోవా మీకు ఆశీస్సులు ప్రసాదించాడు. ఈ మహా ఎడారిలో మీరు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఈ నలభై సంవత్సరాలలో మీ దేవుడు యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. మీకేమి తక్కువ కాలేదు.”
8 అప్పుడు శేయీరులో నివసించే ఏశావు సంతతివారైన మన బంధువులను విడిచి ఏలతు, ఎసోన్‌గెబెరు, ఆరాబా మార్గంనుంచి మనం ప్రయాణం చేశాం. మోయాబు ఎడారివైపుకు తిరిగి, ఆ త్రోవలో పయనించాం.
9 యెహోవా “మోయాబువారిని బాధించకూడదు. వారిని యుద్ధానికి పురికొల్పకూడదు. ఆర్ ప్రదేశాన్ని లోత్ వంశీయుల స్వాధీనం చేశాను. వారి భూమిలో కొంచెమైనా మీ వశం చేయను” అని నాతో అన్నాడు. 10 (పూర్వకాలంలో ఏమీం అనేవారు ఆర్ ప్రదేశంలో నివసించేవారు. వారు బలంలో, బలగంలో అధికులు. అనాకువారిలాగే పొడగాటి వాళ్ళు. 11 అనాకువారూ ఏమీంవారూ రెఫాయింవాళ్ళని ప్రజలు అనుకొంటారు అయితే మోయాబు దేశస్థులు వారిని “ఏమీం వాళ్ళు” అంటారు. 12 పూర్వం హోరివాళ్ళు శేయీరులో నివసించేవాళ్ళు. అయితే ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా తమకిచ్చిన దేశంలో చేసినట్టే ఏశావు సంతతివారు హోరివారిని తమ ఎదుట లేకుండా నాశనం చేశారు. వారి దేశాన్ని స్వాధీనం చేసుకొని వారి స్థానంలో అక్కడ నివసించారు.)
13 యెహోవా “మీరు లేచి జెరెదు వాగు దాటండి” అని చెప్పినప్పుడు మనం జెరెదు వాగు దాటిపోయాం. 14 మనం కాదేష్‌బర్నేయనుంచి బయలుదేరి జెరెదు వాగు దాటేవరకు ప్రయాణాలు ముప్ఫయి ఎనిమిది ఏళ్ళు పట్టింది. ఆ లోగా యెహోవా ఆ తరంలో ఉన్న సైనికుల గురించి శపథం చేసినట్టే వారంతా శిబిరంలో ఉండకుండా నశించారు. 15 వారు శిబిరంలో ఉండకుండా పూర్తిగా నశించేవరకూ యెహోవా చెయ్యి వారికి విరోధంగా ఉంది.
16 ఆ సైనికులంతా ప్రజలలోనుంచి నాశనమైపోయాక, 17 యెహోవా నాతో అన్నాడు, 18 “ఈవేళ నీవు ఆర్ అనే మోయాబు దేశం సరిహద్దులను దాటబోతున్నావు. 19 అమ్మోనువారిని సమీపించినప్పుడు వారిని బాధించకూడదు, యుద్ధానికి వారిని పురికొల్పకూడదు. అమ్మోనువారి దేశాన్ని లోత్ సంతతివారి స్వాధీనం చేశాను. గనుక దానిలో ఏదీ మీ వశం చేయను.”
20 (ఆ దేశాన్ని కూడా రెఫాయీంవాళ్ళ దేశం అంటారు. పూర్వం రెఫాయీంవాళ్ళు అక్కడ నివసించారు. అమ్మోనువారు వాళ్ళను జంజుమ్మిం వాళ్ళంటారు. 21 వాళ్ళు బలంలో, బలగంలో అధికులు, అనాకువారిలాగే పొడువైనవాళ్ళు. కాని యెహోవా అమ్మోనువారి ఎదుట లేకుండా వాళ్ళను నాశనం చేశాడు. అమ్మోనువారు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళ స్థానే అక్కడ నివాసం ఉన్నారు. 22 శేయీరులో నివసించే ఏశావు సంతతివారి ఎదుట లేకుండా హోరివాళ్ళను యెహోవా నాశనం చేసినట్టే ఆయన అమ్మోనువారి కోసం చేశాడు. ఏశావు సంతానం హోరివాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొని, ఇప్పటికీ వాళ్ళ స్థానంలో నివసిస్తున్నారు. 23 ఆవివాళ్ళ సంగతి కూడా అంతే. పూర్వం వాళ్ళు గాజా దగ్గర ఉన్న గ్రామాలలో నివసించేవాళ్ళు గాని కఫ్తోరివాళ్ళు కఫ్తోరునుంచి వచ్చి వాళ్ళను నాశనం చేసి, వాళ్ళ స్థానంలో అక్కడ కాపురమేర్పరచుకొన్నారు.)
24 యెహోవా “మీరు లేచి, తరలి వెళ్ళి అర్నోను లోయను దాటండి. ఇదిగో, అమోరీవాడూ హెష్బోను రాజూ అయిన సీహోన్ను, అతడి దేశాన్ని మీ చేతికి అప్పగించాను. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మొదలుపెట్టండి, అతణ్ణి యుద్ధానికి పురికొల్పండి. 25 ఈ వేళే మిమ్ములను గురించిన భయాందోళన ఆకాశం కింద ఉన్న అన్ని జాతులవారికి పుట్టించడం ఆరంభిస్తున్నాను. వారు మిమ్ములను గురించిన కబురు విని మీ ఎదుట కంగారుపడతారు, కంపిస్తారు” అన్నాడు.
26 అప్పుడు నేను కెదేమోతు ఎడారి నుంచి హెష్బోనురాజు సీహోను దగ్గరికి ఈ శాంతి వాక్కులతో వార్తాహరులను పంపించాను: 27 “నన్ను మీ దేశం మీదుగా దాటిపోనివ్వండి. మేము రహదారినే నడిచిపోతాం. కుడి యెడమలకు తిరగము. 28 డబ్బుతో మేము తాగే నీళ్ళను, తినే భోజన పదార్థాలను మీదగ్గర కొంటాం. 29 శేయీరులో నివసించే ఏశావు సంతతివారు, ఆర్‌లో నివసించే మోయాబువారు తమ దేశాలగుండా మమ్ములను వెళ్ళనిచ్చారు. మా దేవుడు యెహోవా మాకిచ్చే దేశంలో ప్రవేశించడానికి యొర్దాను దాటేవరకు మీరు కూడా మమ్ములను కాలినడకన సాగిపోనివ్వండి.”
30 అయితే హెష్బోను రాజు సీహోను తన దేశం గుండా మనల్ని వెళ్ళనివ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మన చేతికి అతణ్ణి అప్పగించాలని మన దేవుడు యెహోవా అతడి మనస్సు కఠినం చేశాడు, అతడి గుండె బండబారిపోయేలా చేశాడు. ఈవేళ ఆ సంగతి స్పష్టమే గదా.
31 యెహోవా “ఇదిగో విను. సీహోన్ను, అతడి దేశాన్ని నీకు అప్పగించడం ఆరంభించాను. అతడి దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టు” అన్నాడు నాతో.
32 సీహోను, అతడి జనమంతా యాహసులో యుద్ధం చేయడానికి మనకు ఎదురుగా వచ్చారు. 33 మన దేవుడు యెహోవా అతణ్ణి మన వశం చేశాడు గనుక మనం అతణ్ణి, అతడి కొడుకులను అతడి సమస్త జనాన్ని హతం చేశాం. 34 ఆ కాలంలో అతడి పట్టణాలన్నిటినీ పట్టుకున్నాం. ప్రతి పట్టణాన్నీ, వాటిలో ఉన్న స్త్రీ పురుషులను, పిల్లలను నాశనం చేశాం – ఎవరూ తప్పించుకోకుండా చేశాం. 35 మనం పట్టుకున్న పట్టణాల సొమ్ముతోపాటు పశువులను దోపిడీగా తీసుకున్నాం. 36 అర్నోనులోయ అంచున ఉన్న అరోయేర్‌నుంచి, ఆ లోయలో ఉన్న పట్టణంనుంచి గిలాదు ప్రదేశం వరకు మనం జయించలేని పట్టణం అంటూ ఒకటి కూడా లేకపోయింది. మన దేవుడు యెహోవా వాటన్నిటినీ మన వశం చేశాడు. 37 అమ్మోనువారి దేశాన్ని మాత్రమే మీరు సమీపించలేదు; యబ్బోకు ఏటిలోయలో ఉన్న ఏ ప్రాంతాన్నీ, అక్కడి కొండసీమ పట్టణాలలో దేనినీ సమీపించలేదు. వెళ్ళకూడదని మన దేవుడు యెహోవా చెప్పిన మరి ఏ స్థలానికీ వెళ్ళలేదు.