19
1 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు: 2 ✝“యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర శాసనం ఇది. ఇస్రాయేల్ ప్రజలు ఎర్రని ఆవు పెయ్యను మీదగ్గరికి తేవాలని వారితో చెప్పు. అది లోపమూ మచ్చా లేనిదై ఎప్పుడూ కాడిక్రిందికి రానిదై ఉండాలి. 3 ✝మీరు దానిని యాజి అయిన ఎలియాజరుకు అప్పగించాలి. ఒకడు దానిని శిబిరం వెలుపలికి తోలుకుపోయి ఎలియాజరు ఎదుట దానిని వధించాలి. 4 ఎలియాజరుయాజి దాని రక్తంలో కొంత వ్రేలితో తీసి సన్నిధిగుడారంవైపు ఆ రక్తం ఏడుసార్లు చిలకరించాలి. 5 ✝అతడి కళ్ళెదుట ఆ మనిషి ఆ ఆవు పెయ్యను కాల్చివేయాలి. దాని చర్మాన్నీ మాంసాన్నీ రక్తాన్నీ పేడనూ కాల్చివేయాలి. 6 అప్పుడు యాజి దేవదారుకర్రనూ హిస్సోపు రెమ్మనూ ఎర్రని దారాన్నీ తీసుకొని ఆ పెయ్యను కాలుస్తున్న మంటల్లో వేయాలి. 7 ✝అప్పుడు యాజి తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేయాలి. తరువాత అతడు శిబిరంలో ప్రవేశించవచ్చు, గాని సాయంకాలం దాకా అశుద్ధంగా ఉంటాడు. 8 ఆ పెయ్యను కాల్చినవాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. అతడు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటాడు. 9 ✝శుద్ధంగా ఉన్నవాడు ఆ ఆవు పెయ్య బూడిదను పోగు చేసి శిబిరం బయట శుద్ధమైనచోట ఉంచాలి. దానిని ఇస్రాయేల్ ప్రజలకోసం అపవిత్రాన్ని తొలగించే నీళ్ళకోసం భద్రం చేయాలి. ఆ పెయ్య పాపాలకోసం బలి. 10 ఆ పెయ్య బూడిదను పోగు చేసినవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటాడు. ఈ చట్టం ఇస్రాయేల్ ప్రజలకూ వారిలో నివసించే విదేశీయులకూ ఎల్లకాలం నిలిచి ఉంటుంది.11 ✝“ఎవరైనా ఏ మనిషి శవాన్నైనా తాకితే ఆ వ్యక్తి ఏడు రోజులు అశుద్ధంగా ఉంటాడు. 12 ✽అతడు మూడో రోజున, ఏడో రోజున ఆ నీళ్ళతో తనను శుద్ధి చేసుకోవాలి. అప్పుడతడు పవిత్రంగా ఉంటాడు. మూడో రోజున, ఏడో రోజున తనను శుద్ధి చేసుకోకపోతే అతడు శుద్ధంగా ఉండడు. 13 ఎవరైనా సరే ఏ మనిషి శవాన్నైనా తాకి తనను శుద్ధి చేసుకోకపోతే ఆ వ్యక్తి యెహోవా నివాసాన్ని అశుద్ధం చేస్తున్నాడన్నమాట. అతణ్ణి ఇస్రాయేల్ ప్రజలలో లేకుండా చేయాలి. అశుద్ధతను తొలగించే నీళ్ళు అతడిమీద చిలకరించడం జరగలేదు, గనుక అతడు అశుద్ధంగా ఉంటాడు. అతడి అశుద్ధత అతడిమీద నిలిచి ఉంటుంది.
14 “ఎవరైనా గుడారంలో చనిపోతే దాన్ని గురించిన చట్టం ఇది: ఆ గుడారంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఏడురోజులు అశుద్ధంగా ఉంటారు, గుడారంలో ఉన్న ప్రతిదీ ఏడు రోజులు అశుద్ధంగా ఉంటుంది. 15 మూత కప్పివేసి ఉండని ప్రతి పాత్రా కూడా అశుద్ధంగా ఉంటుంది. 16 పచ్చిక మైదానాలలో ఖడ్గంచేత హతమైనవాణ్ణి గానీ తనంతట తానే చనిపోయినవాణ్ణి గానీ మనిషి ఎముకను గానీ గోరీని గానీ ఎవరైనా తాకితే అతడు ఏడు రోజులు అశుద్ధంగా ఉంటాడు. 17 అలాంటి వ్యక్తికోసం వారు పాపాలకోసమైన హోమబలి బూడిద కొంత పాత్రలో వేసి ఆ బూడిదమీద పారే నీళ్ళు పోయాలి. 18 అప్పుడు శుద్ధంగా ఉన్న వాడెవడైనా హిస్సోపు రెమ్మను చేతపట్టుకొని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారంమీదా దానిలోని సామానంతటిమీదా దానిలో ఉన్న మనుషులమీదా నీళ్ళు చిలకరించాలి, ఎముక గానీ హతమైనవాణ్ణిగానీ తనంతట తానే చనిపోయినవాణ్ణి గానీ గోరీని గానీ తాకినవాడిమీద కూడా ఆ నీళ్ళు చల్లాలి. 19 ✽శుద్ధంగా ఉన్న ఆ మనిషి అశుద్ధంగా ఉన్న ఆ వ్యక్తిమీద మూడో రోజున ఏడో రోజున దాన్ని చల్లాలి. ఏడోరోజున అతడు ఆ వ్యక్తిని శుద్ధి చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. ఆ సాయంకాల సమయంలో అతడు పవిత్రం అవుతాడు. 20 అశుద్ధంగా ఉన్న వాడెవడైనా తనను శుద్ధి చేసుకోకపోతే యెహోవా పవిత్రస్థానాన్ని అశుద్ధం చేసినట్టే. అతణ్ణి సమాజంలో లేకుండా చేయాలి. అశుద్ధతను తొలగించే జలం అతడిమీద చిలకరించడం జరగలేదు, గనుక అతడు అశుద్ధంగానే ఉంటాడు. 21 ఇది వారికి ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. అశుద్ధతను తొలగించే నీళ్ళు చిలకరించేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ జలం తాకినవాడు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటాడు. 22 అశుద్ధంగా ఉన్నవాడు తాకిన ప్రతిదీ అశుద్ధమౌతుంది. అతణ్ణి తాకినవాడెవడైనా సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటాడు.”