22
1 ✽తరువాత ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణమైపోయి యెరికోకు ఎదురుగా, యొర్దాను నదికి తూర్పుగా ఉన్న మోయాబు మైదానాల ప్రాంతంలో దిగారు.2 ఇస్రాయేల్ ప్రజలు అమోరీవాళ్ళకు చేసినదంతా సిప్పోరు కొడుకైన బాలాకు చూశాడు. 3 ఇస్రాయేల్ ప్రజల సంఖ్య అధికం, గనుక వారిని చూచి మోయాబువాళ్ళకు అత్యంత భయం వేసింది. వాళ్ళు చాలా కంగారు పడ్డారు. 4 వాళ్ళు మిద్యాను వంశస్థుల పెద్దలతో “మైదానంలో ఉన్న ఎద్దు పచ్చిక నాకివేసేటట్టు ఈ జనసమూహం మన చుట్టూరా ఉన్నదంతా తినేస్తుంది” అన్నాడు.
ఆ కాలంలో సిప్పోరు కొడుకైన బాలాకు మోయాబు వాళ్ళకు రాజు. 5 అతడు బెయారు కొడుకైన బిలాంను పిలవడానికి అతడి ప్రజల దేశంలో ఉన్న పెతోర్‌కు మనుషులను పంపించాడు. పెతోర్ యూఫ్రటీస్ నది ఒడ్డున ఉంది. వారు తీసుకువెళ్ళిన సందేశం ఇది:
“ఇప్పుడు ఒక జనం ఈజిప్ట్ నుండి వచ్చింది. వారు ఈ ప్రదేశాన్నంతా కమ్మి నా ఎదుటే ఉంటున్నారు. 6 ఈ ప్రజలు బలంలో సంఖ్యలో మాకంటే మించినవారు గనుక మీరు వచ్చి నా కోసం ఈ జనాన్ని శపించండి అని మనవి చేస్తున్నాను. అప్పుడు ఒకవేళ వాళ్ళను జయించి ఈ దేశంనుంచి పారదోలగలుగుతాను. మీరు దీవించేవాళ్ళు దీవెనపాలవుతారనీ శపించేవాళ్లు శాపానికి గురి అవుతారనీ నాకు తెలుసు.”
7 మోయాబు వాళ్ళ పెద్దలూ మిద్యాను వాళ్ళ పెద్దలూ శకునం కోసం డబ్బు చేతపట్టుకొని తరలివెళ్ళారు, బిలాం దగ్గరికి చేరి బాలాకు మాటలు తెలియజేశారు.
8 ✽వాళ్ళతో బిలాం “ఈ రాత్రి ఇక్కడ బస చేయండి. యెహోవా నాకు వెల్లడి చేసే సంగతిని తిరిగి వచ్చి మీతో చెప్తాను” అన్నాడు.
మోయాబు నాయకులు బిలాందగ్గర బస చేశారు.
9 దేవుడు బిలాందగ్గరికి వచ్చి “నీ దగ్గర ఉన్న ఆ మనుషులెవరు?” అని అడిగాడు.
10 దేవునితో బిలాం ఇలా అన్నాడు: “సిప్పోరు కొడుకూ మోయాబురాజూ అయిన బాలాకు ఈ కబురు పంపించాడు: 11 ఇప్పుడు ఈజిప్ట్ నుంచి వచ్చిన జనం ఈ ప్రదేశాన్నంతా కమ్ముతూ ఉంది. మీరు వెంటనే వచ్చి నాకోసం వాళ్ళను శపించండి. అప్పుడు నేను వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను పారదోలగలుగుతానేమో!”
12 అందుకు దేవుడు “నీవు వారితో వెళ్ళకూడదు. వారు దీవెనలు పొందిన ప్రజలు గనుక నీవు వారిని శపించకూడదు” అన్నాడు.
13 ఉదయం బిలాం లేచి బాలాకు నాయకులతో “మీ దేశానికి వెళ్ళండి. మీతో కూడా రావడానికి యెహోవా నాకు సెలవియ్యలేదు” అన్నాడు.
14 ✽మోయాబు నాయకులు లేచి బాలాకు దగ్గరికి చేరి “బిలాం మాతో కూడా రానన్నాడు” అని చెప్పారు.
15 బాలాకు కొంతమంది నాయకులను అక్కడికి మళ్ళీ పంపించాడు. మునుపు పంపించిన వాళ్ళకంటే ఈ నాయకులు సంఖ్యలో ఎక్కువమంది, వాళ్ళకంటే గొప్పవాళ్ళు కూడా. 16 వాళ్ళు బిలాం దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:
“సిప్పోరు కుమారుడైన బాలాకు ఈ విధంగా చెపుతున్నాడు – మీరు తప్పక రావాలని మా మనవి. మీరు రాకుండా ఏ ఆటంకం ఉండనివ్వకండి. 17 నేను మిమ్మల్ని గొప్పగా గౌరవిస్తాను. మీరు ఏం చెప్పినా అది నేను చేస్తాను. రండి! నాకోసం ఈ జనాన్ని శపించండి!”
18 ✽ బాలాకు సేవకులకు బిలాం ఇలా జవాబిచ్చాడు: “బాలాకు తన భవనాన్ని వెండి బంగారాలతో నింపి నాకిచ్చినా నా దేవుడైన యెహోవా ఆజ్ఞ మీరను. ఆయన ఆజ్ఞాపించిన దానికంటే తక్కువ గానీ ఎక్కువ గానీ చేయను. 19 ✽అయితే మీరు కూడా ఈ రాత్రి ఇక్కడ బస చెయ్యండి. యెహోవా నాతో ఇంకేం చెప్తాడో తెలుసుకొంటాను.”
20 ✽ఆ రాత్రి దేవుడు బిలాందగ్గరికి వచ్చి “ఆ మనుషులు నిన్ను పిలవడానికి వచ్చారు గదా. లేచి వారితో కూడా వెళ్ళు. అయితే నేను నీతో చెప్పినట్టే నీవు చెయ్యాలి” అన్నాడు.
21 ప్రొద్దున్నే బిలాం లేచి తన గాడిదకు జీను కట్టి మోయాబు నాయకులతో తరలివెళ్ళాడు. 22 ✽అతడు వెళ్ళినందుచేత దేవుని కోపాగ్ని రగులుకొంది. యెహోవా దూత అతడికి విరోధంగా త్రోవలో నిలబడ్డాడు. బిలాం తన గాడిదనెక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతడితోకూడా ఇద్దరు పనివారు ఉన్నారు. 23 యెహోవా దూత ఖడ్గం దూసి చేతపట్టుకొని త్రోవలో నిలబడి ఉన్నాడు. ఆ దూతను చూచి గాడిద త్రోవ విడిచి పొలంలోకి పోయింది. గాడిదను త్రోవకు మళ్లించాలని బిలాం దానిని కొట్టాడు. 24 అప్పుడు యెహోవా దూత ద్రాక్షతోటల సందులో నిలబడ్డాడు. ఇరుప్రక్కల గోడలు ఉన్నాయి. 25 యెహోవా దూతను చూచి గాడిద గోడమీద పడి బిలాం కాలును గోడకు అదిమింది. అతడు గాడిదను మళ్ళీ కొట్టాడు. 26 యెహోవా దూత ముందు వెళ్ళి ఇరుకు చోట నిలబడ్డాడు. కుడి వైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగడానికి స్థలం లేకపోయింది. 27 యెహోవాదూతను చూచి గాడిద బిలాం క్రింద కూలబడింది. బిలాం కోపంతో మండిపడి చేతికర్రతో గాడిదను కొట్టాడు. 28 ✝అప్పుడు యెహోవా ఆ గాడిద మాట్లాడేలా చేశాడు.
అది బిలాంతో “నువ్వు నన్ను ముమ్మారు కొట్టావేం! నేను నిన్నేం చేశాను?” అంది.
29 బిలాం, “నీవు నన్ను నవ్వులపాలు చేశావే! నా చేతిలో ఖడ్గం ఉంటే ఇప్పటికి నిన్ను చంపేసేవాణ్ణి” అని గాడిదతో అన్నాడు.
30 అందుకు గాడిద బిలాంతో “నేను నీ గాడిదను కానా? నీ జీవితకాలమంతా ఈ రోజువరకూ నన్నెక్కుతూ ఉన్నావు గదా! మునుపు నేనెప్పుడైనా నీకిలా చేశానా?” అంది. “లేదు” అన్నాడు బిలాం.
31 అప్పుడు, దూసిన ఖడ్గం చేతపట్టుకొని దారిలో నిలబడి ఉన్న యెహోవాదూతను బిలాం చూచేలా యెహోవా అతడి కళ్ళు తెరిచాడు. బిలాం నేలకు వంగి సాష్టాంగపడ్డాడు. 32 యెహోవా దూత అతడితో ఇలా చెప్పాడు:
“నీవు నీ గాడిదను ముమ్మారు కొట్టడం దేనికి? నీ ప్రవర్తన నా ఎదుట వక్రంగా ఉంది, గనుక నీకు విరోధిగా బయలుదేరి వచ్చాను. 33 ఆ గాడిద నన్ను చూచి ఈ మూడు సార్లు నా ఎదుట నుండి తొలగింది. ఒకవేళ అది అలా తొలగకపోతే నేను తప్పకుండా అప్పుడే నిన్ను చంపి దానిని బ్రతకనిచ్చేవాణ్ణి.”
34 ✽అందుకు బిలాం యెహోవాదూతతో “నేను తప్పిదం చేశాను. మీరు నాకు ఎదురుగా త్రోవలో నిలబడ్డారని నాకు తెలియదు. నేను వెళ్ళడం మీ దృష్టిలో చెడ్డ పని అనిపిస్తే నేను వెనుకకు వెళ్తాను” అన్నాడు.
35 ✽యెహోవా దూత బిలాంతో “నీవు ఆ మనుషులతోపాటు వెళ్ళు. అయితే నేను నీతో చెప్పే మాటలు తప్ప ఇంకేమీ చెప్పకూడదు” అన్నాడు. కనుక బిలాం బాలాకు నాయకులతో వెళ్ళాడు.
36 బిలాం వచ్చాడని బాలాకు విని ఈర్‌మోయాబుకు అతణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఆ ఊరు దేశ సరిహద్దుల చివర ఉన్న అర్నోను ఒడ్డున ఉండేది. 37 బాలాకు బిలాంతో ఇలా అన్నాడు:
“మిమ్మల్ని పిలవడానికి నేను మీ దగ్గరికి మనుషుల్ని పంపించాను గదా! మరి మీరెందుకు నా దగ్గరికి రాలేదు? నేను మిమ్ముల్ని ఘనపరచలేననుకుంటున్నారా?”
38 బిలాం బాలాకుకు ఇలా జవాబిచ్చాడు: “ఇదిగో నేను మీ దగ్గరికి వచ్చాను గదా! అయితే ఏదైనా చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట ఉంచే మాటలే చెప్తాను.”
39 బిలాం, బాలాకు బయలుదేరి కిర్యత్ హుజోతుకు చేరారు. 40 అక్కడ బాలాకు ఎడ్లనూ గొర్రెలనూ వధించి కొంత భాగం బిలాంకూ అతడిదగ్గర ఉన్న నాయకులకూ పంపించాడు. 41 ✽ప్రొద్దున బాలాకు బిలాంను వెంటబెట్టుకొని వెళ్ళి బయల్ దేవుడి ఎత్తయిన పూజా స్థలాల మీదికి ఎక్కించాడు. బిలాం అక్కడనుంచి ఇస్రాయేల్ ప్రజలను చివరివరకు చూశాడు.