32
1 ✽రూబేను గోత్రికులకూ గాదు గోత్రికులకూ చాలా పశువులు ఉన్నాయి. పశువులకోసం యాజెరు, గిలాదు ప్రదేశాలు మంచివని తెలుసుకొని, 2 వారు వచ్చి మోషేతో, ఎలియాజరుయాజితో, సమాజనాయకులతో ఇలా అన్నారు:3 “ఇస్రాయేల్‌ప్రజల సమాజం ఎదుట యెహోవా జయించిన ఈ ప్రాంతాలు – ఈ అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాం, నెబో, బెయోను – 4 ✝ఇస్రాయేల్ ప్రజల ఎదుట యెహోవా మొత్తిన ప్రాంతాలు పశువులకోసం చాలా మంచి ప్రాంతాలు. మీ సేవకులైన మాకు పశువులున్నాయి గదా. 5 ✽మీరు మమ్మల్ని దయ చూస్తుంటే, మమ్మల్ని యొర్దాను అవతలికి దాటించకుండా, మీ సేవకులైన మాకు ఈ దేశాన్ని వారసత్వంగా ఇవ్వండి.”
6 ✽మోషే గాదుగోత్రికులకూ రూబేనుగోత్రికులకూ ఇలా జవాబిచ్చాడు: “మీ స్వజనులు యుద్ధానికి వెళ్ళిపోతే మీరు ఇక్కడ కూర్చోవచ్చా? 7 యెహోవా ఇస్రాయేల్ ప్రజలకిచ్చిన దేశానికి వారు వెళ్ళకుండేలా మీరు వారిని అధైర్యపరుస్తారెందుకు? 8 ఆ దేశాన్ని చూడడానికి కాదేష్‌బర్నేయనుంచి నేను మీ తండ్రులను పంపించిన కాలంలో వారు ఇలా చేశారు గదా! 9 వారు ఎష్కోల్ లోయలోకి వెళ్ళి ఆ దేశాన్ని చూచి యెహోవా ఇస్రాయేల్ ప్రజలకిచ్చిన దేశానికి వారిని వెళ్ళకుండేలా అధైర్యపరచారు. 10 ఆ రోజున యెహోవా కోపాగ్ని రగులుకొంది. ఆయన ఇలా శపథం చేశాడు: 11 ఇరవై ఏండ్లు మొదలుకొని పై వయసు ఉండి ఈజిప్ట్‌దేశంనుంచి వచ్చినవారిలో కెనెజీవాడైన యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ మాత్రమే యెహోవాను పూర్తిగా అనుసరించారు. 12 మిగతావారు నన్ను పూర్తిగా అనుసరించలేదు. అందుచేత ఇస్తానని నేను అబ్రాహాముకూ ఇస్సాకుకూ యాకోబుకూ వాగ్దానం చేసిన దేశాన్ని వారిలో ఎవ్వరూ చూడరు. కాలేబు, యెహోషువ మాత్రమే చూస్తారు. 13 యెహోవా కోపాగ్ని ఇస్రాయేల్ ప్రజలమీద రగులుకొంది. యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించిన ఆ తరంవారంతా నాశనమయ్యేవరకూ ఎడారిలో నలభై ఏండ్లు వారు తిరుగాడేలా ఆయన చేశాడు. 14 ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల పట్ల యెహోవాకు కోపం మరి ఎక్కువగా రేపడానికి మీరు మీ తండ్రుల స్థానంలో లేచారు. మీరు పాపిష్ఠి సంతానం. 15 మీరు యెహోవాను అనుసరించకుండా వెనుకకు తిరిగితే ఆయన ఈ ప్రజలను ఈ ఎడారిలో ఇంకా ఉండిపోయేలా చేస్తాడు. ఈ విధంగా మీరు మీ ప్రజలందరి నాశనానికీ కారకులవుతారు.”
16 ✽అప్పుడు వారు దగ్గరికి వచ్చి అతడితో ఇలా అన్నారు: “మేము ఇక్కడ మా పశువులకోసం దొడ్లనూ, మా పిల్లలకోసం గ్రామాలనూ కట్టుకొంటాం. 17 మేమైతే యుద్ధానికి సంసిద్ధులమై ఇస్రాయేల్ ప్రజలను వారివారి స్థలాలకు చేర్చేవరకూ వారి ముందట సాగిపోతాం. అయితే మా పిల్లలు ఈ దేశవాసుల భయంచేత ప్రాకారాలు గల ఊళ్ళలో ఉండిపోవాలి. 18 ఇస్రాయేల్ ప్రజల్లో ప్రతి ఒక్కరూ తమ వారసత్వం స్వాధీనం చేసుకొనేవరకూ మా ఇండ్లకు తిరిగి రాము. 19 యొర్దానుకు ఇవతల ఈ తూర్పు ప్రదేశంలో మాకు వారసత్వం దొరికిన కారణంగా యొర్దాను అవతల ప్రదేశాలలో వారితో వారసత్వం పొందము.”
20 మోషే వారితో అన్నాడు, “మీరు అలా చేస్తే, యెహోవా సన్నిధానంలో యుద్ధానికి సిద్ధపడితే, 21 యెహోవా తన ముందునుంచి తన శత్రువులను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని జయించేవరకూ ఆయన సన్నిధానంలో ఆయుధాలు ధరించిన మీరంతా యొర్దాను అవతలికి వెళ్ళిపోతే, 22 తరువాత మీరు ఇక్కడికి రావచ్చు. అప్పుడు మీరు యెహోవా దృష్టిలో ఇస్రాయేల్ ప్రజల దృష్టిలో నిర్దోషులుగా ఉంటారు, ఈ ప్రదేశం యెహోవా సన్నిధానంలో మీకు వారసత్వం అవుతుంది. 23 ✽కాని, మీరు ఆ విధంగా చేయకపోతే యెహోవాకు విరోధంగా పాపం చేసినవారవుతారు. అలాంటప్పుడు మీ పాపం మిమ్ములను పట్టుకొంటుందని తెలుసుకోండి. 24 ఇప్పుడు మీ చిన్నవారికోసం గ్రామాలను, మీ మందలకోసం దొడ్లను కట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారమే చేయండి.”
25 గాదు గోత్రికులూ రూబేను గోత్రికులూ మోషేకు ఇలా జవాబిచ్చారు: “మా యజమానులైన మీరు ఆజ్ఞాపించినట్టే మీ సేవకులైన మేము చేస్తాం. 26 మా చిన్నవారు, మా భార్యలు, మా మందలు, మా పశువులంతా గిలాదు ఊళ్ళలో ఉండాలి. 27 అయితే మీ సేవకులైన మామధ్య ఆయుధాలు ధరించినవారంతా మా యజమానులైన మీరు చెప్పినట్టే యెహోవా సన్నిధానంలో యుద్ధం చేయడానికి యొర్దాను అవతలికి వస్తారు.” 28 కాబట్టి వారిని గురించి యాజి అయిన ఎలియాజరుకూ నూను కొడుకు యెహోషువకూ ఇస్రాయేల్ ప్రజల గోత్రాల పూర్వీకుల కుటుంబాల నాయకులకూ మోషే ఇలా ఆజ్ఞాపించాడు: 29 “గాదు రూబేను గోత్రికులలో యెహోవా సన్నిధానంలో యుద్ధానికి ఆయుధాలు ధరించివారంతా మీతో యొర్దాను అవతలికి వెళ్ళిపోతే, ఆ దేశం మీ వశం అయ్యాక మీరు ఈ గిలాదు ప్రదేశాన్ని వారికి వారసత్వంగా ఇవ్వాలి. 30 కానీ వారు మీతోపాటు ఆయుధాలతో అవతలికి వెళ్ళకపోతే, వారు కనానుదేశంలోనే మీ మధ్య వారసత్వం పొందాలి.”
31 అందుకు గాదు రూబేను గోత్రికులు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “మీ దాసులైన మాతో యెహోవా చెప్పినట్టే చేస్తాం. 32 మేము యెహోవా సన్నిధానంలో ఆయుధాలు ధరించి నది దాటి కనానుదేశంలోకి వస్తాం. అప్పుడు యొర్దాను ఇవతల మేము వారసత్వం పొందుతాం.”
33 ✽అప్పుడు మోషే గాదువారికీ రూబేను వారికీ యోసేపు కొడుకు మనష్షే అర్ధ గోత్రంవారికీ అమోరీవాళ్ళ రాజైన సీహోను రాజ్యాన్నీ బాషాను రాజైన ఓగు రాజ్యాన్నీ ఇచ్చాడు. ఆ ప్రాంతాలనూ వాటి పట్టణాలనూ పట్టణాల చుట్టూ ఉన్న భూములనూ వారికిచ్చాడు. 34-35 గాదు గోత్రికులు దీబోను, అతారోతు, అరోయేర్, 36 బేత్‌నిమ్రా, బేత్‌హారాను అనే ప్రాకారాలు ఉన్న పట్టణాలను కట్టారు. మందల దొడ్లను కూడా వేసుకొన్నారు. 37 రూబేను గోత్రికులు హెష్బోను, ఏలాలె, కిర్యతాయిం, 38 నెబో బేల్‌మెయోను (వాటి పేర్లు మార్చబడ్డాయి), సిబ్మా అనే పట్టణాలను కట్టారు. తాము కట్టిన ఆ పట్టణాలకు వేరే పేర్లు పెట్టారు. 39 ✝మనష్షే కొడుకు మాకీరు వంశీయులు గిలాదు ప్రదేశానికి వెళ్ళి దానిని జయించి దానిలో ఉన్న అమోరీవాళ్ళను తరిమారు. 40 గనుక మనష్షే కొడుకు మాకీరు వంశీయులకు మోషే గిలాదు ఇచ్చాడు. ఆ వంశంవాళ్ళు అక్కడ కాపురమేర్పరచుకొన్నారు. 41 మనష్షే వంశీయుడు యాయీరు వెళ్ళి అక్కడి గ్రామాలను పట్టుకొని వాటికి హవోత్‌యాయీరు✽ అనే పేరు పెట్టాడు. 42 నోబహు వెళ్ళి కెనాతునూ దాని గ్రామాలనూ పట్టుకొని దానికి నోబహు అనే తన పేరు పెట్టాడు.