23
1 అప్పుడు బిలాం “ఇక్కడ నాకోసం ఏడు బలిపీఠాల్ని కట్టించు. ఇక్కడ ఏడు కోడెలూ ఏడు పొట్టేళ్ళూ నాకోసం సిద్ధం చెయ్యి” అని బాలాకుతో చెప్పాడు. 2 బిలాం చెప్పినట్టే బాలాకు చేసిన తరువాత, బిలాం బాలాకు కలిసి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క కోడెనూ పొట్టేలునూ అర్పించారు.
3 బిలాం “మీ హోమం దగ్గర నిలబడండి. నేను వెళ్తాను. ఒకవేళ యెహోవా నా దగ్గరికి వస్తాడేమో. ఆయన నాకు వెల్లడి చేసేది మీకు తెలుపుతాను” అని బాలాకుతో చెప్పి చెట్లులేని ఒక కొండ ఎక్కాడు.
4 అక్కడ దేవుడు బిలాంను సమీపించాడు. దేవునితో బిలాం “నేను ఏడు బలిపీఠాలు సిద్ధం చేసి ప్రతిదాని మీదా కోడెనూ పొట్టేలునూ అర్పించాన”న్నాడు.
5 సందేశమొకటి బిలాం నోట ఉంచి యెహోవా “బాలాకు దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఈ మాటలు చెప్పు” అన్నాడు.
6 బిలాం బాలాకు దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు అతడు మోయాబు నాయకులందరితోకూడా తన హోమందగ్గర నిలబడి ఉన్నాడు. 7 బిలాం కావ్య రూపంలో ఇలా పలికాడు:
“బాలాకు ఆరాం నుంచీ, మోయాబురాజు
తూర్పు పర్వత పంక్తినుంచీ నన్ను రప్పించాడు.
‘రండి! నా కోసం యాకోబు ప్రజను శపించండి.
రండి! ఇస్రాయేల్ జనాన్ని నిందించండి’
అన్నాడు.
8 దేవుడే శపించనివారిని నేనెలా శపించగలను?
యెహోవా నిందించనివారిని నేనెలా నిందించగలను?
9 ఎత్తయిన బండలనుంచి ఈ జనాన్ని చూస్తున్నాను.
కొండలమీదనుంచి ఈ ప్రజను కనిపెడుతున్నాను.
ఈ ప్రజ ప్రత్యేకంగా నివసిస్తుంది.
తాను జనాలలో ఒక జనమని భావించుకోదు.
10 యాకోబు జనం ధూళిరేణువులలాగా ఉంది –
వారిని ఎవరు లెక్క పెట్టగలరు?
ఇస్రాయేల్ ప్రజ నాలుగో భాగాన్ని
ఎవరు లెక్క పెట్టగలరు?
న్యాయవంతుల మరణం లాంటి మరణం
నేను పొందాలి.
నా అంత్యదశ వారి అంతం లాంటిది
అవుతుంది గాక.
 
11 అప్పుడు బాలాకు బిలాంతో “మీరు నాకేం చేశారు? నా శత్రువుల్ని శపించడానికి మిమ్మల్ని రప్పించాను. అయితే మీరు వారిని గొప్పగా దీవించారే!”
12 అందుకు బిలాం “యెహోవా నానోట ఉంచే మాటలే నేను శ్రద్ధగా పలకాలి గదా!” అని జవాబిచ్చాడు. 13 బాలాకు అతడితో అన్నాడు, “దయ ఉంచి వేరే చోటికి నాతో రండి. అక్కడ నుంచి కూడా మీరు వాళ్ళను చూడవచ్చు గాని అందరినీ కాదు. చివరగా ఉన్నవాళ్ళను మాత్రమే చూడగలరు. అక్కడ నుంచి వాళ్ళను నాకోసం శపించండి.”
14 బాలాకు అతణ్ణి వెంటబెట్టుకొని పిస్గా పర్వత శిఖరం మీద ఉన్న “కావలివాళ్ళ” పొలానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఏడు బలిపీఠాలను కట్టించి ప్రతిదాని మీదా కోడెనూ పొట్టేలునూ అర్పించాడు.
15 బిలాం బాలాకుతో “మీరు ఇక్కడే మీ హోమం దగ్గర నిలబడండి. నేను అక్కడ యెహోవాను కలుసుకోవడానికి వెళ్తాను” అన్నాడు.
16 యెహోవా బిలాంను సమీపించి అతడి నోట సందేశం ఉంచి, “బాలాకు దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఈ మాటలు చెప్పు” అన్నాడు.
17 అతడు బాలాకు దగ్గరికి వచ్చినప్పుడు బాలాకు మోయాబు నాయకులతోకూడా తన హోమం దగ్గర నిలబడి ఉన్నాడు. బాలాకు “యెహోవా ఏం చెప్పాడు?” అని బిలాంను అడిగితే బిలాం కావ్యరూపంలో ఇలా పలికాడు:
18 “బాలాకు! లేచి విను! సిప్పోరు కుమారా!
నేను చెప్పేది ఆలకించు!
19 దేవుడు మానవుడు కాడు –
ఆయన అబద్ధమాడడు. మనసు
మార్చుకోవడానికి ఆయన మానవుడేమీ కాడు.
ఆయన ఏదైనా చెప్పి చేయకుండా ఉంటాడా?
ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?
20 ఇదిగో విను. దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది.
ఆయన దీవించినతరువాత నేను
దాన్ని కొట్టివేయలేను.
21 ఆయన యాకోబు ప్రజలో చెడుగును
చూడలేదు, ఇస్రాయేల్ జనంలో
తుంటరితనాన్ని కనిపెట్టలేదు.
వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నాడు.
రాజు చేసే జయధ్వని వారి మధ్య ఉంది.
22 దేవుడు ఈజిప్ట్ నుంచి వారిని తీసుకువచ్చాడు.
గురుపోతు బలంలాంటి బలం
ఆయన వారికిచ్చాడు.
23  యాకోబు జనానికి విరోధంగా
ఏ మంత్రమూ లేదు.
ఇస్రాయేల్ ప్రజలకు విరోధమైన శకునం లేదు.
దేవుడు చెయ్యబోయేది సరైన సమయాల్లో
యాకోబు వంశస్థులైన ఇస్రాయేల్ ప్రజలకు
తెలుపబడుతుంది.
24 ఇదుగో, ఆ జనం ఆడసింహంలాగా లేస్తుంది,
అది సింహంలాగా బలంతో నిలబడుతుంది.
అది వేటాడి పట్టిన దానిని తిని చంపినదాని
రక్తం త్రాగేవరకు మళ్ళీ పడుకోదు”.
 
25 అప్పుడు బాలాకు “మీరు వాళ్ళను శపించడం లేదు. పోనీ, గాని వాళ్ళను దీవించకూడదు!” అని బిలాంతో చెప్పాడు.
26 బిలాం బాలాకుకు “యెహోవా చెప్పినట్టే నేను అంతా చెయ్యాలని నీతో చెప్పాను గదా” అని జవాబిచ్చాడు.
27 అందుకు బాలాకు బిలాంతో “రండి! నేను మిమ్మల్ని వేరే చోటికి తీసుకువెళ్తాను. అక్కడనుంచి నాకోసం మీరు వాళ్ళను శపించడం దేవునికి నచ్చుతుందేమో” అన్నాడు.
28 బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోర్ పర్వత శిఖరానికి బిలాంను వెంటబెట్టుకొనిపోయాడు.
29 అప్పుడు బిలాం బాలాకుతో “ఇక్కడ నాకోసం ఏడు బలిపీఠాలను కట్టించి ఏడు కోడెలనూ ఏడు పొట్టేళ్ళనూ నాకోసం సిద్ధం చెయ్యి” అన్నాడు. 30 బిలాం చెప్పినట్టే బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీదా కోడెనూ పొట్టేలునూ అర్పించాడు.