34
1 యెహోవా మోషేతో అన్నాడు, 2 “నీవు ఇస్రాయేల్ ప్రజలను ఈ విధంగా ఆదేశించు – మీరు కనానులో ప్రవేశించిన తరువాత మీకు వారసత్వంగా దొరికే ఆ దేశం సరిహద్దులు ఇవి: 3 మీ దక్షిణప్రదేశం ఎదోం సరిహద్దు దగ్గర ఉన్న సీన్ ఎడారి మొదలుకొని ఉంటుంది. మీ దక్షిణ సరిహద్దు తూర్పు దిక్కుగా ఉప్పుసరస్సు చివరవరకు ఉంటుంది. 4 అక్కడనుంచి మీ సరిహద్దు దక్షిణ దిక్కుగా అక్రబ్బీం కనుమకు తిరిగి, సీన్ వరకు ఉంటుంది. కాదేష్‌బర్నేయాకు దక్షిణంగా వ్యాపించి హసర్ అద్దారుకు, అక్కడనుంచి అస్మోనువరకు పోతుంది. 5 అస్మోనునుంచి ఈజిప్ట్‌వాగువరకు ఉంటుంది. అక్కడనుంచి మహా సముద్రంవరకు వ్యాపిస్తుంది.6 “పడమటి సరిహద్దు మహా సముద్రం. అదే మీకు పడమటి సరిహద్దు.
7 “ఉత్తరంగా మీ సరిహద్దును మహా సముద్రంనుంచి హోర్ కొండవరకు, 8 హోర్ కొండనుంచి హమాతు కనుమవరకు ఏర్పరచుకోవాలి. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపిస్తుంది. 9 అక్కడనుంచి సరిహద్దు జిప్రోనువరకు ఉంటుంది. దాని చివర హసర్ ఎనాను దగ్గర ఉంటుంది. అదే మీకు ఉత్తరం సరిహద్దు. 10 “తూర్పు సరిహద్దును హసర్ ఎనానునుంచి షెపాం వరకు మీరు ఏర్పరచుకోవాలి. 11 షెపాంనుంచి సరిహద్దు అయీనుకు తూర్పుగా ఉన్న రిబ్లా వరకు ఉంటుంది. ఆ సరిహద్దు దిగి కిన్నెరెతు సరస్సు తూర్పు ఒడ్డున ఆనుకొని ఉంటుంది. 12 ఆ సరిహద్దు యొర్దానుకు పోతుంది. దాని చివర ఉప్పుసరస్సు. చుట్టూరా ఉన్న ఈ సరిహద్దులలో ఉన్న దేశం మీది అవుతుంది.”
13 మోషే ఇస్రాయేల్ ప్రజలను ఇలా ఆదేశించాడు: “చీట్లు వేసి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం ఇది. యెహోవా తొమ్మిది గోత్రాలకూ అర్ధ గోత్రానికీ ఈ దేశాన్ని ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. 14 రూబేను గోత్రికులూ గాదు గోత్రికులూ మనష్షే అర్ధగోత్రంవారూ వారి వారి పూర్వీకుల వంశాల ప్రకారం వారి వారి వారసత్వం పొందారు. 15 ఆ రెండు గోత్రాలవారూ అర్ధ గోత్రంవారూ యెరికోకు ఎదురుగా యొర్దానుకు పొద్దుపొడిచే దిక్కున ఆ తూర్పు ప్రదేశంలో వారి వారి వారసత్వం పొందారు.” 16 ✽యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 17 “ఆ దేశాన్ని మీకు వారసత్వంగా పంచి పెట్టవలసినవారు యాజి అయిన ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ. 18 అంతేగాక, ఆ దేశాన్ని మీకు వారసత్వంగా పంచిపెట్టడానికి ప్రతి గోత్రంలోనుంచీ నాయకుణ్ణి కూడా ఎన్నుకోవాలి. 19 ఆ నాయకుల పేర్లు: యూదాగోత్రంలో యెఫున్నెకొడుకు కాలేబు; 20 షిమ్యోను వంశీయుల గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేల్; 21 బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు; 22 దాను వంశీయుల గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు; 23 యోసేపు పుత్రులలో, మనష్షే వంశీయుల గోత్రంలో ఏఫోదు కొడుకు హన్నీయేల్ నాయకుడు; 24 ఎఫ్రాయిం వంశీయుల గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేల్ నాయకుడు; 25 జెబూలూను వంశీయుల గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు; 26 ఇశ్శాకారు వంశీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేల్ నాయకుడు; 27 అషేరు వంశీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు; 28 నఫ్తాలి వంశీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పదహేల్ నాయకుడు. 29 కనానుదేశంలో ఇస్రాయేల్ ప్రజలకు వారసత్వం పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే.