ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం)
1
1 ✽ఇస్రాయేల్ ప్రజలందరితో మోషే చెప్పిన మాటలు ఇవి. యొర్దాను తూర్పు దిక్కున ఉన్న ఎడారిలో పారానుకూ తోపెల్, లాబాను, హజేరోతు, దీజాహాబు అనే స్థలాలకూ మధ్య, సూఫుకు ఎదురుగా ఉన్న అరాబా లోయలో ఈ మాటలు చెప్పాడు. 2 (హోరేబు పర్వతంనుంచి శేయీరు పర్వత మార్గంగా కాదేష్ బర్నేయకు పదకొండు రోజుల ప్రయాణం.)3 ✽యెహోవా ఇస్రాయేల్‌ప్రజలకోసం తనకు ఇచ్చిన ఆదేశాలన్నీ నలభయ్యో సంవత్సరం పదకొండో నెల మొదటి రోజున మోషే వారితో చెప్పాడు. 4 ✝మోషే హెష్బోనులో నివసించిన అమోరీవాళ్ళ రాజు సీహోనును ఓడించి, అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో ఓడించాక ఇది జరిగింది. 5 ✽యొర్దాను తూర్పు దిక్కున మోయాబుదేశంలో మోషే ఈ ఉపదేశాన్ని వివరించడానికి తలపెట్టాడు. అతడి వివరణ ఇలా ఉంది–
6 ✝మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈ విధంగా చెప్పాడు: “ఈ పర్వతం దగ్గర మీరు ఉన్న కాలం చాలు. 7 ✝మీరు తిరిగి ప్రయాణమై అమోరీవాళ్ళ కొండసీమకూ, దానిదగ్గర ఉన్న అరాబా లోయలోను కొండసీమలోను మైదానాల ప్రాంతంలోను దక్షిణ ప్రదేశంలోను సముద్ర తీరంలోను ఉన్న అన్ని స్థలాలకూ వెళ్ళండి. కనాను దేశానికీ లెబానోను పర్వత పంక్తికీ మహానది యూఫ్రటీసు వరకూ వెళ్ళండి. 8 ఇదిగో వినండి, నేను ఆ దేశాన్ని మీకప్పగించాను. మీరు వెళ్ళి, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ వారి తరువాత వారి సంతానానికీ ఇస్తానని యెహోవా వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.” 9 ✝అప్పుడు నేను మీతో అన్నాను, “ఒంటరిగా మీ గురించిన బాధ్యత భరించలేను. 10 ✝మీ దేవుడు యెహోవా మీ బలగాన్ని అధికం చేశాడు. ఇదిగో, ఈ రోజు మీరు సంఖ్యలో ఆకాశ నక్షత్రాలంతగా ఉన్నారు. 11 మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీ సంఖ్యను వెయ్యిరెట్లు ఎక్కువ చేస్తాడు గాక! ఆయన వాగ్దానం ఇచ్చినట్టే మిమ్ములను దీవిస్తాడు గాక! 12 అయితే నేనొకణ్ణే మీ బాధ్యత, భారం, మీ జగడాలు ఎలా భరించగలను? 13 ✝మీ గోత్రాలలో తెలివితేటలు గల ప్రసిద్ధమైన మనుషులను ఎన్నుకోండి. వారిని మీమీద నియమిస్తాను.”
14 మీరు “నీవు చెప్పినమాట ప్రకారం చెయ్యడం మంచిదే” అని నాకు జవాబిచ్చారు గదా.
15 అందుచేత మీ గోత్రాలలో తెలివి గల ప్రసిద్ధమైన నాయకులను నేను పిలిపించుకొన్నాను, మీ గోత్రాలకు అధిపతులుగా ఉండడానికి వెయ్యిమందికి ఒకణ్ణి, నూరుమందికి ఒకణ్ణి, యాభై మందికి ఒకణ్ణి, పదిమందికి ఒకణ్ణి మీమీద నియమించాను. 16 ✝అప్పుడు నేను ఈ మీ న్యాయాధిపతులకు ఇలా ఆజ్ఞాపించాను: “మీ ప్రజల తగాదాలను మీరు పరిష్కరించాలి. ఒక మనిషికీ అతడి పొరుగువాడికీ లేక అతడి దగ్గర ఉన్న విదేశీయుడికీ న్యాయంతో తీర్పు తీర్చాలి. 17 తీర్పు తీర్చేటప్పుడు పక్షపాతమేమీ లేకుండా ఘనుల సంగతి గానీ, అల్పుల సంగతి గానీ మీరు వినాలి. అసలు, తీర్పు తీర్చేది దేవుడే గనుక మీరు మనిషి ముఖాన్ని చూచి భయపడకూడదు. ఏదైనా తగాదా మీరు తీర్చలేనంత కఠినంగా ఉంటే అది నా దగ్గరికి తీసుకురావాలి. నేను దానిని విచారిస్తాను.” 18 అప్పుడు మీరు చేయవలసిన వాటన్నిటిని గురించి మీ కాజ్ఞాపించాను.
19 ✽ మనం హోరేబు నుంచి సాగిపోయాం. మీరు చూచిన ఆ భయంకరమైన మహా ఎడారి మీదుగా వెళ్ళాం. మన దేవుడుయెహోవా మనకాజ్ఞాపించినట్టు అమోరీవాళ్ళ కొండసీమ వైపుకు కాదేష్‌బర్నేయాకు చేరుకున్నాం. 20 అప్పుడు నేను మీతో, “మన దేవుడైన యెహోవా మనకిచ్చే అమోరీవాళ్ళ కొండసీమకు వచ్చాం. 21 ఇదిగో వినండి, మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు అప్పగించాడు. మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీతో చెప్పినట్టు మీరు వెళ్ళి ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోండి. భయపడకండి! అధైర్యపడకండి!” అన్నాను.
22 ✽అప్పుడు మీరంతా నా దగ్గరికి వచ్చి, “మనకంటే ముందుగా మనుషుల్ని పంపుదాం, వారు మన కోసం ఈ దేశాన్ని చూచి తిరిగి వచ్చి, మనం వెళ్ళాల్సిన త్రోవ గురించి, మనం చేరాల్సిన పట్టణాల గురించి చెప్తారు” అంటూ నాతో చెప్పారు.
23 ఈ మాట నాకు నచ్చింది గనుక నేను ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క మనిషిని, మొత్తం పన్నెండు మందిని ఎన్నుకున్నాను. 24 వారు అటువైపు బయలుదేరి ఆ కొండసీమకు వెళ్ళి, ఎష్కోల్ లోయకు చేరి దానిని చూశారు. 25 ఆ దేశంలో ఉన్న పండ్లు కొన్ని చేతపట్టుకొని మన దగ్గరికి తీసుకువచ్చి “మన దేవుడు యెహోవా మనకిచ్చే దేశం మంచిది” అని తెలిపారు.
26 అయితే మీరు ఆ దేశంలోకి వెళ్ళగోరలేదు. మీ దేవుడు యెహోవా మాటకు తిరగబడ్డారు. 27 మీ గుడారాలలో సణుక్కుంటూ “యెహోవా మనల్ని ద్వేషించినందుకే ఈజిప్ట్‌నుంచి మనల్ని రప్పించాడు. అమోరీవాళ్ళు మనల్ని నాశనం చేయాలని వాళ్ళ చేతికి మనల్ని అప్పగిస్తున్నాడు. 28 మనం వెళ్ళే ఆ స్థలం ఎలాంటిదో! మన సోదరులు చెప్పారు గదా – ‘అక్కడి జనం మనకంటే బలవంతులు, పొడువైనవాళ్ళు, ఆ పట్టణాలు చాలా పెద్దవి, వాటి గోడలు, కోటలు ఆకాశంవరకు ఉన్నాయి; అంతే కాకుండా అక్కడ అనాకు✽ సంతతివాళ్ళను చూశాం.’ వారలా చెప్పి మన గుండెలు నీరైపోయేలా చేశార” ని మీరు చెప్పారు.
29 అందుకు నేను – “హడలిపోకండి! వాళ్ళకు భయపడకండి! 30 మీ ముందర మీ దేవుడు యెహోవా వెళ్తున్నాడు. ఆయనే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీ కళ్ళెదుట ఈజిప్ట్‌లో, ఎడారిలో మీ కోసం చేసినట్టే ఆయన చేస్తాడు. 31 మీరు ఈ చోటికి చేరేవరకు మీరు వచ్చిన త్రోవ అంతట్లో తన కొడుకును తండ్రి ఎత్తుకొన్నట్లు మీ దేవుడు యెహోవా మిమ్ములను ఎత్తుకొని వచ్చాడు. మీరు ఇది చూశారు గదా” అని మీతో చెప్పాను.
32 ✽అయినా మీరు మీ దేవుడు యెహోవా మీద నమ్మకం ఉంచలేదు. 33 వెళ్ళవలసిన దారి మీకు చూపుతూ, మీ గుడారాలు వేయవలసిన స్థలాలను చూస్తూ, రాత్రి మంటలో పగలు మేఘంలో మీ ముందర సాగిపోయిన మీ దేవుణ్ణి మీరు నమ్మలేదు. 34 మీరు చెప్పిన మాటలు యెహోవాకు వినిపించాయి. ఆయన ఆగ్రహించి శపథం చేస్తూ ఇలా అన్నాడు: 35 “నేనిస్తానని మీ పూర్వీకులతో ప్రమాణం చేసిన ఈ మంచి దేశాన్ని ఈ దుష్ట తరంవారిలో 36 యెఫున్నె కొడుకైన కాలేబు తప్ప ఇంకెవడూ చూడడు. కాలేబు యెహోవాను పూర్తిగా అనుసరించాడు గనుక అతడా దేశాన్ని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన ఆ దేశాన్ని నేను అతడికీ, అతడి సంతానానికీ ఇస్తాను.”
37 అంతే కాకుండా, మీ మేలు కోరి యెహోవా నామీద కూడా కోపపడి, “నీవు కూడా ఆ దేశంలో ప్రవేశించవు. 38 అయితే నీ పరిచారకుడూ, నూను కొడుకూ అయిన యెహోషువ దానిలో ప్రవేశిస్తాడు. ఇస్రాయేల్‌ప్రజలు దాన్ని స్వాధీనం చేసుకొనేలా అతడు చేస్తాడు గనుక అతణ్ణి ధైర్యపరచు. 39 ఈ రోజు మంచి చెడ్డలు తెలియని మీ సంతానం కూడా దానిలో ప్రవేశిస్తారు. అక్కడ దోపిడీ అయిపోతామని మీరన్నారు గదా, ఆ చిన్నవారికే నేను ఆ దేశాన్ని ఇస్తాను. వారే దానిని స్వాధీనం చేసుకొంటారు. 40 మీ సంగతి అంటారా? మీరు ఎర్ర సముద్రంవైపుకు తిరిగి, ఎడారిలోకి ప్రయాణం చేయాలి.”
41 అందుకు మీరు “మేము యెహోవాకు విరోధంగా తప్పిదం చేశాం. మా దేవుడు యెహోవా మాకాజ్ఞాపించినట్టే మేము వెళ్ళి యుద్ధం చేస్తాం” అని నాకు జవాబిచ్చారు. మీరంతా ఆయుధాలు ధరించారు. ఆ కొండసీమకు వెళ్ళడం సులభమని భావించుకొన్నారు.
42 అయితే యెహోవా నాతో అన్నాడు, “వారితో ఇలా చెప్పు: వెళ్ళకండి, యుద్ధం చేయకండి. నేను మీ మధ్య ఉండను. మీరు వెళ్ళితే మీ శత్రువులు మిమ్ములను జయిస్తారు.”
43 ఆ మాటలు నేను మీతో చెప్పాను గానీ మీరు వినలేదు. యెహోవా మాటకు తిరుగబడి అనాలోచనగా గర్వించి ఆ కొండసీమకు వెళ్ళారు. 44 ఆ కొండసీమలో నివసించే అమోరీవాళ్ళు మిమ్మల్ని ఎదుర్కొని కందిరీగలలాగా మిమ్ములను శేయీరులో, హోర్మావరకూ తరుముతూ కొట్టారు. 45 మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధానంలో ఏడ్చినా యెహోవా మీ మొర ఆలకించలేదు, మీ మాట చెవిని బెట్టలేదు. 46 అందుచేత మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. మీరు అక్కడ ఉన్న రోజులెన్నో మీకు తెలుసు.