24
1 ✝ఇస్రాయేల్ ప్రజలను దీవించడమే యెహోవాకు ఇష్టమని బిలాం తెలుసుకొన్నాడు, గనుక మునుపటిలాగా అతడు శకునాలను చూడడానికి ఎక్కడికీ వెళ్ళకుండా ఆ ఎడారివైపు తిరిగాడు. 2 ✽అక్కడ క్రమంగా వరుసగా దిగివున్న ఇస్రాయేల్ ప్రజల గోత్రాలను బిలాం చూశాడు. అప్పుడు దేవుని ఆత్మ అతణ్ణి ఆవరించాడు. అతడు కావ్యరూపంలో ఇలా పలికాడు:3 ✽“బెయోరు కుమారుడు బిలాంకు వచ్చిన దేవోక్తి.
కండ్లు తెరిచిన వాడి దేవోక్తి
4 దేవుని పలుకులు విన్నవాడి దేవోక్తి
పరవశుడై కనువిప్పు కలిగినవాడై అమిత శక్తిగల
దేవుని దర్శనం పొందినవాడి దేవోక్తి ఇదే.
5 యాకోబుజనమా! నీ గుడారాలు,
ఇస్రాయేల్ ప్రజా!
నీ నివాస స్థలాలు ఎంత చక్కనివి!
6 అవి వ్యాపించి ఉన్న ప్రవాహాలు గల
మైదానాలలాంటివి,
నది ఒడ్డున ఉన్న తోటలలాంటివి,
యెహోవా నాటిన అగరు చెట్లలాంటివి,
నీళ్ళ దగ్గర ఉన్న దేవదారు వృక్షాలలాంటివి.
7 ✽ఆ ప్రజల బొక్కెనల అంచుల పైనుంచి
నీళ్ళు పొర్లిపారుతాయి.
వారి సంతానం అనేక జలాల దగ్గర
కాపురముంటారు.
వారి రాజు రాజైన అగగుకంటే
మించినవాడవుతాడు.
వారి రాజ్యం ఘనంగా ఉంటుంది.
8 దేవుడు ఈజిప్ట్‌నుంచి వారిని తీసుకువచ్చాడు.
గురుపోతు బలంలాంటి బలం
ఆయన వారికిచ్చాడు.
వారు తమ శత్రువులైన జనాలను మింగివేస్తారు.
వాళ్ళ ఎముకలు విరగ్గొట్టివేస్తారు.
వారి బాణాలు వాళ్ళకు గుచ్చుకొంటాయి.
9 ✝ముందుకు వంగి పడుకొన్న సింహంలాగా,
ఆడసింహంలాగా వారు పడుకుంటారు.
వారిని లేపడానికి ఎవరు తెగిస్తారు?
మిమ్మల్ని దీవించేవాడు దీవెన పొందుతాడు.
మిమ్మల్ని శపించేవాడు శాపానికి గురి అవుతాడు.
10 అప్పుడు బాలాకు బిలాంమీద కోపంతో మండిపడి చేతులు చరుచుకొని బిలాంతో ఇలా అన్నాడు:
“నా శత్రువుల్ని శపించడానికి మిమ్మల్ని పిలిస్తే మీరు ఈ మూడు సార్లు వారిని గొప్పగా దీవించారు. 11 ఇప్పుడు మీ స్థలానికి పారిపోండి. మిమ్మల్ని అధికంగా ఘనపరచాలనుకొన్నాను గాని మీరు ఘనత పొందకుండా యెహోవా చేశాడు.”
12 అందుకు బిలాం బాలాకుతో అన్నాడు, 13 “బాలాకు తన భవనాన్ని వెండి బంగారాలతో నింపి నాకిచ్చినా యెహోవా ఆజ్ఞను మీరను; దాని కంటే మంచిది గానీ చెడ్డది గానీ చెయ్యను, యెహోవా చెప్పేమాటలే నేను చెప్తానని మీరు నాదగ్గరికి పంపించిన వార్తాహరులతో చెప్పాను గదా. 14 ఇప్పుడు నేను నా ప్రజలదగ్గరికి వెళ్తాను. అయితే చివరి రోజుల్లో ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో అది నీకు తెలియజేస్తాను.”
15 అప్పుడతడు కావ్యరూపంలో ఇలా పలికాడు:
“బెయోరు కుమారుడు బిలాం దేవోక్తి
కనువిప్పు కలిగిన వాడి దేవోక్తి
16 దేవుని పలుకులు విన్నవాడి దేవోక్తి
సర్వాతీతుడైన దేవుని గురించిన
జ్ఞానం గలవాడి దేవోక్తి,
పరవశుడై కనువిప్పు కలిగినవాడై
అమిత శక్తిగల దేవుని దర్శనం పొందినవాడి
దేవోక్తి ఇదే:
17 ✽నక్షత్రం యాకోబు జనంలో ఉదయిస్తుంది.
రాజదండం ఇస్రాయేల్ ప్రజలో లేస్తుంది.
ఆయనను చూస్తున్నాను గాని,
ప్రస్తుతం ఉన్నట్టు కాదు.
ఆయనను చూస్తున్నాను గాని,
సమీపంలో ఉన్నట్టు కాదు.
ఆయన మోయాబు ప్రాంతాలను మొత్తుతాడు.
అల్లరిమూకనంతటినీ నాశనం చేస్తాడు.
18 ఆయనకు విరోధంగా ఉన్న సేయీరు,
ఎదోందేశం ఆయన స్వాధీనం అవుతాయి.
ఇస్రాయేల్ ప్రజలు పరాక్రమాన్ని కనుపరుస్తారు.
19 యాకోబుజనంలో పరిపాలకుడు జన్మిస్తాడు.
ఇక్కడి పట్టణాలనుంచి పారిపోయిన వారందరినీ
ఆయన నాశనం చేస్తాడు.”
20 ✽బిలాం అమాలేకుజాతివాళ్ళ ప్రదేశం వైపు చూచి తన కావ్యం ఇలా పలికాడు:
“జాతులలో అమాలేకు మొదటిది.
వాళ్ళ అంతం సర్వనాశనం.”
21 ✽అతడు కేనువాళ్ళ ప్రదేశంవైపు చూచి తన కావ్యం ఇలా పలికాడు:
“మీ నివాస స్థలం దృఢమైనది.
మీ గూడు నిటారు రాతికొండమీద కట్టి ఉంది.
22 అయినా కేనువాళ్ళు నాశనమవుతారు.
అష్షూరువాళ్ళు వాళ్ళను చెరపట్టేవరకు
ఎంతకాలం ఉంటుంది?”
23 అతడు కావ్యరూపంలో ఇంకా అన్నాడు:
“అయ్యో! దేవుడు ఇలా చేసేటప్పుడు
ఎవరు బ్రతకగలరు?
24 కిత్తీం దేశతీరంనుంచి ఓడలు వస్తాయి.
వాటివల్ల అష్షూరువాళ్ళకూ ఏబెరువాళ్ళకూ
బాధ కలుగుతుంది.
వారు సర్వనాశనమవుతారు.”
25 ✽అప్పుడు బిలాం లేచి స్వస్థలానికి తిరిగివెళ్ళాడు. బాలాకు కూడా తన దారిన వెళ్ళాడు.