31
1 యెహోవా మోషేతో “మిద్యానువాళ్ళు ఇస్రాయేల్‌ ప్రజలకు చేసినదానికి ప్రతీకారం చేసితీరాలి. 2 ఆ తరువాత నీవు పూర్వీకుల దగ్గరికి చేరుతావు” అన్నాడు.
3 అందుచేత మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “మిద్యానువాళ్ళ పై పడడానికి మీలో కొందరు ఆయుధాలు ధరించాలి. యెహోవా నిర్ణయించిన ప్రతీకారం వారు మిద్యానువాళ్ళకు చేయాలి. 4 ఇస్రాయేల్‌ప్రజల ప్రతి గోత్రంలోనుంచీ వెయ్యిమందిని మీరు ఆ యుద్ధానికి పంపించాలి.”
5 ఇస్రాయేల్ ప్రజల సేనలలో ప్రతి గోత్రంలోనుంచీ వెయ్యిమంది ప్రకారం, మొత్తం పన్నెండు వేలమంది యుద్ధసన్నద్ధులను వారు ఎన్నుకొన్నారు. 6 ప్రతి గోత్రంనుంచీ ఎన్నికైన ఆ మనుషులను మోషే యుద్ధానికీ పంపించాడు. వారితో కూడా యుద్ధానికి వెళ్ళడానికి యాజి అయిన ఎలియాజరు కొడుకు ఫీనెహాసును పంపించాడు. ఫీనెహాసు పవిత్ర పాత్రలనూ, ఊదడానికి బూరలనూ తీసుకుపోయాడు. 7 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు వారు మిద్యానువాళ్ళతో యుద్ధం చేశారు, మగవారందరినీ చంపారు. 8 ఆ హతమైనవాళ్ళతోపాటు మిద్యాను రాజులను కూడా చంపారు. వారు చంపిన అయిదుగురు మిద్యానురాజుల పేర్లు ఎవీ, రేకెం, సూర్, హూర్, రేబ. బెయోరు కొడుకు బిలాంను కూడా ఖడ్గంతో చంపారు. 9 ఇస్రాయేల్‌ప్రజలు మిద్యాను స్త్రీలనూ చిన్నవాళ్ళనూ పట్టారు. వాళ్ళ పశువులనూ గొర్రె మేకలన్నిటినీ వాళ్ళ యావదాస్తినీ దోచుకొన్నారు. 10 మిద్యానువాళ్ళు నివసించిన పట్టణాలన్నీ వాళ్ళ శిబిరాలన్నీ తగలబెట్టారు. 11 చెరపట్టుకొన్న వాళ్ళందరినీ దోచుకొన్న జంతువులన్నిటినీ తీసుకువెళ్ళారు. 12 ఆ బందీలనూ పశుసంపదనూ కొల్లసొమ్మునూ శిబిరంలో ఉన్న మోషే దగ్గరికీ ఎలియాజరుయాజి దగ్గరికీ ఇస్రాయేల్ ప్రజల సమాజం దగ్గరికీ తెచ్చారు. శిబిరం యెరికో ఎదుట, యొర్దాను దగ్గర, మోయాబు మైదానాల ప్రాంతంలో ఉంది.
13 మోషే, ఎలియాజరుయాజి, సమాజ నాయకులందరూ వారిని కలుసుకోవడానికి శిబిరం వెలుపలికి వెళ్ళారు. 14 అయితే మోషే దండయాత్రనుంచి వచ్చిన సేనానాయకులమీద కోపపడ్డాడు. (వారు వెయ్యిమందికి లేక వందమందికి అధిపతులు.) 15 అతడు వారితో ఇలా అన్నాడు:
“మీరు ఆడవారిని బ్రతకనిచ్చారేం! 16 చూడండి, బిలాం ఇచ్చిన సలహా మూలంగా పెయోర్ విషయంలో ఇస్రాయేల్ ప్రజలు యెహోవామీద తిరుగబడేలా చేసినవారు వీరే గదా! వీరివల్లేగా యెహోవా సమాజంలోకి విపత్తు వచ్చింది! 17 గనుక చిన్నవాళ్ళలో ప్రతి మగవాణ్ణీ, పురుషుడి స్పర్శ ఎరిగిన ప్రతి స్త్రీనీ మీరు చంపాలి. 18 పురుషుడితో పోని ఆడ పిల్లలందరినీ మీ కోసం బతకనివ్వాలి. 19 మనిషిని చంపినవారూ, హతమైనవాళ్ళ శవాలను తాకినవారూ మీమధ్య ఉన్నారు గదా! అలాంటి మీరు ఏడు రోజులు శిబిరం బయట ఉండాలి. మూడో రోజున, ఏడోరోజున మీరు మిమ్మల్నీ మీరు చెరపట్టినవాళ్ళనూ పవిత్రం చేసుకోవాలి. 20 అంతేగాక బట్టలన్నీ చర్మంతో చేసిన వస్తువులన్నీ మేక వెండ్రుకలతో చేసిన వస్తువులన్నీ కొయ్య వస్తువులన్నీ కూడా పవిత్రం చేయాలి.”
21 యుద్ధానికి వెళ్ళిన సైనికులతో ఎలియాజరుయాజి ఇలా అన్నాడు: “యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన చట్టం ఇది: 22 మంటలచేత చెడని ప్రతి వస్తువూ – అది బంగారం కానివ్వండి, వెండి, కంచు, ఇనుము, తగరం, సీసం కానివ్వండి – 23 శుద్ధం అయ్యేలా మీరు దానిని మంటల్లో వేసి తీయాలి. అశుద్ధతను తొలగించే నీళ్ళతో కూడా ఆ వస్తువును శుద్ధం చేయాలి. అయితే మంటల చేత చెడిపోయే ప్రతి వస్తువునూ నీళ్ళలో వేసి తీయాలి. 24 ఏడో రోజున మీరు బట్టలు ఉతుక్కొని శుద్ధం అవుతారు. ఆ తరువాత శిబిరంలోకి రావచ్చు”.
25 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 26 “నీవూ ఎలియాజరుయాజీ సమాజంలో పూర్వీకుల వంశాల నాయకులూ ఈ విధంగా చేయాలి – ప్రజలు బందీలుగా పట్టినవాళ్ళనూ దోచుకొన్న జంతువులనూ అంతా లెక్కించాలి. 27 రెండు భాగాలుగా చేయాలి. యుద్ధానికి సైన్యంలో వెళ్ళినవారికి సగం, సమాజమంతటికీ సగం పంచిపెట్టాలి. 28 అప్పుడు యుద్ధానికి వెళ్ళిన సైనికులమీద యెహోవాకు పన్ను కట్టాలి. ఆ వ్యక్తులలో, పశువులలో, గాడిదలలో, గొర్రెమేకలలో అయిదు వందలకు ఒకటి ప్రకారం ఆ సైనికుల సగంలోనుంచి తీసుకొని 29 యెహోవాకు అర్పణగా ఎలియాజరుయాజికి ఇవ్వాలి. 30 ఇస్రాయేల్ ప్రజల సగంనుంచి వ్యక్తులలో గానీ అన్ని రకాల జంతువులలో గానీ – పశువులు కానివ్వండి, గాడిదలు, గొర్రెమేకలు కానివ్వండి – యాభైకి ఒకటి ప్రకారం తీసుకొని యెహోవా నివాసం బాధ్యత వహించిన లేవీ గోత్రికులకివ్వాలి.”
31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే మోషే, ఎలియాజరుయాజి చేశారు.
32 సైనికులు తమ కోసం ఉంచుకొన్న దోపిడీ సొమ్ము గాక వారు కొల్లపెట్టినది ఆరు లక్షల డెబ్భై అయిదు వేల గొర్రెమేకలూ 33 డెబ్భై రెండు వేల పశువులూ 34 అరవై యొక్క వేల గాడిదలూ 35 పురుషుడి స్పర్శ ఎరగని ముప్ఫయి రెండు వేలమంది ఆడవారూ. 36 ఆ మొత్తంలో సగం యుద్ధానికి వెళ్ళినవారికి చెందినది. వారికి చెందిన గొర్రెమేకల లెక్క మూడు లక్షల ముప్ఫయి ఏడు వేల అయిదు వందలు. 37 వాటిలో యెహోవాకు చెల్లిన సుంకం ఆరు వందల డెబ్భై అయిదు. 38 పశువులు ముప్ఫయి ఆరు వేలు. వాటిలో యెహోవా సుంకం డెబ్భై రెండు. 39 గాడిదలు ముప్ఫయి వేల అయిదు వందలు. వాటిలో యెహోవా సుంకం అరవై ఒకటి. 40 జనం పదహారు వేలమంది. వాళ్ళలో యెహోవా సుంకం ముప్ఫయి ఇద్దరు. 41 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు మోషే ఆ సుంకం యెహోవాకు అర్పణగా యాజి అయిన ఎలియాజరుకు ఇచ్చాడు.
42 సైనికులదగ్గర సగం తీసుకొని మోషే ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. 43 సమాజానికి చెందిన ఆ సగం మూడు లక్షల ముప్ఫయి ఏడు వేల అయిదు వందల గొర్రెమేకలూ 44 ముప్ఫయి ఆరు వేల పశువులూ 45 ముప్ఫై వేల అయిదు వందల గాడిదలూ 46 పదహారు వేలమంది వ్యక్తులూ. 47 ఇస్రాయేల్ ప్రజలకు వచ్చిన సగంనుంచి జనంలో గానీ జంతువులలో గానీ – యాభైకి ఒకటి ప్రకారం తీసుకొని మోషే యెహోవా నివాసం బాధ్యత వహించిన లేవీవారికి ఇచ్చాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు.
48 అప్పుడు ఆ సేనానాయకులు (వేయిమందికి లేక వందమందికి అధిపతులు) మోషే దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: 49 “మీ సేవకులైన మేము మా చేతికింద ఉన్న సైనికుల మొత్తం లెక్కించాం. మాలో ఒక్కడైనా మొత్తానికి తక్కువ కాలేదు. 50 గనుక మేము యెహోవాకు అర్పణ తెచ్చాం. మాకోసం యెహోవా సన్నిధానంలో ప్రాయశ్చిత్తం కలిగేలా, మాలో ప్రతి ఒక్కరికీ దొరికిన బంగారు నగలూ గొలుసులూ గాజులూ ఉంగరాలూ పోగులూ పతకాలూ అర్పణగా యెహోవా దగ్గరికి తెచ్చాం.”
51 బంగారంతో చేసిన ఆ ఆభరణాలను మోషే, ఎలియాజరుయాజి వారిదగ్గర తీసుకొన్నారు. 52 వేయిమందికి లేక వందమందికి అధిపతులు యెహోవాకు అర్పణగా తెచ్చిన బంగారమంతా పదహారు వేల ఏడు వందల యాభై తులాలు. 53 ఆ సైనికులలో ప్రతి ఒక్కడూ తనమట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకొనేవాడు. 54 వేయిమందికి లేక వందమందికి అధిపతుల దగ్గర మోషే, ఎలియాజరుయాజి ఆ బంగారం తీసుకొని యెహోవా సన్నిధానంలో ఇస్రాయేల్‌ప్రజలకు స్మృతిచిహ్నంగా సన్నిధిగుడారంలో ఉంచారు.