21
1 ఇస్రాయేల్ ప్రజ అతారీం గుండా వస్తున్నారని అరాదులో ఉన్న రాజు విన్నాడు. ఆ రాజు కనానుజాతివాడు, దక్షిణ ప్రదేశం నివాసి. అతడు ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేసి వారిలో కొంతమందిని బందీలుగా తీసుకువెళ్ళాడు. 2 అందుచేత ఇస్రాయేల్ ప్రజలు యెహోవాకు “నీవు ఈ జనాన్ని పూర్తిగా మా వశం చేస్తే మేము వాళ్ళ పట్టణాలను నాశనం చేసితీరుతామ” ని మొక్కుబడి చేశారు. 3 యెహోవా వారి ప్రార్థన ఆలకించి ఆ కనానువాళ్ళను వారి వశం చేశాడు. వారు వాళ్ళనూ వాళ్ళ పట్టణాలనూ సర్వనాశనం చేశారు. అందుచేత ఆ స్థలం పేరు “హోర్మా”.
4  తరువాత ఇస్రాయేల్ ప్రజలు ఎదోం చుట్టూరా వెళ్ళాలని హోరు పర్వతంనుంచి ఎర్రసముద్రానికి వెళ్ళే త్రోవ పట్టి ప్రయాణం చేశారు. మార్గాయాసంచేత ప్రజలు ఓపిక పట్టలేక, 5  దేవునికీ మోషేకూ విరోధంగా మాట్లాడి, “ఈ ఎడారిలో మేము చనిపోవాలని ఈజిప్ట్‌నుంచి మీరు మమ్మల్ని రప్పించారెందుకు? ఇక్కడ తిండి లేదు, నీళ్ళూ లేవు. ఈ చప్పని రొట్టెలు చూసి మాకు వెగటు పుడతుంది” అన్నారు.
6 అందుచేత ప్రజలమధ్యకు యెహోవా విషం గల పాములను పంపించాడు. అవి వారిని కరిచాయి, గనుక ఇస్రాయేల్ ప్రజల్లో చాలామంది చనిపోయారు.
7 అయితే ప్రజలు మోషేదగ్గరికి వచ్చి, “మేము యెహోవాకూ నీకూ విరోధంగా మాట్లాడి తప్పిదం చేశాం, యెహోవా మా మధ్యనుంచి ఈ పాములను తొలగించేలా ఆయనను వేడుకో” అన్నారు. ప్రజలకోసం మోషే ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతడితో ఇలా అన్నాడు:
8 “నీవు విషం గల పాములాంటి రూపాన్ని చేయించి స్తంభంమీద పెట్టు. పాము కరిచినవారెవరైనా సరే ఆ రూపం వైపు చూస్తే బ్రతుకుతారు. 9 అందుచేత మోషే కంచు పామును చేయించి స్తంభంమీద ఉంచాడు. పాము కరించిన వారెవరైనా సరే ఆ కంచు పామును చూచినప్పుడు బ్రతికారు.
10 తరువాత ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసి ఓబోతులో దిగారు. 11 ఓబోతునుంచి ప్రయాణమైపోయి ఈయె–అబారీం దగ్గర దిగారు. అది తూర్పుదిక్కుగా ఉన్న మోయాబు ఎదుట ఉన్న ఎడారిలో ఉంది. 12 అక్కడనుంచి వారు ప్రయాణం చేసి జెరెద్ లోయలో దిగారు. 13 అక్కడనుంచి ప్రయాణం చేసి ఎడారిలో అర్నోను నది అవతలి ఒడ్డున దిగారు. ఆ నది అమోరీవాళ్ళ దేశ సరిహద్దులనుంచి పారుతుంది. అర్నోను నది మోయాబుకూ అమోరీవాళ్ళ దేశానికీ మధ్య ఉన్న మోయాబు సరిహద్దు. 14 అందుచేత “యెహోవా యుద్ధాలు” అనే పుస్తకంలో 15 “సూషాలో ఉన్న వాహేబ్, అర్నోనులోయలు, ఆర్ అనే స్థలంవరకు ఉన్న అర్నోను కనుమలు, మోయాబు సరిహద్దుకు సమీపంగా ఉన్న ఆ కనుమలు” అని వ్రాసి ఉంది.
16 అక్కడనుంచి వారు బెయేర్‌కు వెళ్ళారు. అక్కడి బావిని గురించి యెహోవా మోషేతో, “ఈ ప్రజలను సమకూర్చు. నేను వారికి నీళ్ళు ఇస్తాను” అన్నాడు.
17,18 అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఈ పాట పాడారు:
“బావీ! పైకి ఉబుకు!
ఈ బావిని ప్రజల నాయకులు తవ్వారు.
వారి అధికార దండాలతో,
వారి చేతికర్రలతో దీనిని తవ్వారు.
ఈ బావికి పాడండి”.
19 వారు ఆ ఎడారినుంచి మత్తానుకు, మత్తాను నుంచి నహలీయేల్‌కు, నహలీయేల్ నుంచి బామోతుకు పయనించారు. 20 బామోతు నుంచి నిర్జన ప్రదేశానికి ఎదురుగా ఉన్న పిస్గా పర్వతం దగ్గర ఉన్న మోయాబు లోయకు ప్రయాణం చేశారు.
21 అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు అమోరీవాళ్ళ రాజైన సీహోను దగ్గరికి రాయబారులను పంపి ఇలా మనవి చేశారు: 22 “మమ్ములను మీ దేశం మీదుగా దాటిపోనివ్వండి. పొలాలలో ద్రాక్షతోటలలో పడి వెళ్ళము. బావుల నీళ్ళు త్రాగము. మీ దేశం సరిహద్దును దాటేవరకూ రాజమార్గంలోనే సాగిపోతాం”.
23 అయితే ఇస్రాయేల్ ప్రజలను తన సరిహద్దు దాటడానికి సీహోను అనుమతించలేదు. దానికి బదులు అతడు తన సైన్యాన్నంతా పోగు చేసి ఇస్రాయేల్‌ప్రజలను ఎదుర్కోవడానికి ఎడారిలోకి వచ్చి యాహజుకు చేరి వారితో యుద్ధం చేశాడు. 24 ఇస్రాయేల్ ప్రజలు వాణ్ణి ఖడ్గంచేత రూపుమాపి వాడి దేశాన్ని అర్నోను నదినుంచి యబ్బోకు సెలయేరు వరకు స్వాధీనం చేసుకొన్నారు. యబ్బోకు అమ్మోనువాళ్ళ సరిహద్దు. ఆ సరిహద్దుకు బలమైన కోటలూ బురుజులూ ఉన్నాయి. 25 ఇస్రాయేల్ ప్రజలు అమోరీవాళ్ళ పట్టణాలన్నీ పట్టుకొన్నారు. వాళ్ళ పట్టణాలన్నిటిలో హెష్బోనులో దాని చుట్టు ఉన్న గ్రామాలన్నిటిలో ఉండిపోయారు. 26 హెష్బోను అమోరీవాళ్ళ రాజు సీహోను పట్టణం. సీహోను అంతకుముందు మోయాబురాజుతో యుద్ధం చేసి అర్నోనునది వరకు ఉన్న ప్రదేశమంతా పట్టుకొన్నాడు. 27 అందుచేత కవులు చెప్తారు:
“హెష్బోనుకు రండి!
సీహోను పట్టణాన్ని నిర్మించాలి!
దానిని స్థాపించాలి!
28 హెష్బోనునుంచి అగ్ని బయలుదేరింది.
సీహోను పట్టణంనుంచి మంటలు
ప్రజ్వలించాయి.
అవి మోయాబులోని ఆర్‌ను కాల్చివేశాయి.
అర్మోను దగ్గర ఉన్న ఎత్తయిన స్థలాలను
తగలబెట్టాయి.
29 మోయాబూ, నీకు బాధ!
కెమోషు ప్రజలారా,
మీరు నాశనమయ్యారు!
వాడు తన కొడుకుల్ని పలాయితుల్ని చేశాడు.
తన కూతుళ్ళను అమోరీవాళ్ళ రాజైన
సీహోనుదగ్గరికి బందీలుగా వెళ్ళనిచ్చాడు.
30 వాటిమీద గురిపెట్టి కొట్టాం.
దీబోనువరకు హెష్బోను నాశనమైంది.
నోఫహు వరకు దేశాన్ని పాడు చేశాం.
మంటలు మేదెబా వరకు వ్యాపించాయి.”
 
31 ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలు అమోరీవాళ్ళ దేశంలో ఉండిపోయారు. 32 యాజెరును చూడడానికి మోషే గూఢచారులను పంపించాడు. ఇస్రాయేల్ ప్రజలు ఆ పట్టణాన్నీ దాని చుట్టూరా ఉన్న గ్రామాలనూ పట్టుకొన్నారు. అక్కడ ఉన్న అమోరీవాళ్ళను పారదోలారు. 33 తరువాత బాషాను దేశంవైపు తిరిగి, ఆ దిక్కుగా సాగిపోయారు. బాషాను రాజైన ఓగు తన ప్రజలందరితోపాటు ఎద్రెయీ దగ్గర ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి వారికి ఎదురుగా బయలుదేరాడు. 34 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
“వాడికి భయపడకు. నేనే వాణ్ణీ వాడి జనులందరినీ వాడి దేశాన్నీ నీ వశం చేశాను. హెష్బోనులో నివసించిన అమోరీవాళ్ళ రాజైన సీహోనుకు నీవు చేసినట్టు వాడికి చేస్తావు.
35 అలాగే వారు వాణ్ణీ వాడి కొడుకులనూ వాడికి ఎవ్వడూ మిగలకుండా వాడి జనాన్నీ కూలగొట్టారు. వాడి దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు.