35
1 యెహోవా యెరికోకు ఎదురుగా, యొర్దాను దగ్గర ఉన్న మోయాబు మైదానాల ప్రాంతంలో మోషేతో ఇలా అన్నాడు: 2 “ఇస్రాయేల్ ప్రజలు తమకు వచ్చే వారసత్వంలో లేవీ గోత్రికులకు నివసించడానికి పట్టణాలు ఇవ్వాలని వారికి ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూరా ఉన్న పచ్చిక మైదానాలను కూడా లేవీ గోత్రికులకివ్వాలి. 3 నివసించడానికి ఆ పట్టణాలు వారికి ఉంటాయి. వాటి పచ్చిక మైదానాలు వారి పశువులకూ మందలకూ వారి జంతువులన్నిటికీ ఉంటాయి. 4 మీరు లేవీగోత్రికులకిచ్చే పట్టణాల గోడల దగ్గరనుంచి వెయ్యి మూరల దూరం, గోడల చుట్టూ ఆ పచ్చి మైదానాలు ఉండాలి. 5 మీరు ఆ పట్టణాల వెలుపల తూర్పు దిక్కున రెండు వేల మూరలనూ దక్షిణ దిక్కున రెండువేల మూరలనూ పడమటి దిక్కున రెండు వేల మూరలనూ ఉత్తరదిక్కున రెండు వేల మూరలనూ కొలత తీసుకోవాలి. అది వారి పట్టణాలకు మైదానాలుగా ఉంటుంది. పట్టణం మధ్యలో ఉంటుంది.
6 “మీరు లేవీ గోత్రికులకిచ్చే పట్టణాలలో ఆరు శరణు స్థలాలుగా ఉండాలి. మనిషిని చంపినవాడు పారిపోగల పట్టణాలుగా వాటిని నియమించాలి. ఆ పట్టణాలు గాక నలభై రెండు పట్టణాలను వారికివ్వాలి. 7 వాటి వాటి పచ్చిక మైదానాలతోపాటు మీరు లేవీ గోత్రికులకు ఇవ్వవలసిన పట్టణాలన్నీ నలభై ఎనిమిది. 8 మీరు ఇచ్చే పట్టణాలు ఇస్రాయేల్ వారసత్వంలో నుంచి ఇవ్వాలి. ప్రతి గోత్రంవారు వారి వారసత్వం ప్రకారం వారి పట్టణాలలో కొన్ని లేవీ గోత్రికులకు ఇవ్వాలి. మీరు ఎక్కువమంది మధ్యలో ఎక్కువ పట్టణాలను, తక్కువమంది మధ్యలో తక్కువ పట్టణాలను ఎన్నుకోవాలి.”
9 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 10 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – మీరు యొర్దాను దాటి కనాను వెళ్ళిన తరువాత 11 శరణు పట్టణాలుగా ఉండడానికి కొన్ని పట్టణాలను ఎన్నుకోవాలి. పొరపాటున మనిషిని చంపినవారు వాటిలోకి పారిపోవచ్చు. 12 అలా మనిషిని చంపినవాడు తీర్పుకు గురి కావడానికి సమాజం ముందు నిలబడేవరకు మరణశిక్ష పొందకూడదు, గనుక చంపబడ్డ మనిషి సమీప బంధువుడు పగతీర్చుకొనే అవకాశం ఏమీ లేకుండా ఆ పట్టణాలు శరణు స్థలాలుగా ఉండాలి. 13 మీరు శరణు స్థలాలుగా ఆరు పట్టణాలను నియమించాలి. 14 వాటిలో యొర్దాను ఇవతల మూడు పట్టణాలను నియమించాలి. అవి మీకు శరణు పట్టణాలుగా ఉంటాయి. 15 పొరపాటున మనిషిని చంపినవాడెవడైనా – అతడు ఇస్రాయేల్‌వాడు కానివ్వండి, విదేశీయుడు కానివ్వండి, మీ మధ్య నివసించేవాడు ఎవడైనా కానివ్వండి– అతడు పారిపోవడానికి ఆ ఆరు పట్టణాలు శరణు స్థలాలుగా ఉంటాయి.
16 “ఎవడైనా మనిషిని ఇనుప పనిముట్టుతో కొడితే ఆ మనిషి చనిపోతే, కొట్టినవాడు హంతకుడు. ఆ హంతకుడు మరణశిక్ష పొందితీరాలి. 17 ఎవడైనా మనిషిని రాయితో కొడితే, ఆ మనిషి చనిపోతే, కొట్టినవాడు హంతకుడు. ఆ హంతకుడు మరణశిక్ష పొందితీరాలి. 18 ఎవడైనా మనిషిని చేతికర్రతో కొడితే, ఆ మనిషి చనిపోతే, కొట్టినవాడు హంతకుడు. ఆ హంతకుడు మరణశిక్ష పొందితీరాలి. 19 హతమైనవాడి విషయం పగతీర్చుకోదలచే అతడి సమీప బంధువుడు ఆ హంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కనుగొంటే వాణ్ణి చంపాలి. 20 ఎవడైనా మనిషిని పగపట్టి పొడిచినా, పొంచివుండి అతడిమీద ఏదైనా వేసినా, 21 ద్వేషభావంతో చేతితో అతణ్ణి కొట్టినా, ఆ మనిషి చనిపోతే, అలా చేసినవాడు హంతకుడు. ఆ హంతకుడు మరణశిక్ష పొందితీరాలి. హతమైనవాడి విషయం పగతీర్చుకోదలచే అతడి సమీప బంధువుడు ఆ హంతకుణ్ణి కనుగొంటే వాణ్ణి చంపాలి.
22 “కాని, పగపట్టక హఠాత్తుగా మనిషిని పొడిచినా, పొంచివుండక అతడిమీద ఏదైనా వేసినా, 23 అతణ్ణి చూడక అతడిమీద రాయి పడవేసినా దెబ్బతిన్నవాడు చనిపోతే, అతణ్ణి చంపినవాడు అతనిమీద పగపట్టనివాడు, హాని చేయదలచనివాడు. 24 గనుక సమాజం ఈ న్యాయనిర్ణయాల ప్రకారం చంపినవాడికీ హత్య విషయం పగతీర్చుకోదలచే సమీప బంధువుడికీ మధ్య తీర్పు తీర్చాలి. 25 పగ తీర్చుకొనేవాడి చేతిలోనుంచి సమాజం మనిషిని చంపినవాణ్ణి విడిపించాలి. అతడు ఆశ్రయాన్ని కోరుతూ పారిపోయిన శరణు పట్టణానికి సమాజంవారు అతణ్ణి మళ్ళీ పంపించాలి. పవిత్ర తైలంతో అభిషేకం పొందిన ప్రముఖ యాజి చనిపోయేవరకు మనిషిని చంపిన ఆ వ్యక్తి ఆ శరణు పట్టణంలోనే ఉండిపోవాలి. 26 ఒక వేళ చంపినవాడు తాను పారిపోయిన శరణు పట్టణం సరిహద్దులను ఎప్పుడైనా దాటిపోతాడనుకోండి. 27 శరణు పట్టణం సరిహద్దుల వెలుపల ఉన్నప్పుడు పగతీర్చుకొనేవాడు అతణ్ణి కనుగొంటే, పగతీర్చుకొనేవాడు అతణ్ణి చంపినా హత్య దోషం ఉండదు. 28 ఎందుకంటే, ప్రముఖ యాజి చనిపోయేవరకు అతడు శరణు పట్టణంలోనే ఉండిపోవాలి. ప్రముఖయాజి చనిపోయిన తరువాత చంపినవాడు తన ఆస్తి ఉన్న స్వస్థలానికి తిరిగి వెళ్ళవచ్చు. 29 మీరు ఎక్కడ నివసించినా, మీ తరతరాలకూ, ఈ న్యాయనిర్ణయం అనుసరించాలి.
30 “ఎవడైనా మనిషిని హత్య చేస్తే సాక్షుల నోటి మాటమీద ఆ హంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒకే సాక్షి మాటమీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు. 31 చావతగ్గ హంతకుడి ప్రాణానికి బదులుగా విడుదల వెలను అంగీకరించకూడదు. వాడికి మరణశిక్ష విధించితీరాలి. 32 అంతేగాక, యాజి చనిపోయేముందు శరణు పట్టణానికి పారిపోయినవాడు తిరిగి వచ్చి స్వస్థలంలో నివసించేలా అతణ్ణి విడిపించే వెలను అంగీకరించకూడదు. 33 మీరు ఉండే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. రక్తపాతం దేశాన్ని అపవిత్రం చేస్తుంది. దేశంలో రక్తపాతం చేసినవాణ్ణి చంపడంవల్లే దేశానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతే గాని మరి దేనివల్లా కలగదు. 34 నేను ఆ దేశం మధ్య నివసిస్తాను. మీరు నివసించే ఆ దేశాన్ని అశుద్ధం చేయకూడదు. నేను యెహోవాను. ఇస్రాయేల్ ప్రజల మధ్య నివసించేవాడను.”