28
1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “నీవు ఇస్రాయేల్‌ ప్రజలకు ఈ విధంగా ఆజ్ఞాపించు: నాకు పరిమళ హోమంగా ఉండే నా ఆహార అర్పణలను నియామక కాలంలో నాకు అర్పించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. 3 నీవు వారితో ఇంకా ఇలా చెప్పాలి: మీరు యెహోవాకు అర్పించవలసిన హోమం ఇదే: లోపం లేని రెండు ఏడాది మగ గొర్రెపిల్లలు. అలాంటివాటిని ప్రతి రోజూ హోమబలిగా అర్పించాలి. 4 వాటిలో ఒక గొర్రెపిల్లను ప్రొద్దున అర్పించాలి. రెండో దానిని సందెవేళ అర్పించాలి. 5 దంచి తీసిన లీటర్ నూనెతో కలిపిన ఒక కిలోగ్రాం మెత్తని గోధుమపిండిని కూడా నైవేద్యంగా అర్పించాలి. 6 అది యెహోవాకు పరిమళహోమం. ఆయన సీనాయి పర్వతంమీద నియమించిన నిత్యమైన హోమబలి. 7 ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించవలసిన పానార్పణ ఒక లీటరు పులిసిన రసం. పవిత్ర స్థానంలో దాన్ని పానార్పణంగా యెహోవాకు పోయాలి. 8 ఆ రెండో గొర్రెపిల్లను సందెవేళ అర్పించాలి. ప్రొద్దున అర్పించినట్టే దానితో నైవేద్యం, పానార్పణం అర్పించాలి. అది యెహోవాకు పరిమళ హోమం.
9 “విశ్రాంతి రోజుల్లో లోపం లేని రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను అర్పించాలి. వాటితో పాటు నైవేద్యంగా నూనెతో కలిపిన రెండు కిలోగ్రాముల గోధుమపిండినీ ఆ నైవేద్యానికి చెందిన పానార్పణనూ తేవాలి. 10 నిత్యమైన హోమబలి, దాని పానార్పణం గాక, ఇది ప్రతి విశ్రాంతి రోజున చేయవలసిన హోమబలి.
11 “ప్రతి నెల మొదటి రోజున యెహోవాకు హోమబలి అర్పించాలి. అర్పించవలసినవి – రెండు కోడెలూ ఒక పొట్టేలూ లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలూ. 12 నైవేద్యంగా ప్రతి కోడెతోపాటు నూనె కలిపిన మూడు కిలోగ్రాముల గోధుమ పిండి, ప్రతి పొట్టేలుతోపాటు నూనె కలిపిన రెండు కిలోగ్రాముల గోధుమపిండి, 13 ప్రతి గొర్రెపిల్లతోపాటు నూనె కలిపిన ఒక కిలోగ్రాం గోధుమపిండి. అది యెహోవాకు పరిమళహోమం, మంటల్లో అర్పణ. 14 వాటితో అర్పించవలసిన పానార్పణలు – కోడెతో రెండు లీటర్ల ద్రాక్షరసం, పొట్టేలుతో లీటరున్నర ద్రాక్షరసం, గొర్రెపిల్లతో ఒక లీటర్ ద్రాక్షరసం. సంవత్సరంలో ప్రతి నెల మొదటి రోజున జరగవలసిన హోమం ఇది. 15 నిత్యమైన హోమబలి, దాని పానార్పణం గాక, పాపాలకోసం బలిగా ఒక మేకపోతును యెహోవాకు అర్పించాలి.
16 “మొదటి నెల పద్నాలుగో రోజు యెహోవాకు పస్కాపండుగ. 17 ఆ నెల పదిహేనో రోజున పండుగ జరుగుతుంది. పొంగజేసే పదార్థం వేయకుండా చేసిన రొట్టెలు ఏడు రోజులు తినాలి. 18 మొదటి రోజున పవిత్ర సభగా సమకూడాలి. అప్పుడు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చేయకూడదు. 19 యెహోవాకు హోమబలిగా రెండు కోడెలనూ ఒక పొట్టేలునూ ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి లోపం లేనివై ఉండాలి. 20 వాటి నైవేద్యాలు నూనెతో కలిపిన గోధుమ పిండి. కోడెతోపాటు మూడు కిలోగ్రాముల పిండిని, పొట్టేలుతో రెండు కిలోగ్రాముల పిండిని, 21 ప్రతి గొర్రెపిల్లతో ఒక కిలోగ్రాం పిండిని అర్పించాలి. 22 అంతే కాకుండా మీ పాపాలను కప్పివేయడానికి పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. 23 ప్రొద్దున మీరు అర్పించవలసిన నిత్యమైన హోమబలి గాక వీటిని కూడా అర్పించాలి. 24 ఈ విధంగానే ఆ ఏడు రోజుల్లో ప్రతిరోజూ యెహోవాకు పరిమళహోమంగా అర్పణ ఆహారాన్ని అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని పానార్పణం గాక దానిని కూడా అర్పించాలి. 25 ఆ రోజుల్లో ఏడో రోజున పవిత్ర సభగా సమకూడాలి. ఆ రోజున మీరు బ్రతుకుదెరువుకోసం ఏ పనీ చేయకూడదు.
26 “మీరు ‘వారాల’ పండుగలో యెహోవాకు కొత్త నైవేద్యం తెచ్చేటప్పుడు, ప్రథమ ఫలాలను అర్పించే రోజున, పవిత్ర సభగా సమకూడాలి. ఆరోజు మీరు బ్రతుకుదెరువుకోసం ఏ పనీ చెయ్యకూడదు. 27 యెహోవాకు పరిమళహోమంగా మీరు రెండుకోడెలనూ ఒక పొట్టేలునూ ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. 28 నూనెతో కలిపిన గోధుమపిండి నైవేద్యాలను కూడా అర్పించాలి. ప్రతి కోడెతోపాటు మూడు కిలోగ్రాముల పిండి, పొట్టేలుతోపాటు రెండు కిలోగ్రాముల పిండి, 29 ఆ ఏడు గొర్రెపిల్లల్లో ప్రతిదానితోపాటు ఒక కిలోగ్రాం పిండి అర్పించాలి. 30 అంతేగాక, మీ పాపాలను కప్పివేయడానికి ఒక మేకపోతును కూడా అర్పించాలి. 31 నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం గాక మీరు వాటిని, వాటి పానార్పణలతోపాటు అర్పించాలి. జంతువులు ఏ లోపం లేనివై ఉండాలి.”