18
1 ✽యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “ఈ పవిత్ర స్థానాన్ని గురించిన అపరాధాలకు నీవూ నీ కొడుకులూ నీ వంశంవారూ బాధ్యులు, మీ యాజి ధర్మాన్ని గురించిన అపరాధాలకు నీవూ నీ కొడుకులూ బాధ్యులు. 2 నీవూ నీ కొడుకులూ శాసనాల గుడారం ఎదుట సేవ చేసేటప్పుడు, నీతండ్రి గోత్రమైన లేవీగోత్రంలోని మిగతా నీ సాటివారిని అక్కడికి చేర్చు. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయాలి. 3 ✝వారు గుడారమంతటికి సంబంధించిన సేవ చేయడానికి పూనుకొని నీవు చెప్పే పనులను చెయ్యాలి. అయితే పవిత్ర స్థలంలోని వస్తువులనూ బలిపీఠాన్నీ వారు సమీపించకూడదు. ఒక వేళ సమీపిస్తే వారూ మీరూ చస్తారు సుమా. 4 వారు నీతో కలిసి సన్నిధిగుడారానికి సంబంధించిన అన్ని రకాల సేవ చేయడానికి పూనుకోవాలి. కాని సామాన్యుడెవ్వడూ మిమ్ములను అలా సమీపించకూడదు. 5 ఇస్రాయేల్‌ప్రజల మీదికి నా కోపాగ్ని రాకుండేలా పవిత్ర స్థలానికీ బలిపీఠానికీ సంబంధించిన సేవ మీరే చూచుకోవాలి. 6 ✝నేను ఇస్రాయేల్ ప్రజలలోనుంచి నీ బంధువులైన లేవీగోత్రికులను ప్రత్యేకించుకొన్నాను. సన్నిధిగుడారం సేవచేయడానికి వారిని యెహోవా మీకోసం నియమించాడు. 7 ✽కాని, నీవూ నీ కొడుకులూ మాత్రమే బలిపీఠానికీ అడ్డతెర వెనుక ఉన్న అతి పవిత్ర స్థలానికీ సంబంధించిన సేవ చేస్తూ, మీ యాజిధర్మాన్ని నిర్వహిస్తూ ఉండాలి. నేను ఈ యాజిపదవిని దయతో మీకు ప్రసాదించాను. సామాన్యుడెవడైనా దాన్ని సమీపిస్తే మరణశిక్ష పొందుతాడు.”8 ✽యెహోవా అహరోనుతో ఇంకా అన్నాడు, “ఇస్రాయేల్ ప్రజలు నాకు తెచ్చే పవిత్ర అర్పణలన్నిటి బాధ్యత నీకు అప్పగించాను. నీకూ నీ సంతతివారికీ వంతుగా వాటిని ఇచ్చాను. ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం. 9 బలిపీఠం మీది నిప్పులో కాలని అతి పవిత్ర అర్పణలో నీకు రావలసినవి ఇవి: వారు నాకు అర్పించే నైవేద్యాలన్నీ పాపాలకోసమైన బలులన్నీ అపరాధ బలులన్నీ. అవన్నీ అతి పవిత్రం. అవి నీకూ నీ కొడుకులకూ చెందుతాయి. 10 మీరు వాటిని అతి పవిత్రమైనవిగా ఎంచి తినాలి. మీలో ప్రతి మగవాడూ వాటిని తినాలి. అవి నీకు పవిత్రంగా ఉంటాయి. 11 ఇస్రాయేల్‌ప్రజలు అర్పించేదానిలో కదలిక అర్పణలన్నీ కూడా నీకు చెందుతాయి. నేను వాటిని నీకూ నీ కొడుకులకూ నీ కూతుళ్ళకూ ఇచ్చాను. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. నీ ఇంటివారిలో శుద్ధంగా ఉండేవారంతా వాటిని తినవచ్చు. 12 ఇస్రాయేల్ ప్రజ యెహోవాకు అర్పించే ధాన్యంలో ద్రాక్షరసంలో నూనెలో మేలిరకమైనదాన్ని, అంటే ప్రజలు అర్పించే ప్రథమ ఫలాన్ని నీకిచ్చాను. 13 వారు తమ దేశం పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చే ప్రథమ ఫలాలు నీకు చెందుతాయి. నీ ఇంటివారిలో శుద్ధంగా ఉండేవారంతా వాటిని తినవచ్చు. 14 ఇస్రాయేల్ ప్రజలు ప్రతిష్ఠ చేసిన ప్రతిదీ నీదవుతుంది. 15 మనుషులలో మొదట పుట్టినవారిని జంతువులలో మొదట పుట్టినవాటిని వారు యెహోవాకు ప్రతిష్ఠిస్తారు గదా. ప్రతి తొలిచూలు పిల్ల నీదవుతుంది. అయితే మనుషుల తొలిచూలు పిల్లలనూ అశుద్ధ జంతువుల తొలిచూలు పిల్లలనూ నీవు వెల ఇచ్చి విడిపించి తీరాలి. 16 పుట్టిన నెలనాటికి నీవు నిర్ణయించే వెలప్రకారం అయిదు తులాల వెండి ఇచ్చి వారిని విడిపించాలి. ఆ తులాలు పవిత్ర స్థానం తులాలప్రకారం ఉండాలి. తులం ముప్ఫయి చిన్నాలు. 17 కాని, ఆవులలో గొర్రెలలో మేకలలో తొలిచూలులను విడిపించకూడదు. అవి ప్రతిష్ఠ చేసినవి. వాటిని వధించి వాటి రక్తం బలిపీఠం చుట్టు పోసి యెహోవాకు పరిమళ హోమంగా వాటి కొవ్వును కాల్చి వేయాలి. 18 వాటి మాంసం నీదవుతుంది. కదలిక అర్పణగా ఉన్న బోర, కుడితొడ నీకు చెందినట్టే అది కూడా నీకు చెందుతుంది. 19 ఇస్రాయేల్ ప్రజలు యెహోవాకు తెచ్చే ఆ పవిత్ర అర్పణలన్నిటినీ నేను నీకూ నీ కొడుకులకూ నీ కూతుళ్ళకూ మీ భాగంగా ఇచ్చాను. ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం. ఇది నీకూ నీతోపాటు నీ సంతానానికీ యెహోవా సన్నిధానంలో నిత్యమైన స్థిరమైన ఒడంబడిక”.
20 యెహోవా అహరోనుతో ఇంకా అన్నాడు, “వారి దేశంలో నీకు వారసత్వం ఉండదు. వారి మధ్య నీకు భాగం ఉండదు. ఇస్రాయేల్ ప్రజల మధ్య నీ భాగమూ నీ వారసత్వమూ నేనే. 21 ఇస్రాయేల్ ప్రజలు ఇచ్చే పదో వంతులను నేను లేవీ వంశస్థులకు వారసత్వంగా ప్రసాదించాను. ఇది వారు చేసే సన్నిధిగుడారం సేవకోసం. 22 మిగతా ఇస్రాయేల్ ప్రజలు అపరాధులై చావకుండేలా ఇకనుంచి వారు సన్నిధిగుడారానికి రాకూడదు. 23 సన్నిధిగుడారం సేవ లేవీ వంశస్థులే చేయాలి. ఆ సేవలో తప్పులకు వారే బాధ్యులు. ఇస్రాయేల్ ప్రజల మధ్య వారికి వారసత్వమేమీ ఉండదు. ఇది మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. 24 ఇస్రాయేల్‌ప్రజలు యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠ చేసే పదో భాగాన్ని నేను లేవీ వంశస్థులకు వారసత్వంగా ఇచ్చాను. అందుచేతే వారికి ఇస్రాయేల్‌ప్రజల మధ్య వారసత్వం ఉండదని వారితో చెప్పాను.”
25 యెహోవా మోషేతో అన్నాడు, 26 “నీవు లేవీవారితో ఈ విధంగా చెప్పు – నేను ఇస్రాయేల్ ప్రజలచేత మీకు వారసత్వంగా పదో వంతులను ఇప్పించాను. మీరు వాటిని వారిదగ్గర తీసుకొన్నప్పుడు ఆ పదో భాగంలో పదో వంతులను యెహోవాకు అర్పణగా ప్రత్యేకించాలి. 27 మీరు అలా ప్రత్యేకించే అర్పణలు కళ్ళంలోని ధాన్యంలాగా ద్రాక్షగానుగ తొట్టి ఫలాల్లాగా లెక్కలోకి వస్తాయి. 28 మీరు ఇస్రాయేల్‌ప్రజల దగ్గర పుచ్చుకొనే పదో వంతులన్నిటిలోనుంచి యెహోవాకు అర్పణలు ప్రత్యేకించాలి. యెహోవాకు ప్రత్యేకించే ఆ అర్పణలను యాజి అయిన అహరోనుకు ఇవ్వాలి. 29 మీకు ఇచ్చిన వాటన్నిటిలోనుంచి యెహోవాకు రావలసినదంతా మీరు ప్రత్యేకించాలి. వాటిలో శ్రేష్ఠమైనవాటినీ ప్రతిష్ఠితమైనవాటినీ ప్రత్యేకించాలి.
30 “నీవు లేవీగోత్రికులతో ఇలా చెప్పాలి: మీరు వాటిలో మేలిరకమైనవాటిని ప్రత్యేకించేటప్పుడు మిగిలినదీ కళ్ళంలోని ధాన్యమూ ద్రాక్షగానుగ తొట్టి ఫలాలూ కర్షకుడికి చెందినట్టే మీవని భావించుకోవాలి. 31 మీరూ మీ కుటుంబంవారూ ఎక్కడైనా దానిని తినవచ్చు. అది సన్నిధిగుడారంలో మీరు చేసే సేవకు జీతం. 32 మీరు ఆ అర్పణలలో నుంచి శ్రేష్ఠమైనవాటిని యెహోవాకు ప్రత్యేకించిన తరువాత మిగతా వాటిని తినడంవల్ల అపరాధులు కారు. అయితే మీరు చావకుండేలా ఇస్రాయేల్ ప్రజలు ప్రతిష్ఠించేవాటిని అపవిత్రం చేయకూడదు.”