25
1 ఇస్రాయేల్ ప్రజలు షిత్తీంలో మకాం చేశారు. అక్కడ వారు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయసాగారు. 2 ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు వారిని పిలిచారు. వారు వెళ్ళి భోజనం చేసి ఆ దేవుళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశారు. 3 ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలు పెయోర్ బయల్ దేవుడికి లొంగిపోయినందుచేత వారిమీద యెహోవా కోపాగ్ని రగులుకొంది.
4 యెహోవా మోషేతో “నీవు ఆ ప్రజల నాయకులందరినీ తోడుకొని పట్టపగలే యెహోవా సన్నిధానంలో వారిని ఉరి వేసి చంపాలి. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇస్రాయేల్ ప్రజలమీద నుంచి తొలగిపోతుంది” అన్నాడు.
5 అందుచేత మోషే ప్రజల న్యాయాధిపతులతో “పెయోర్ బయల్ దేవుడికి లొంగిపోయిన వాళ్ళను చంపాలి. మీలో ప్రతి ఒక్కరూ తన తన వంశంలో ఉన్న అలాంటివాళ్ళను చంపండి” అన్నాడు.
6 అప్పుడు ఇస్రాయేల్ ప్రజలంతా సన్నిధిగుడారం ద్వారందగ్గర సమకూడి ఏడుస్తూ ఉండగానే వారి కండ్ల ఎదుటా మోషే కండ్ల ఎదుటా ఇస్రాయేల్ ప్రజల్లో ఒకడు తనవారి దగ్గరికి ఒక మిద్యాను స్త్రీని వెంటబెట్టుకొని వచ్చాడు.
7 ఫీనెహాసు అది చూశాడు. ఫీనెహాసు యాజి అయిన అహరోను మనుమడూ ఎలియాజరు కొడుకూ. అతడు సమాజంనుంచి లేచి ఈటెను చేతపట్టుకొని 8 ఆ ఇస్రాయేల్‌వాడి వెంటపడి అతడి గుడారంలో ప్రవేశించి అతణ్ణీ ఆ స్త్రీనీ కడుపుగుండా దూసుకుపోయేలా ఈటెతో పొడిచాడు. అప్పుడు ఇస్రాయేల్ ప్రజల మధ్య విపత్తు నిలిచిపోయింది. 9 ఆ విపత్తువల్ల చనిపోయినవారు ఇరవై నాలుగు వేలమంది.
10 తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 11 “యాజి అయిన అహరోను మనుమడూ ఎలియాజరు కొడుకైన ఫీనెహాసు ఇస్రాయేల్ ప్రజల మీదనుంచి నా కోపం మళ్ళించాడు. అతడు నా పక్షంగా రోషం చూపించాడు, గనుక నేను నా రోషంతో వారిని నాశనం చేయలేదు. 12 కాబట్టి ఇలా ప్రకటించు: ఫీనెహాసు తన దేవుని విషయం రోషం కలిగి ఇస్రాయేల్ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు, 13 గనుక నేను అతనితో నా ఒడంబడిక చేస్తున్నాను. అది శాంతి ఒడంబడిక. శాశ్వతమైన యాజి పదవిని గురించిన ఒడంబడిక. ఇది అతనికీ అతని సంతానానికీ ఎప్పటికీ నిలిచి ఉండే ఒడంబడిక.”
14 ఆ మిద్యాను స్త్రీతో హతమైనవాడి పేరు జిమ్రీ. అతడు సాలూ కొడుకు, షిమ్యోనుగోత్రంలో పూర్వీకుల కుటుంబాలలో ఒక కుటుంబానికి నాయకుడు. 15 హతమైన మోయాబు స్త్రీ పేరు కొజ్బీ. ఆమె సూర్ కూతురు. అతడు మిద్యాను పూర్వీకుల కుటుంబాలలో ఒకదానికి నాయకుడు.
16 అది జరిగాక యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
17 “మిద్యానువాళ్ళు తంత్రాలు చేసి మీకు విరోధులయ్యారు. పెయోర్‌దేవుడి విషయంలో, విపత్తు వచ్చినరోజున హతమైన తమ సోదరీ మిద్యాను నాయకుడి కూతురూ అయిన కొజ్బీ విషయంలో వాళ్ళు మిమ్ములను మోసగించారు. 18 గనుక మీరు వాళ్ళకు విరోధులై వాళ్ళను కూలగొట్టాలి.”