36
1 యోసేపు కొడుకుల వంశాలలో గిలాదు వంశీయులు ఉండేవారు (గిలాదు మాకీరు కొడుకు, మనష్షే మనుమడు). ఆ వంశీయుల పెద్దలు మోషే దగ్గరికి వచ్చి మోషేతో ఇస్రాయేల్ ప్రజల పూర్వీకుల వంశాల నాయకులతో మాట్లాడి ఇలా అన్నారు:
2 “చీట్లు వేసి ఆ దేశాన్ని ఇస్రాయేల్ ప్రజలకు వారసత్వంగా పంచిపెట్టాలని యెహోవా మా యజమానులైన మీకు ఆజ్ఞాపించాడు గదా. అంతేగాక, మా బంధువుడు సెలోపెహాదు వారసత్వాన్ని అతడి కూతుళ్ళకివ్వాలని మా యజమానులైన మీరు యెహోవాచేత ఆజ్ఞ పొందారు. 3 ఒకవేళ అతడి కూతుళ్ళు ఇస్రాయేల్ ప్రజలలో వేరే గోత్రాలవారిలో ఎవరినైనా పెళ్ళి చేసుకుంటారనుకోండి. అలాంటప్పుడు వారి వారసత్వం మా పూర్వీకుల వారసత్వంలో లేకుండా వారు చేరే గోత్రం వారసత్వంతో కలిసిపోతుంది. చీట్లప్రకారం మాకు దొరికిన వారసత్వంలో నుంచి విడిపోతుందన్నమాట. 4 ఇస్రాయేల్ ప్రజలకు మహోత్సవ సంవత్సరం వచ్చేటప్పుడు వారి వారసత్వం వారు చేరే గోత్ర వారసత్వంలో కలిసిపోతుంది. ఈ విధంగా మా పూర్వీకుల వారసత్వంలో వారి వారసత్వం లేకుండా పోతుంది.”
5 యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే ఇస్రాయేల్ ప్రజలను ఇలా ఆదేశించాడు: “యోసేపు కొడుకుల గోత్రికులు చెప్పినది న్యాయమే. 6 యెహోవా సెలోపెహాదు కూతుళ్ళను గురించి ఆజ్ఞాపించిన మాట ఇదే: వారు తమకు ఇష్టమైనవారిని పెళ్ళి చేసుకోవచ్చు గాని, వారి తండ్రి గోత్ర వంశంలోనే పెళ్ళి చేసుకోవాలి. 7 ఇస్రాయేల్ ప్రజల వారసత్వం ఒక గోత్రంలోనుంచి ఇంకో గోత్రంలోకి పోకూడదు. ఇస్రాయేల్ ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల గోత్ర వారసత్వాన్ని తమ వంశంలోనే ఉంచుకోవాలి. 8 ఇస్రాయేల్ ప్రజలు వారి వారి పూర్వీకుల వారసత్వం వారి వారి స్వాధీనంలో ఉండిపోయేలా ఇస్రాయేల్ ప్రజల గోత్రాలలో వారసత్వం ఉన్న ప్రతి అమ్మాయీ తన తండ్రి గోత్రంలోనే పెళ్ళి చేసుకోవాలి. 9 వారసత్వం ఒక గోత్రంనుంచి ఇంకో గోత్రంలోకి పోకూడదు. ఇస్రాయేల్ ప్రజల గోత్రాలవారు తమ తమ వారసత్వాన్ని తమ వంశంలోనే ఉంచుకోవాలి.” 10 యెహోవా మోషేకు ఆజ్ఞ ఇచ్చినట్టే సెలోపెహాదు కూతుళ్ళు చేశారు. 11 సెలోపెహాదు కూతుళ్ళైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ పినతండ్రి కొడుకులను వివాహమాడారు. 12 యోసేపు కొడుకు మనష్షే వంశీయులను వారు వివాహమాడడంవల్ల వారి వారసత్వం వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచింది. 13 యెరికోకు ఎదురుగా యొర్దాను దగ్గర ఉన్న మోయాబు మైదానాల ప్రాంతంలో యెహోవా మోషేచేత ఇస్రాయేల్ ప్రజలకు ఆదేశించిన ఆజ్ఞలూ న్యాయ నిర్ణయాలూ ఇవే.