30
1 మోషే ఇస్రాయేల్ ప్రజల గోత్రాల నాయకులతో ఇలా అన్నాడు:
“ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. 2 ఎవరైనా యెహోవాకు మొక్కుబడి చేసుకొంటే, తాను బద్ధుడు కావడానికి ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి మాట తప్పకూడదు. తన నోటి మాట ప్రకారమే చెయ్యాలి. 3 ఒక యువతి తన తండ్రి ఇంట ఉన్నప్పుడు యెహోవాకు మొక్కుబడి చేసుకొని బద్ధురాలైతే, 4 ఆమె తండ్రి ఆమె మొక్కుబడి గురించీ తాను బద్ధురాలుగా చేసుకొన్నసంగతి గురించీ విని ఊరుకొంటే, ఆమె మొక్కుబళ్ళంతా నిలుస్తాయి. ఆమె బద్ధురాలు కావడానికి తాను పెట్టుకొన్న ఒట్టు నిలుస్తుంది. 5 అయితే ఆమె తండ్రి దాని గురించి విన్నరోజున వద్దంటే, ఆమె మొక్కుబళ్ళన్నిటిలో ఏదీ నిలువదు. బద్ధురాలు కావడానికి ఆమె చేసుకొన్న శపథాలలో ఏదీ నిలవదు. ఆమె తండ్రి దానికి ఒప్పుకోలేదు, గనుక యెహోవా ఆమెను క్షమిస్తాడు.
6 “అయితే ఆమె మొక్కుబడి చేసుకొని సావధానం లేకుండా తనమీద ఒట్టుపెట్టుకొన్న తరువాత ఆమె పెళ్ళి చేసుకొంటుందనుకోండి. 7 ఆమె భర్త దాని గురించి విని విన్నరోజున ఊరుకుంటే ఆమె చేసుకొన్న మొక్కుబడులన్నీ, ఆమె బద్ధురాలు కావడానికి చేసుకొన్న శపథాలన్నీ నిలుస్తాయి. 8 ఆమె భర్త దానిగురించి విన్న రోజున వద్దంటే ఆమె చేసుకొన్న మొక్కుబడినీ సావధానం లేకుండా తనమీద పెట్టుకొన్న ఒట్టునూ అతడు రద్దుచేసినట్టే. యెహోవా ఆమెను క్షమిస్తాడు.
9 “విధవరాలు గానీ విడిచిపెట్టబడ్డ స్త్రీ గానీ తనమీద తాను పెట్టుకొన్న ప్రతి ఒట్టూ మొక్కుబడి నిలుస్తాయి. 10 “ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుబడి చేసుకొంటే, ఒట్టు పెట్టుకొని తనను బద్ధురాలుగా చేసుకొంటే, 11 ఆమె భర్త విని వద్దనకుండా ఊరుకొంటే ఆమె మొక్కుబళ్ళన్నీ నిలుస్తాయి. తన మీద పెట్టుకొన్న ప్రతి ఒట్టూ నిలుస్తుంది. 12 ఆమె భర్త విన్నరోజు వాటిని పూర్తిగా రద్దు చేసుకొంటే ఆమె మాట – అది మొక్కుబడి గానీ తనమీద పెట్టుకొన్న ఒట్టు గానీ – ఏదీ నిలవదు. ఆమె భర్త వాటిని రద్దుచేశాడు. యెహోవా ఆమెను క్షమిస్తాడు. 13 స్త్రీ చేసుకొన్న ప్రతి మొక్కుబడినీ ఉపవాసం ఉంటానన్న ప్రతి ఒట్టునూ అలాంటి ప్రతి ప్రమాణాన్నీ ఆమె భర్త నిలవనివ్వవచ్చు, రద్దు చేయవచ్చు. 14 ఆమె భర్త ప్రతి రోజూ మౌనంగా ఉంటే అతడు ఆమె మొక్కుబళ్ళన్నీ ఆమె మీద ఉన్న ఒట్టులన్నీ నిలిచేలా చేస్తున్నాడన్నమాట. వాటిని గురించి విన్నరోజు ఊరుకోవడంవల్ల వాటిని నిలవనిస్తున్నాడు. 15 గాని అతడు విన్నరోజుగాక, తరువాత వాటిని ఖచ్చితంగా రద్దుచేస్తే అతడే ఆమె అపరాధం భరించాలి.”
16 ఇవి భార్యాభర్తలను గురించీ బాల్యంలో తన తండ్రి ఇంట ఉన్న కూతురును గురించీ ఆమె తండ్రిని గురించీ యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన చట్టాలు.