29
1 ✽“ఏడో నెల మొదటి రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. అప్పుడు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు. అది మీకు బూరలు✽ ఊదే రోజు, 2 యెహోవాకు పరిమళ హోమంగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి. 3 నూనెతో కలిపిన గోధుమపిండి అనే వాటి నైవేద్యాలను కూడా అర్పించాలి. కోడెలతోపాటు మూడు కిలోగ్రాముల పిండి, పొట్టేలుతోపాటు రెండు కిలోగ్రాములపిండి, 4 ఏడు గొర్రెపిల్లల్లో ప్రతిదానితోపాటు ఒక కిలోగ్రాం పిండి అర్పించాలి. 5 అంతేకాక, మీ పాపాలను కప్పివేయడానికి పాపాలకోసమైన బలిగా మేకపోతును కూడా అర్పించాలి. 6 అది యెహోవాకు పరిమళ హోమబలి. వాటి వాటి నిర్ణయాలప్రకారం, నెలలో మొదటి రోజున అర్పించే హోమబలి, దాని నైవేద్యం, నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, వాటి పానార్పణలు గాక ఆ మేకపోతును అర్పించాలి.7 ✝“ఏడో నెల పదో రోజున మీరు పవిత్రసభగా సమకూడాలి. ఆ రోజు మిమ్ములను అదుపు చేసుకొని ఉండాలి. బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు. 8 యెహోవాకు పరిమళహోమంగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి. 9 నూనెతో కలిపిన గోధుమ పిండి అనే వాటి నైవేద్యాలను కూడా అర్పించాలి. కోడెతోపాటు మూడు కిలోగ్రాముల పిండి, పొట్టేలుతోపాటు రెండు కిలోగ్రాముల పిండి, 10 ఏడు గొర్రెపిల్లల్లో ప్రతిదానితోపాటు ఒక కిలోగ్రాం పిండి అర్పించాలి. 11 పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. ప్రాయశ్చిత్తం చేసే పాపంకోసమైన బలి కాక, నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం గాక, వాటి పానార్పణలు గాక, ఆ మేకపోతును అర్పించాలి.
12 ✝“ఏడో నెల పదిహేనో రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. అప్పుడు ఏడు రోజులు యెహోవాకు పండుగ ఆచరించాలి. బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు. 13 యెహోవాకు పరిమళ హోమబలిగా పదమూడు కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి. 14 నూనెతో కలిపిన గోధుమపిండి నైవేద్యాలను కూడా అర్పించాలి. ఆ పదమూడు కోడెలలో ప్రతిదానితోపాటు మూడు కిలోగ్రాముల పిండి, ఆ రెండు పొట్టేళ్ళలో ప్రతిదానితోపాటు రెండు కిలోగ్రాముల పిండి, 15 ఆ పద్నాలుగు గొర్రెపిల్లల్లో ప్రతిదానితోపాటు ఒక కిలోగ్రాం పిండి అర్పించాలి. 16 పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, దాని పానార్పణం గాక పై చెప్పిన వీటన్నిటినీ అర్పించాలి.
17 “ఆ ఏడు రోజుల్లో రెండో రోజున మీరు పన్నెండు కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి. 18 నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కల ప్రకారం, ఆ కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతో పాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి. 19 పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, నైవేద్యం, వాటి పానార్పణలు గాక పైన చెప్పిన వీటన్నిటినీ అర్పించాలి.
20 “మూడో రోజున పదకొండు కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగగొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి. 21 నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం, కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతో పాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి. 22 పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణం గాక పై చెప్పిన వీటిని కూడా అర్పించాలి.
23 “నాలుగో రోజున పది కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి. 24 నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం, కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి. 25 పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణ గాక పై చెప్పినవాటిని కూడా అర్పించాలి.
26 “అయిదో రోజున తొమ్మిది కోడెలనూ రెండూ పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగగొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి. 27 నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి. 28 పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణ గాక పై చెప్పినవాటిని కూడా అర్పించాలి.
29 “ఆరో రోజున ఎనిమిది కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి. 30 నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి. 31 పాపాల కోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణం గాక పై చెప్పినవాటిని కూడా అర్పించాలి.
32 “ఏడో రోజున ఏడు కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగగొర్రెపిల్లలనూ అర్పించాలి. 33 నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం, ఆ కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి. 34 పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణం గాక పై చెప్పినవాటిని కూడా అర్పించాలి.
35 ✝“ఎనిమిదో రోజున సభగా సమకూడాలి. అప్పుడు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు. 36 యెహోవాకు పరిమళ హోమబలిగా కోడెదూడనూ పొట్టేలునూ ఏడు ఏడాది మగగొర్రెపిల్లనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి. 37 చట్టంప్రకారం వాటి వాటి లెక్కప్రకారం ఆ కోడె, పొట్టేలు, గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి. 38 పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణం గాక పైన చెప్పిన వాటిని కూడా అర్పించాలి.
39 ✝“మీరు వాటిని నియామక కాలాలలో యెహోవాకు అర్పించాలి. మీ మొక్కుబళ్ళూ స్వేచ్ఛార్పణలూ హోమబలులూ నైవేద్యాలూ పానార్పణలూ శాంతి బలులు గాక, పై చెప్పినవాటిని అర్పించాలి.”
40 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా మోషే ఇస్రాయేల్ ప్రజలకు తెలిపాడు.