33
1 ఇస్రాయేల్ ప్రజలు, వారి వారి సేనలప్రకారం మోషే అహరోనుల నాయకత్వం క్రింద ఈజిప్ట్‌నుంచి బయలుదేరి చేసిన ప్రయాణాలు ఇవి: 2 ✽వారు బయలుదేరిన స్థలాల ప్రకారం, యెహోవా ఆజ్ఞాపించినట్టు, మోషే వారి ప్రయాణాలను వ్రాశాడు. వారు బయలుదేరిన స్థలాలప్రకారం వారి ప్రయాణాలు ఇవి: 3 ✝మొదటి నెల పదిహేనో రోజున వారు రామసేసు నుంచి ప్రయాణమయ్యారు. అది పస్కాపండుగ మరుసటి రోజు. తమ మధ్య యెహోవా సంహరించిన జ్యేష్ఠులందరినీ ఈజిప్ట్‌వాళ్ళు సమాధి చేస్తూ ఉంటే ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరారు. 4 ✝యెహోవా ఈజిప్ట్ దేవుళ్ళకు తీర్పు తీర్చాడు.5 ఇస్రాయేల్ ప్రజలు రామసేసు విడిచి వెళ్ళి సుక్కోతులో దిగారు. 6 సుక్కోతునుంచి వెళ్ళి ఏతాంలో దిగారు. ఏతాం ఎడారి అంచున ఉంది. 7 ఏతాం విడిచి వెళ్ళి బేల్‌సెఫోను ఎదుట ఉన్న పీహహీరోత్ వైపుకు వెనక్కు తిరిగి మిగ్దోల్ ఎదుట దిగారు. 8 ✝పీహహీరోత్ విడిచి వెళ్ళి సముద్రంగుండా దాటుతూ ఎడారిలోకి చేరి ఏతాం ఎడారిలో మూడు రోజులు ప్రయాణం చేసి మారాలో దిగారు. 9 ✝మారా విడిచి వెళ్ళి ఏలీంకు వచ్చారు. ఏలీంలో నీళ్ళ ఊటలూ డెబ్భై ఈతచెట్లూ ఉన్నాయి. వారక్కడ దిగారు. 10 ఏలీం విడిచి వెళ్ళి ఎర్రసముద్రం దగ్గర దిగారు. 11 ఎర్ర సముద్రం విడిచివెళ్ళి సీన్ ఎడారిలో దిగారు. 12 సీన్ ఎడారి విడిచివెళ్ళి దోపకాలో దిగారు. 13 దోపకా విడిచి వెళ్ళి ఆలూష్‌లో దిగారు. 14 ఆలూష్ విడిచి వెళ్ళి రెఫిదీంలో దిగారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్ళు లేకపోయాయి. 15 రెఫిదీం విడిచి వెళ్ళి సీనాయి ఎడారిలో దిగారు. 16 సీనాయి ఎడారి విడిచివెళ్ళి కిబ్రోత్‌హత్తావాలో దిగారు. 17 కిబ్రోత్‌హత్తావా విడిచివెళ్ళి హజేరోతులో దిగారు. 18 హజేరోతు విడిచివెళ్ళి రిత్మాలో దిగారు. 19 రిత్మా విడిచివెళ్ళి రిమ్మోన్‌పారెసులో దిగారు. 20 రిమ్మోన్‌పారెసు విడిచివెళ్ళి లిబ్నాలో దిగారు. 21 లిబ్నా విడిచివెళ్ళి రీసాలో దిగారు. 22 రీసా విడిచి వెళ్ళి కెహేలాతులో దిగారు. 23 కెహేలాతు విడిచి వెళ్ళి షాపెరుకొండ దగ్గర దిగారు. 24 షాపెరుకొండ విడిచి వెళ్ళి హరాదాలో దిగారు. 25 హరాదా విడిచి వెళ్ళి మకెలోతులో దిగారు. 26 మకెలోతు విడిచి వెళ్ళి తాహతులో దిగారు. 27 తాహతు విడిచి వెళ్ళి తారహులో దిగారు. 28 తారహు విడిచి వెళ్ళి మిత్కాలో దిగారు. 29 మిత్కా విడిచి వెళ్ళి హష్మోనాలో దిగారు. 30 హష్మోనా విడిచి వెళ్ళి మొసేరోతులో దిగారు. 31 మొసేరోతు విడిచి వెళ్ళి బెనేయాకానులో దిగారు. 32 బెనేయాకాను విడిచి వెళ్ళి హోర్‌హగ్గిదుగాదులో దిగారు. 33 హోర్‌హగ్గిదుగాదు విడిచి వెళ్ళి యొత్బాతాలో దిగారు. 34 యొత్బాతా విడిచి వెళ్ళి ఎబ్రోనాలో దిగారు. 35 ఎబ్రోనా విడిచి వెళ్ళి ఎసోన్‌గెబెరులో దిగారు. 36 ఎసోన్‌గెబెరు విడిచి వెళ్ళి సీన్ ఎడారిలో దిగారు. అది కాదేషు. 37 కాదేషు విడిచి వెళ్ళి ఎదోందేశం సరిహద్దు దగ్గర ఉన్న హోర్ పర్వతం దగ్గర దిగారు.
38 ✝యెహోవా ఆజ్ఞప్రకారం యాజి అయిన అహరోను హోర్ పర్వతమెక్కి అక్కడ చనిపోయాడు. ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ విడిచి వచ్చిన నలభైయో సంవత్సరం అయిదో నెల మొదటి రోజున అది జరిగింది. 39 హోర్ పర్వతం మీద అహరోను చనిపోయినప్పుడు అతడి వయసు నూట ఇరవై మూడేళ్ళు.
40 ✝కనానుదేశ దక్షిణ ప్రాంతంలో నివసించిన ఆరాదు పట్టణం రాజు ఇస్రాయేల్ ప్రజలు వస్తున్నారని విన్నాడు. అతడు కనానుజాతివాడు.
41 తరువాత ఇస్రాయేల్ ప్రజలు హోర్ పర్వతం విడిచివెళ్ళి సల్మానాలో దిగారు. 42 సల్మానా విడిచి వెళ్ళి పూనొనులో దిగారు. 43 పూనొను విడిచి వెళ్ళి ఓబోతులో దిగారు. 44 ఓబోతు విడిచి వెళ్ళి ఈయ్యెం అబారీంలో దిగారు. అది మోయాబు సరిహద్దులో ఉంది. 45 ఈయ్యెం అబారీం విడిచివెళ్ళి దీబోన్‌గాదులో దిగారు. 46 దీబోన్‌గాదు విడిచి వెళ్ళి అల్మోన్ దిబ్లతాయింలో దిగారు. 47 అల్మోన్ దిబ్లతాయిం విడిచి వెళ్ళి నెబో పర్వతం ఎదుటి అబారీం పర్వత పంక్తిలో దిగారు. 48 అబారీం పర్వత పంక్తి విడిచి వెళ్ళి యెరికోకు ఎదురుగా యొర్దాను ఒడ్డున మోయాబు మైదానాల ప్రాంతంలో దిగారు. 49 వారు మోయాబు మైదానాల ప్రాంతంలో బేత్‌యేషిమోతు మొదలుకొని ఆబేల్‌షిత్తీం వరకు యొర్దానుదగ్గర దిగారు.
50 యెరికోకు ఎదురుగా యొర్దానుదగ్గర మోయాబు మైదానాల ప్రాంతంలో యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 51 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – మీరు యొర్దాను దాటి కనానులో చేరిన తరువాత 52 ✝ఆ దేశవాసులందరినీ మీ ఎదుట నుంచి వెళ్ళగొట్టాలి. వాళ్ళ చెక్కిన రాళ్ళనూ పోత విగ్రహాలనూ అన్నిటినీ నాశనం చేయాలి. వాళ్ళ ఎత్తయిన పూజాస్థలాలను పాడు చేయాలి. 53 ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివసించాలి. ఆ దేశం మీ స్వాధీనంలో ఉండాలని దానిని నేను మీకిచ్చాను. 54 మీరు మీ వంశాలప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువమందికి ఎక్కువ వారసత్వం, తక్కువమందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీట్ల ప్రకారం ఎవరి స్థలం వారికి దొరుకుతుంది. మీ పూర్వీకుల గోత్రాల ప్రకారం మీకు వారసత్వం రావాలి. 55 ✝ఒక వేళ మీరు మీ ఎదుటనుంచి ఆ దేశవాసులను వెళ్ళగొట్టకుండా ఉంటే, మీరు వాళ్ళలో ఉండనిచ్చేవాళ్ళు మీ కళ్ళలో ముళ్ళుగా మీ ప్రక్కలలో ములుకోలగా ఉంటారు. మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్ములను కష్ట పెడతారు. 56 ✝అంతేగాక నేను వాళ్ళకు ఏం చేయాలనుకొన్నానో అది మీకూ చేస్తాను.”