27
1 ✝అప్పుడు యోసేపు కొడుకైన మనష్షే వంశీయులలో సెలోపెహాదు కూతుళ్ళు సన్నిధిగుడారం దగ్గరికి వచ్చారు. సెలోపెహాదు హెపెరు కొడుకూ గిలాదు మనుమడూ మాకీరు మునిమనుమడూ. అతడి కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 2 వారు సన్నిధిగుడారం ద్వారందగ్గర మోషే ఎదుటా ఎలియాజరుయాజి ఎదుటా నాయకుల ఎదుటా సర్వ సమాజం ఎదుటా నిలబడి ఇలా అన్నారు:3 “మా తండ్రిగారు ఎడారిలో చనిపోయారు; ఆయన యెహోవాకు విరోధంగా పోగైన కోరహు బృందంలో లేడు గాని తాను చేసిన పాపాల కారణంగా చనిపోయాడు. ఆయనకు కొడుకులు కలగలేదు. 4 మా తండ్రికి కొడుకులు లేనంతమాత్రంచేత ఆయన పేరు ఆయన వంశంలో లేకుండా పోవాలా? మా తండ్రి అన్నదమ్ములతోపాటు మాకూ వారసత్వం వచ్చేలా చూడండి.”
5 వారి విషయం మోషే యెహోవా సన్నిధానంలో మనవి చేశాడు. 6 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 7 “సెలోపెహాదు కూతుళ్ళు చెప్పినది ధర్మమే. వారి తండ్రి అన్నదమ్ములతోపాటు వారసత్వం వారి స్వాధీనం చేసితీరాలి. వారి తండ్రి వారసత్వం వారికి చెందేలా చేయాలి. 8 అంతేగాక, నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పాలి: కొడుకు లేకుండా ఒక మనిషి చనిపోతే మీరు అతడి వారసత్వం అతడి కూతురికి వచ్చేలా చేయాలి. 9 ఒక వేళ అతడికి కూతురు లేకపోతే అతడి ఆస్తికి వారసులు అతడి అన్నదమ్ములు. 10 అతడికి అన్నదమ్ములు లేకపోతే అతడి వారసత్వం అతడి తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి. 11 అతడి తండ్రికి అన్నదమ్ములు లేకపోతే అతడి వారసత్వం అతడి కుటుంబంలో సమీప బంధువుకు రావాలి. ఆ బంధువు దానిని స్వాధీనం చేసుకొంటాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇది ఇస్రాయేల్ ప్రజలకు విధించిన నిర్ణయం.”
12 ✝యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: “నీవు ఈ అబారీం పర్వతమెక్కి నేను ఇస్రాయేల్‌ప్రజలకు ఇచ్చిన దేశాన్ని చూడు. 13 దానిని చూచినతరువాత నీ అన్న అహరోను తన పూర్వీకులదగ్గరికి చేరినట్టు నీవూ చేరుతావు. 14 ఎందుకంటే, సీన్ ఎడారిలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళదగ్గర వారి కళ్ళెదుట నా పవిత్రాన్ని నువ్వు నిలబెట్టలేదు, నా ఆజ్ఞ శిరసావహించలేదు.” ఆ నీళ్ళు సీన్ ఎడారిలో ఉన్న మెరీబా కాదేషు నీళ్ళే.
15 మోషే యెహోవాతో ఇలా అన్నాడు: 16 ✽“యెహోవా! మానవులందరి ఆత్మలకు దేవా! యెహోవాయొక్క సమాజం కాపరిలేని గొర్రెలలాగా ఉండకుండేలా ఈ సమాజంమీద ఒక మనిషిని నియమించు. 17 అతడు వారి ముందు వెళ్తూ వస్తూ ఉండాలి. వారిని వెలుపలికి తీసుకుపోవాలి, వారిని తిరిగి తీసుకురావాలి.”
18 అందుకు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నూను కొడుకు యెహోషువ ఆధ్యాత్మిక వ్యక్తి. అతణ్ణి తీసుకువచ్చి అతడిమీద నీ చెయ్యి ఉంచు. 19 అతణ్ణి ఎలియాజరుయాజి ఎదుటా సర్వసమాజం ఎదుటా నిలబెట్టి వారి కళ్ళెదుటే అతడికి ఆజ్ఞ ఇచ్చి అతణ్ణి నియమించాలి. 20 ఇస్రాయేల్ ప్రజల సర్వసమాజం అతని మాట వినేలా అతనికి నీ ఘనతలో కొంత ఇవ్వాలి. 21 ఎలియాజరుయాజి ఎదుట అతడు నిలబడ్డప్పుడు ఎలియాజరు యెహోవా సన్నిధానంలో ‘ఊరీం’ న్యాయనిర్ణయం ద్వారా అతని కోసం విచారించాలి. అతని మాట ప్రకారం అతడూ అతనితోపాటు ఇస్రాయేల్ ప్రజల సమాజమంతా బయలుదేరాలి, తిరిగి రావాలి.” 22 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు. యెహోషువను తీసుకువచ్చి ఎలియాజరు ముందూ సర్వసమాజం ముందూ అతణ్ణి నిలబెట్టాడు. 23 ✝యెహోవా తన ద్వారా ఆజ్ఞాపించినట్టే అతడిమీద చేతులు ఉంచి ఆజ్ఞ ఇచ్చి అతణ్ణి నియమించాడు.