20
1 ఏడాది మొదటి నెల ఇస్రాయేల్ ప్రజలు – ఆ సమాజమంతా – సీన్ ఎడారికి చేరుకొని కాదేషులో దిగారు. అక్కడ మిర్యాం చనిపోయి సమాధి చేయబడింది. 2 సమాజానికి నీళ్ళు లేకపోవడంవల్ల ప్రజలు మోషే అహరోనులపై విరోధ భావంతో పోగయ్యారు. 3 వారు మోషేతో జగడమాడుతూ, “అయ్యో, మా సాటివాళ్ళు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చనిపోయి ఉంటే ఎంత బాగుండేది! 4 ఈ ఎడారిలో మేమూ మా పశువులూ చచ్చిపోయేట్టు యెహోవా యొక్క సమాజాన్ని నువ్వు ఇక్కడికి తెచ్చావేం! 5 ఈ చెడ్డ చోటికి ఈజిప్ట్‌నుంచి మమ్మల్ని రప్పించావేం! ఇది విత్తనాలు చల్లే చోటు కాదు. అంజూరాలూ ద్రాక్షలూ దానిమ్మలూ ఏమీ లేవు. తాగడానికి నీళ్ళు కూడా లేవు” అన్నారు.
6 మోషే అహరోనులు సమాజం ఎదుటనుంచి సన్నిధిగుడారం ద్వారందగ్గరికి వెళ్ళి సాష్టాంగపడ్డారు. అప్పుడు యెహోవా మహిమాప్రకాశం వారికి కానవచ్చింది.
7 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 8 “నీవు నీ కర్రను చేతపట్టుకొని నీవూ నీ అన్న అహరోనూ ఈ సమాజాన్ని సమకూర్చాలి. అప్పుడు నీవు వారి కళ్ళెదుట ఆ బండతో మాట్లాడు. దానిలోనుంచి నీళ్ళు వస్తాయి. ఈ విధంగా నీవు ఆ బండలో నుంచి నీళ్ళు రప్పించి సమాజానికీ వారి పశువులకూ నీళ్ళు ఇవ్వాలి.”
9 యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞననుసరించి మోషే ఆయన ముందునుంచి తన కర్ర తీసుకొన్నాడు. 10  మోషే అహరోనులు సమాజాన్ని ఆ బండ ఎదుట సమకూర్చారు. వారితో, “ద్రోహులారా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అని మోషే అన్నాడు.
11 అప్పుడు మోషే చెయ్యి ఎత్తి రెండు సార్లు తన కర్రతో ఆ బండను కొట్టాడు. వెంటనే నీళ్ళు ధారలై బయలువెడలాయి. ప్రజలు త్రాగారు, వారి పశువులు త్రాగాయి. 12 అయితే మోషే అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు:
“మీరు ఇస్రాయేల్‌వారి కళ్ళెదుట నా పవిత్రతను నిలబెట్టేటంతగా నన్ను నమ్మలేదు గనుక నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకువెళ్ళలేరు.”
13 ఆ నీళ్ళకు మెరీబా అని పేరు. ఎందుకంటే, అక్కడ ఇస్రాయేల్ ప్రజలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్య తన పవిత్రతను రుజువుపరచుకొన్నాడు.
14 ఆ తరువాత మోషే కాదేషునుంచి ఎదోమ్ దేశం రాజుదగ్గరికి రాయబారులను ఈ కబురుతో పంపించాడు: “మీ సోదరుడు ఇస్రాయేల్ ఇలా మనవి చేస్తున్నాడు – మాకు వచ్చిన కష్టమంతా మీకు తెలుసు. 15 మా పూర్వీకులు ఈజిప్ట్‌కు వెళ్ళారు. మేము ఈజిప్ట్‌లో చాలా కాలం కాపురమున్నాం. ఈజిప్ట్‌వాళ్ళు మా పూర్వీకులనూ మమ్ములనూ బాధించారు. ఇదంతా మీకు తెలుసు. 16 మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు మా మొర విని ఆయన దూతను పంపి ఈజిప్ట్‌నుంచి మమ్ములను తీసుకు వచ్చాడు. ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాం. ఈ ఊరు మీ సరిహద్దుల కొనలో ఉంది గదా. 17 మమ్ములను మీ దేశం మీదుగా దాటిపోనియ్యండి. పొలాలలో ద్రాక్షతోటలలో పడి వెళ్ళము. బావుల నీళ్ళు తాగము. రాజమార్గంలోనే సాగిపోతాం. మీ దేశం సరిహద్దును దాటేవరకూ కుడివైపుకూ ఎడమవైపుకూ తిరగకుండా వెళ్ళిపోతాం.”
18 అయితే ఎదోంవారు వారికి “మీరు మా దేశంగుండా వెళ్ళకూడదు. వెళ్ళారా, మేం ఖడ్గంతో వచ్చి మీమీద పడతాం సుమా!” అని జవాబిచ్చారు.
19 అందుకు ఇస్రాయేల్ ప్రజలు “మేము రాజమార్గంలోనే సాగిపోతాం. మేమూ మా పశువులూ మీ నీళ్ళు తాగితే దానికి డబ్బు ఇస్తాం. హాని ఏమీ చెయ్యము. మమ్ములను కాలినడకనే దాటిపోనివ్వండి” అన్నారు.
20 కానీ వారు “మీరు దాటి రానేకూడదు” అన్నారు.
అంతేగాక, ఎదోం రాజు జనసమూహంతో చాలా బలంతో వారికెదురుగా తరలివచ్చాడు. 21 ఈ విధంగా ఎదోంవాళ్ళు ఇస్రాయేల్ ప్రజలను తమ సరిహద్దులగుండా దాటిపోనివ్వలేదు. గనుక ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళదగ్గరనుంచి తొలగిపోయారు.
22 ఇస్రాయేల్ ప్రజలు, ఆ సమాజమంతా, కాదేషునుంచి ప్రయాణమై హోరు పర్వతానికి చేరారు. 23 ఎదోందేశ సరిహద్దుల దగ్గర ఉన్న ఆ హోరు పర్వతంలో యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు:
24 “మీరు మెరీబా నీళ్ళదగ్గర నా మాటకు ఎదురు తిరిగారు, గనుక నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించడు. అతడు తన పూర్వీకులదగ్గరికి చేరుతాడు. 25 నీవు అహరోనునూ అతడి కొడుకైన ఎలియాజరునూ వెంటబెట్టుకొని హోరు పర్వతమెక్కి 26 అహరోను వస్త్రాలు తీసి అతడి కొడుకైన ఎలియాజరుకు తొడిగించు. అక్కడే అహరోను చనిపోయి అతడి పూర్వీకుల దగ్గరికి చేరుతాడు.”
27 యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉంటే వారు హోరు పర్వతమెక్కారు. 28 అక్కడ మోషే అహరోను వస్త్రాలు తీసి అతడి కొడుకు ఎలియాజరుకు తొడిగించారు. అహరోను ఆ పర్వత శిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు పర్వతం దిగివచ్చారు. 29 అహరోను చనిపోయాడని సమాజమంతటికీ తెలిసింది. గనుక ఇస్రాయేల్ వంశస్థులంతా అహరోనుకోసం ముప్ఫయి రోజులు శోకించారు.