26
1 ఆ విపత్తు పోయిన తరువాత యెహోవా మోషేతోనూ యాజి అయిన అహరోను కొడుకు ఎలియాజరుతోనూ ఇలా చెప్పాడు: 2 ✽ “మీరు ఇస్రాయేల్ ప్రజల సర్వసమాజంలో వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గవారందరి జనాభా లెక్కలు వ్రాయించండి.”3 గనుక వారు మోయాబు మైదానాలలో యెరికో ఎదుట యొర్దాను ఒడ్డున ఉన్నప్పుడు మోషే, యాజి అయిన ఎలియాజరు వారితో ఇలా చెప్పారు: 4 “యెహోవా మోషేకూ ఈజిప్ట్‌నుంచి వచ్చిన ఇస్రాయేల్ ప్రజలకూ ఆజ్ఞాపించినట్టు ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉన్నవారి పేర్లు నమోదు చేయాలి.”
5 ఇస్రాయేల్‌కు పెద్ద కొడుకు రూబేను. రూబేను సంతతివారు హనోకు, హనోకు వంశీయులు; పల్లు, పల్లు వంశీయులు; 6 హెస్రోను, హెస్రోను వంశీయులు; కర్మి, కర్మివంశీయులు. 7 ✝వీరంతా రూబేను వంశాలు. వారిలో నమోదైన వారి సంఖ్య నలభై మూడు వేల ఏడు వందల ముప్ఫయి. 8 పల్లు కొడుకు ఏలీయాబు. 9 ఏలీయాబు కొడుకులు నెమూయేల్, దాతాను, అబీరాం. ఈ దాతాను, అబీరాం సమాజంలో ఎన్నికైనవారై కోరహు బృందం వాళ్ళతో చేరి యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు, మోషే అహరోనులతో వాదించినవారు. 10 ✝ఆ బృందంవాళ్ళు చనిపోయినప్పుడు భూమి నోరు తెరచి వీరిని కోరహుతోపాటు మింగివేసింది. ఆ సమయంలోనే రెండు వందల యాభైమందిని మంటలు దహించివేశాయి. వారు హెచ్చరిక సూచనగా ఉన్నారు. 11 కోరహు కొడుకులు అప్పుడు చావలేదు.
12 షిమ్యోను సంతతివారు, వారి వంశాలప్రకారం, నెమూయేల్, నెమూయేల్ వంశీయులు; యామీను, యామీను వంశీయులు; యాకీను, యాకీను వంశీయులు; 13 జెరహు, జెరహు వంశీయులు; షావూల్, షావూల్ వంశీయులు. 14 ✽ ఇవి షిమ్యోను వారి వంశాలు. వారి సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందలు.
15 గాదు సంతతివారు, వారి వంశాల ప్రకారం, సెపోను, సెపోను వంశీయులు, హగ్గీ, హగ్గీ వంశీయులు; షూనీ, షూనీ వంశీయులు; 16 ఓజని, ఓజని వంశీయులు; ఏరీ, ఏరీ వంశీయులు; 17 ఆరోదు, ఆరోదు వంశీయులు; అరేతీ, అరేతీ వంశీయులు.
18 ✝ఇవి గాదువారి వంశాలు. వీరిలో నమోదైనవారి సంఖ్య నలభై వేల అయిదు వందలు.
19 యూదా కొడుకులు ఏర్, ఓనాను. వీరిద్దరూ కనానుదేశంలో చనిపోయారు. 20 యూదా సంతతివారు, వారి వంశాల ప్రకారం, షేలా, షేలా వంశీయులు; పెరెసు, పెరెసు వంశీయులు; జెరహు, జెరహు వంశీయులు. 21 పెరెసు సంతతివారు హెస్రోను, హెస్రోను వంశీయులు; హామూల్, హామూల్ వంశీయులు; 22 ఇవి యూదా వంశాలు. వారి సంఖ్య డెబ్భై ఆరు వేల అయిదు వందలు.
23 ఇశ్శాకారు సంతతివారు, వారి వంశాల ప్రకారం, తోలా, తోలా వంశీయులు; పువ్వా, పువ్వా వంశీయులు; 24 యాషూబ్, యాషూబ్ వంశీయులు; షిమ్రోను, షిమ్రోను వంశీయులు. 25 ఇవి ఇశ్శాకారువారి వంశాలు. నమోదైనవారి సంఖ్య అరవై నాలుగు వేల మూడు వందలు.
26 జెబూలూను సంతతివారు, వారి వంశాల ప్రకారం, సెరెదు, సెరెదు వంశీయులు; ఏలోను, ఏలోను వంశీయులు; యహలేల్, యహలేల్ వంశీయులు. 27 ఇవి జెబూలూనువారి వంశాలు. నమోదైన వారి సంఖ్య అరవై వేల అయిదు వందలు.
28 యోసేపు సంతతివారు, వారి వంశాలప్రకారం, మనష్షే, ఎఫ్రాయిం. 29 మనష్షే సంతతివారు మాకీరు, మాకీరు వంశీయులు; (గిలాదు మాకీరు కొడుకు) గిలాదు, గిలాదు వంశీయులు. 30 గిలాదు సంతతివారు ఈజరు, ఈజరు వంశీయులు; హెలకు, హెలకు వంశీయులు. 31 అశ్రీయేల్, అశ్రీయేల్ వంశీయులు; షెకెం, షెకెం వంశీయులు; 32 షెమీదా, షెమీదా వంశీయులు; హెపెరు, హెపెరు వంశీయులు. 33 (హెపెరు కొడుకు సెలోపెహాదుకు కొడుకులు లేరు. కూతుళ్ళు జన్మించారు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా). 34 ✽ఇవి మనష్షేవారి వంశాలు. వారిలో నమోదైన వారి సంఖ్య యాభై రెండువేల ఏడు వందలు. 35 ఎఫ్రాయిం సంతతివారు, వారి వంశాలప్రకారం, షూతలహు, షూతలహు వంశీయులు; బకేరు, బకేరు వంశీయులు; తాహను, తాహను వంశీయులు. 36 షూతలహు సంతతివారు ఏరాను, ఏరాను వంశీయులు. 37 ✝ ఇవి ఎఫ్రాయింవారి వంశాలు. వారిలో నమోదైనవారి సంఖ్య ముప్ఫయి రెండు వేల అయిదు వందలు. వారి వంశాల ప్రకారం వీరు యోసేపు సంతతివారు.
38 బెన్యామీను సంతతివారు, వారి వంశాల ప్రకారం, బెల, బెల వంశీయులు; అష్బేల, అష్బేల వంశీయులు; అహీరాం, అహీరాం వంశీయులు; 39 షూప్పం, షూప్పం వంశీయులు; హుప్పం, హుప్పం వంశీయులు. 40 బెల సంతతివారు ఆర్డు, నయమాను, ఆర్డు వంశీయులు, నయమాను వంశీయులు. 41 వారి వంశాల ప్రకారం వీరు బెన్యామీను సంతతివారు. వారిలో నమోదైనవారి సంఖ్య నలభై ఐదు వేల ఆరు వందలు.
42 దాను సంతతివారు, వారి వంశాలప్రకారం, షూహాం, షూహాం వంశీయులు; వారి వంశాల ప్రకారం, వీరు దాను వంశీయులు. 43 షూహాం వంశస్థులందరిలో నమోదైనవారి సంఖ్య అరవై నాలుగు వేల నాలుగు వందలు.
44 ఆషేరు సంతతివారు, వారి వంశాలప్రకారం, యిమ్నా, యిమ్నా వంశీయులు; ఇష్వీ, ఇష్వీ వంశీయులు; బెరీయా, బెరీయా వంశీయులు. 45 బెరీయా సంతతివారు హెబెరు, హెబెరు వంశీయులు; మల్కియేల్, మల్కియేల్ వంశీయులు. 46 ఆషేరు కూతురు పేరు శెరహు. 47 ఇవి ఆషేరువారి వంశాలు. వారిలో నమోదైన వారి సంఖ్య యాభై మూడు వేల నాలుగు వందలు.
48 నఫ్తాలి సంతతివారు, వారి వంశాలప్రకారం, యహసయేల్, యహసయేల్ వంశీయులు; గూనీ, గూనీ వంశీయులు; 49 యేసేరు, యేసేరు వంశీయులు; షిల్లేం, షిల్లేం వంశీయులు. 50 ఇవి నఫ్తాలివారి వంశాలు. వారిలో నమోదైనవారి సంఖ్య నలభై ఐదు వేల నాలుగు వందలు.
51 ✽ఇస్రాయేల్ ప్రజలలో నమోదైనవారి సంఖ్య ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్ఫయి.
52 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 53 “వీరి పేర్ల లెక్కప్రకారం కనానుదేశాన్ని వీరికి వారసత్వంగా పంచిపెట్టాలి. 54 ఎక్కువమందికి ఎక్కువ వారసత్వం ఇవ్వాలి. తక్కువమందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. ప్రతి గోత్రానికి దాని జనసంఖ్య ప్రకారం వారసత్వం ఇవ్వాలి. 55 అయితే చీట్లు వేసి ఆ భూమిని పంచి పెట్టాలి. వారు తమ తమ పూర్వీకుల గోత్రాల పేర్ల ప్రకారం వారసత్వం పొందాలి. 56 ఎక్కువమందికి గానీ తక్కువమందికి గానీ చీట్లు వేసి, ఎవరి వారసత్వం వారికి పంచిపెట్టాలి.”
57 లేవీ గోత్రికులలో నమోదైనవారు, వారి వారి వంశాలప్రకారం, గెర్షోను వంశీయులు, కహాతు వంశీయులు, మెరారి వంశీయులు. 58 ఇవి లేవీ వంశాలు: లిబ్నివారి వంశం, హెబ్రోనువారి వంశం, మహల్‌వారి వంశం, మూషువారి వంశం, కోరహు వారి వంశం. కహాతుకు అమ్రాం జన్మించాడు. 59 అమ్రాం భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ సంతానం. ఈజిప్ట్‌లో ఆమె లేవీవంశంలో జన్మించింది. ఆమె అమ్రాంవల్ల అహరోనునూ మోషేనూ వారి తోబుట్టువు మిర్యాంనూ కన్నది. 60 అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు జన్మించారు. 61 నాదాబు అబీహులు నిషిద్ధమైన నిప్పును యెహోవా సన్నిధానంలో అర్పించి చనిపోయారు. 62 ✝లేవీగోత్రికులలో నెల మొదలుకొని పై వయస్సు ఉండి నమోదైనవారి సంఖ్య ఇరవై మూడు వేలు. ఇస్రాయేల్‌ప్రజలలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు గనుక వారు ఇస్రాయేల్‌ప్రజలలో నమోదైనవారు కారు.
63 మోషే, ఎలియాజరుయాజి నమోదు చేసిన వారు వీరే. వారు ఇస్రాయేల్ ప్రజల పేర్లు యెరికో ఎదుట, యొర్దాను దగ్గర, మోయాబు మైదానాలలో నమోదు చేశారు. 64 మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇస్రాయేల్ ప్రజలను నమోదు చేసినప్పుడు నమోదైనవారిలో ఒక్కడైనా వీరిలో లేడు. 65 ✝వారిని గురించి యెహోవా “వారు ఎడారిలో తప్పకుండా చనిపోతారు” అన్నాడు. గనుక యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిలో ఒక్కడూ మిగలలేదు.